సాక్షి, ముంబై: బంగారు ఆభరణాల విక్రయాల ప్రమోషన్ల పేరుతో ఆభరణాల సంస్థలు తీసుకొస్తున్న గోల్డ్ స్కీమ్‌లు వినియోగదారులను నట్టేట ముంచుతున్నాయి. ఇటీవల ముంబైలో కోట్లాది రూపాయల మేర వినియోగదారులను ముంచేసిన గుడ్‌విన్ స్కాం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే రసిక్‌లాల్ సంకల్‌చాంద్ జ్యువెల్లరీ (ఆర్‌ఎస్‌జే) అనే మరో జ్యువెల్లరీ సంస్థ కుంభకోణం బహిర్గతమైంది. దీంతో భారీగా నష్టపోయిన కస‍్టమర్లు లబోదిబో మంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు.
గుడ్‌విన్ తరహాలోనే గత నెల (అక్టోబర్) 28న ఆర్‌ఎస్‌జే దుకాణాలను తాళాలు వేయడంతో వినియోగదారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా తాజాగా ఆర్‌ఎస్‌జే దుకాణం యజమానులు జయేష్ రసిక్‌లాల్ షా(55), నీలేష్ రసిక్‌లాల్ షా (53)ను ముంబై ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అరెస్టు చేసింది. మొత్తం రూ.300 కోట్ల వరకు వినియోగదారులను మోసగించినట్టుగా ప్రాథమికంగా తేలిందని పోలీసు అధికారి మంగళవారం చెప్పారు.
ఫిర్యాదు చేస్తున్న ఆర్‌ఎస్‌జె ఉద్యోగులు
డిపాజిట్ పథకాలపై వినియోగదారులకు మంచి రాబడిని వస్తుందని నమ్మబలకడంతో చాలామంది అనేక నెలలుగా ఈ గోల్డ్ స్కీంలలో పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టారని తెలిపారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 420 (మోసం), 406 (క్రిమినల్ ట్రస్ట్ ఉల్లంఘన), మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ (ఎంపిఐడి) చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. అలాగే గత వారం కొంతమంది ఉద్యోగులు కూడా సంస్థ తమకు ఆరు నెలలుగా వేతనాలివ్వడలేదని లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment