Gold fund
-
బంగారాన్ని అందుకు కొంటున్నారా?
ఎస్బీఐ గోల్డ్‌ఫండ్‌లో 2012లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఈ ఫండ్‌కు సంబంధించి గ్రోత్ ఆప్షన్ డైరెక్ట్ ప్లాన్‌ను ఎంచుకున్నాను. ఈ ఫండ్ ఎన్ఏవీ ఆరంభంలో ఎంత ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఆరంభం నుంచే ఈ ఫండ్ ఎన్ఏవీను గమనిస్తున్నాను. ఈ ఫండ్ గరిష్ట ఎన్ఏవీ రూ.10.82 మాత్రమే. ఎన్ఏవీలో ఎలాంటి ఎదుగూ, బొదుగూ లేకపోవడం నష్టమేగా! ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? –ధనుంజయ్, విశాఖపట్టణం రాబడుల కోసం పుత్తడిలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టొద్దు. పుత్తడి మంచి వెలుగులు విరజిమ్మింది కొన్ని సంవత్సరాల్లోనే. 2005 నుంచి 2012 సంవత్సరాల వరకూ పుత్తడి ధరలు పెరిగాయి. 2008లో మంచి ధర పలికిన ఒకే ఒక అసెట్ క్లాస్.. బంగారం మాత్రమే. ఆ ఏడాది అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉండటంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పుత్తడికి బాగా డిమాండ్ పలికింది. ఒక విధంగా చెప్పాలంటే బంగారం... అనుత్పాదక ఆస్తి. చివరి సురక్షిత మదుపు సాధనం కూడా ఇదే. ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇది రాణించగలుగుతుంది. లేకుంటే చాలా అధ్వాన పనితీరు చూపించే మదుపు సాధనం కూడా ఇదే. మీరు ఏ ఆస్తిలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు, దాని మీద ఎంత రాబడి వస్తుందో అని ఆలోచించాలి. బాండ్లలో పెట్టుబడులు పెట్టినా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ), ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసినా, మీకు గ్యారంటీగా కొంత మొత్తంలో రాబడులు వస్తాయి. అదే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, ఆ మేరకు మీకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. అదే రియల్టీలో ఇన్వెస్ట్ చేస్తే, ఇల్లు గానీ, స్థలం గానీ మీ పరమవుతుంది. ఇంట్లో మీరు నివసించవచ్చు. లేదా అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చు. కాలంతో పాటు ఇల్లు, స్థలం విలువలు పెరుగుతాయి. అదే మీరు పుత్తడిలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఇలాంటి ఏ విలువలూ మీకు రావు. ఇది కేవలం విలువ నిల్వకు మాత్రమే పనికొస్తుంది. అంతేకాకుండా మీ దగ్గర బంగారం ఉంటే, దాని భద్రత కోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది కూడా. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఎక్స్పెన్స్ రేషియో అధికంగా ఉంటుంది కూడా ! బంగారం కేవలం వినియోగం కోసమే, ఆభరణాలు ధరించి ఆనందం పొందడం కోసమే. పెట్టుబడుల కోసం పుత్తడిని ఎప్పుడూ పరిగణించకూడదు. అందుకని మీ ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ నుంచి వైదొలగండి. పుత్తడితో అనుసంధానమున్న ఏ పెట్టుబడి సాధనంలోనూ భవిష్యత్తులో ఇన్వెస్ట్ చేయకండి. ప్ర: మార్కెట్లో రంగాల వారీ ప్రత్యేక ఫండ్స్ చాలా అందుబాటులో ఉన్నాయి కదా! వీటిల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను? తగిన సూచనలివ్వండి? –రమణి, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా మంది ఇన్వెస్టర్లు చేసే మొదటి పని.. వివిధ కేటగిరీల ఫండ్స్ పనితీరు ఎలా ఉందో పోల్చి చూడటం. ఇలా మదింపు చేసేటప్పుడు ఒక ప్రత్యేక రంగానికి చెందిన ఫండ్స్ మంచి పనితీరు కనబరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక్కోసారి రంగాల వారీ (సెక్టోరియల్) ఫండ్స్ అగ్రభాగంలో ఉండొచ్చు. ఒక్కోసారి అట్టడుగున ఉండొచ్చు. రెండు, మూడేళ్ల క్రితం ఫార్మా ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు బాగా ఇన్వెస్ట్ చేసేవారు. అప్పుడు వాటి పనితీరు కూడా బాగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే, వాటి రాబడులు బాగా పడిపోయాయి. చెప్పాలంటే ఈ ఫండ్స్ అట్టడుగుకు పడిపోయాయి. సెక్టోరియల్ ఫండ్స్ ఆ ప్రత్యేక రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు ఫార్మా ఫండ్స్ అయితే ఫార్మా కంపెనీల్లోనూ, ఇన్ఫ్రా ఫండ్స్ అయితే ఇన్ఫ్రా కంపెనీల్లోనూ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలా ఒకే రంగానికి పరిమితమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్. పైగా డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు లభించవు. అందుకని రిటైల్ ఇన్వెస్టర్లు ఇలాంటి సెక్టోరియల్ ఫండ్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఒక్కొక్కసారి ఈ సెక్టోరియల్ ఫండ్స్.. అన్ని ఫండ్స్ కంటే కూడా అధికంగా రాబడులనిస్తాయి. అందుకని ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది టెంప్ట్ అవుతుంటారు. ఈ ఫండ్స్ అధిక రాబడులు ఇస్తున్నాయంటే, అధిక రిస్క్ ఉంటుందని గమనించాలి. ఈ అధిక రాబడులు ఒక విధంగా వార్నింగ్ బెల్స్‌గా గుర్తించాలి. నేను కొంత మొత్తాన్ని మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా?లేదా ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్‌ను ఎంచుకోమంటారా? –పవన్, విజయవాడ మీరు కొంత మొత్తాన్ని మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.., ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. మీకు ఒకింత మంచి రాబడులు వస్తాయి. లిక్విడ్ ఫండ్స్, ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్స్‌కు సంబంధించి రిస్క్ ప్రొఫైల్‌లో తేడాలుంటాయి. 91 రోజుల కాలవ్యవధికి మించిన మెచ్యూరిటీ ఉన్న బాండ్లలో లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవు. ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న బాండ్లలో ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా అరుదైన సందర్భాల్లోనే నష్టాలు భరించాల్సి రావచ్చు. మొత్తం మీద చూస్తే, మూడు నెలల నుంచి ఆరు నెలల కాలానికి ఇన్వెస్ట్ చేయడానికి ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. -
గుట్టలు గుట్టలుగా బంగారు నిధి!
సాక్షి, చెన్నై : మదురై జిల్లా కీలడి కావేరి కూం పట్టినంలో రెండేళ్ల క్రితం పురాతన కాలం నాటి నిర్మాణాలు బయటపడ్డాయి. దీంతో కేంద్ర పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. కీలడి పరిసరాల్లో రెండేళ్లుగా తీవ్ర పరిశోధన సాగుతోంది. ఇప్పటికే మూడు విడతలుగా పురావస్తు పరిశోధన సాగింది. ఈ పరిశోధనలకు అడ్డంకులు సృష్టించిన వాళ్లూ ఉన్నారు. అన్నింటినీ అధిగమి ంచి, చివరకు గత వారం రాష్ట్ర సాంస్కృతిక విభాగంతో కలసి కేంద్ర పురావస్తు శాఖ నాలుగో విడత పరిశోధనను చేపట్టింది. ఇదివరకు సాగిన మూడు పరిశోధనల్లో పురాతన కాలానికి చెందిన ఎనిమిది వేల వస్తువులు బయటపడ్డాయి. ఇందులో అద్దాలతో రూపొందించిన వస్తువులతో పాటు నవరత్నాలు పొదిగిన వస్తువులు సైతం ఉన్నట్టు వెలుగు చూసింది. అయితే, నాలుగో విడత పరిశోధనల్లో బంగారు నిధి బయటపడ్డట్టుగా సమాచారం. గత రెండేళ్లుగా కీలడికి చెందిన చంద్రన్‌కు చెందిన పదిహేను ఎకరాల విస్తీర్ణంలోని స్థలంలో పరిశోధన సాగింది. తాజాగా కార్తీక్ అనే వ్యక్తికి చెందిన ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలోని స్థలంలో పరిశోధన సాగుతోంది. ఇక్కడ బావులు, ఆ బావుల మధ్య భాగంలో రహస్య గది, అందులో నుంచి గుహలోకి వెళ్లే రీతిలో మార్గాలు ఉండడం పురావస్తు వర్గాల్ని విస్మయంలో పడేశాయి. ఈ గుహల్లో బంగారు నిధి ఉన్నట్టుగా పరిశోధనలో గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఓ గుహలో కొంతమేరకు బంగారు నిధి బయటపడగా, దానిని అక్కడి నుంచి మరోచోటకు తరలించినట్టు తెలిసింది. దీంతో బావుల్లోని గుహల్లో, రహస్య గదుల్లో గుట్టలు గుట్టలుగా బంగారు నిధి ఉండేందుకు ఆవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం. అయితే, నాలుగో విడత పరిశోధన ముగిసిన అనంతరం పూర్తి వివరాల్ని పురావస్తు శాఖ బయట పెట్టనుంది. అంతవరకు అక్కడున్న బంగారు నిధి గురించిన వివరాల కోసం వేచి చూడాల్సిందే. అక్కడ బంగారు నిధి ఉన్నట్టు పరిశోధనలో వెలుగుచూడడం వల్లే ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారని తెలిసింది. కార్తీక్‌కు చెందిన స్థలం పరిసరాల్లో ఎవరినీ అనుమతించకుండా భద్రతను కల్పించారు. -
ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి?
బంగారంతో మనది విడ దీయరాని బంధం. అందుకేనేమో! వినియోగంలో చైనానూ మించిపోయారు మనవాళ్లు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటుండటంతో భారీ విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. పెపైచ్చు దేశాభివృద్ధికి ఈ బంగారం పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించింది. ఒకటి బంగారం బాండ్లు. రెండు నాణేలు. మూడు బంగారం డిపాజిట్. ఈ మూడింటి లక్ష్యం ఒక్కటే. బంగారం కొనుగోలు చేయాలన్న భారతీయుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే... అందుకోసం వెచ్చించే డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చూడటం... విపరీతంగా పెరిగిపోతున్న బంగారం దిగుమతులను సాధ్యమైనంత తగ్గించటం... ఇళ్లలో ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకురావటం. ఈ లక్ష్యాలు ఎంతవరకూ నెరవేరతాయనేది పక్కనబెడితే... అసలు ఈ పథకాలు ఎవరికి పనికొస్తాయి? లాభమెంత? ఇవన్నీ తెలియజేస్తున్నదే ఫైనాన్షియల్ ప్లానర్ ‘అనిల్ రెగో’ చేస్తున్న ఈ విశ్లేషణ. * అందుబాటులోకి కొత్త బంగారు పథకాలు * పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారికి గోల్డ్ బాండ్లు * ఇంట్లో భారీ బంగారం ఉన్నవారికి డిపాజిట్ స్కీమ్ * చిన్న మదుపరులకు ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లే బెటర్ * కావాలనుకుంటే కొనుక్కోవటానికి నాణేలు కూడా కొత్త కొత్తగా గోల్డ్ బాండ్లు... గోల్డ్ బాండ్లను జారీ చేయటం భారతదేశంలో ఇదే తొలిసారి. ఇది పరిమిత కాల పథకం. అంటే ఈ నెల 5న ఆరంభమైంది. 20వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. అంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు 20వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు జారీ చేస్తున్న ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఉంటుంది. బాండ్లకు, ఈ వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. గ్రాము విలువను ప్రభుత్వం రూ.2,684గా నిర్ణయించింది. అంటే బాండ్లు ఎవరు కొన్నా ఈ ధరకే కొనాల్సి ఉంటుంది. కనీసం రెండు గ్రాముల్ని, గరిష్ఠంగా 500 గ్రాముల్ని కొనుగోలు చేయొచ్చు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఎనిమిదేళ్ల తరవాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అయితే ఐదేళ్ల తరవాత ఎప్పుడైనా నగదుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. సరెండర్ చేసేటపుడు అప్పటి బంగారం విలువను బట్టి మీకు నగదు చెల్లిస్తారు. వీటిని స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ మార్కెట్లోని ధరకు విక్రయించి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అదనపు ఆకర్షణేమిటంటే వడ్డీ. ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీని ఆర్బీఐ ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాల ఆదాయం కనక ఈ వడ్డీకి క్యాపిటల్ గెయిన్స్ కూడా వర్తించవు. అవసరమైనపుడు ఈ బాండ్లను తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు. ఎక్కడ కొనుగోలు చేయాలి? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఏజెంట్లకు కూడా దరఖాస్తులు తీసుకుని బ్యాంకుల్లో అందజేయటానికి అనుమతి ఉంది. ఎవరికి లాభం? వడ్డీ కూడా వస్తుంది కనక... బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నవారు నేరుగా బం గారం కొనకుండా ఈ బాండ్లు కొనవచ్చు. వీటిని పేపర్ రూపంలోను, డీమ్యాట్ రూపంలోను కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ రకంగా కొనుగోలు చేసినపుడు దీన్ని దాచుకోవటం చాలా ఈజీ. పెపైచ్చు తరుగులాంటి సమస్యలు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించి నగదు చేసుకోవచ్చు. నష్టాలున్నాయా? బాండ్లతో నష్టాలున్నాయని చెప్పలేం. అయితే బంగారం ధరలోని హెచ్చుతగ్గులు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్లో ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత బంగారం ధర తగ్గితే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం ఈ స్కీమను ప్రకటించినపుడు... అప్పటి ధరను పరిగణనలోకి తీసుకుని గ్రాము ధరను రూ.2,684గా నిర్ణయించింది. కాకపోతే నవంబరు 5న ఈ స్కీమ్ ఆరంభించేనాడు ముంబై బులియన్ మార్కెట్లో గ్రాము ధర రూ.26,025గా ఉంది. అంటే దాదాపు 660 రూపాయలు తగ్గినట్లు. ఇది 2.75 శాతానికన్నా ఎక్కువే. అంటే తొలి ఏడాది ఇస్తామన్న వడ్డీ ఈ రకంగా పోయినట్లన్న మాట. ఇలాంటి రిస్కులుంటాయని గమనించాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు/ మ్యూచ్‌వల్ ఫండ్లు ఇవేవీ కొత్తగా ఆరంభించినవి కావు. కాకపోతే బంగారంలో మదుపు చేసే పథకాల గురించి తెలుసుకుంటున్నాం కనక గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌లు), గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్ల (ఎంఎఫ్‌లు) గురించి కూడా తెలుసుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లంటే బంగారం ధరను బట్టి ఆ ధరకే ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే ఫండ్లన్న మాట. షేర్ల మాదిరే వీటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయటం, విక్రయించటం చేయొచ్చు. దీన్లో కనీస పెట్టుబడి రూ.5వేలు. డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. అయితే దీన్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ కుదరదు. ప్రస్తుతం 13 సంస్థల వరకూ ఈటీఎఫ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అదే గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లకైతే డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. నెలకు రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ పద్ధతిలో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్.. ప్రభుత్వం దీన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌గా పిలుస్తోంది. అంటే బంగారాన్ని డబ్బు చేసుకునే పథకమన్నమాట. దీనిప్రకారం మన దగ్గరున్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆభరణాల్ని డిపాజిట్ చేస్తే అక్కడ రాళ్లు, ఇతరత్రా తరుగు తీసేసి, దాన్ని కరిగించి నిపుణులు దాని బరువెంతో లెక్కిస్తారు. ఒకవేళ బంగారు నాణేలు, బార్లు డిపాజిట్ చేస్తే వాటి బరువును అక్కడే చెబుతారు. ఆ బరువును పేర్కొంటూ మీకొక సర్టిఫికెట్ ఇస్తారు. మీరు వెనక్కి తీసుకునేటపుడు ఆ సర్టిఫికెట్‌ను అందజేస్తే దాన్లో పేర్కొన్న బరువు గల బంగారాన్ని మీకిస్తారు. అంతేతప్ప మీ ఆభరణాలను తిరిగివ్వరు. అదనపు ఆకర్షణేంటంటే దీనిపై వడ్డీ కూడా ఇస్తున్నారు. ఈ వడ్డీ 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకూ ఉంటుంది. నిజానికిదేమీ తొలిసారి అందిస్తున్న పథకం కాదు. చాలా కాలం కిందటే ఎస్బీఐ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత బంగారాన్నయినా డిపాజిట్ చేయొచ్చు. దీనికి పరిమితి లేదు. 1999 నాటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో కూడా ఇలాంటి మినహాయింపులు ఉంటాయనే భావిస్తున్నారు. ఎవరికి లాభం? ఆభరణాల రూపంలో కాకుండా బార్ల రూపంలోనో, నాణేల రూపంలోనో ఇంట్లో బంగారం ఉన్నవారికి ఇలాంటి పథకాలు లాభదాయకమే. ఎందుకంటే ఇంట్లో ఉంటే దాన్ని భద్రంగా దాచుకోవటం కూడా సమస్యే. అదే బ్యాంకులో అయితే భద్రత సమస్య ఉండదు. పెపైచ్చు ఇంట్లో ఉంటే ఎలాంటి ఆదాయమూ రాదు. బ్యాంకులో ఉంటే ఏటా వడ్డీ కూడా వస్తుంది. బ్యాంకులో కనక ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. నష్టాలు ఉన్నాయా? బంగారం ఉన్నవారు డిపాజిట్ చేస్తే మంచిది తప్ప బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న వారు దాన్ని కొని డిపాజిట్ చేయటం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తరవాత ధర తగ్గితే ఆ మేరకు నష్టపోవాల్సి ఉంటుందని గమనించాలి. కేంద్రం తాజాగా అశోకచక్ర చిహ్నంతో బంగారు నాణేలను కూడా విడుదల చేసింది. ఎంఎంటీసీ ఔట్లెట్లలో ఇవి లభ్యమవుతాయి. నాణేలు కొనాలనుకున్నవారికి కేంద్రమే అందిస్తోంది కనక ఇవి ఉపయుక్తమని చెప్పాలి. వీటిని ఇన్వెస్ట్మెంట్గా భావించినా ఏకమొత్తంలో మదుపు; ధర తగ్గితే రిస్కు ఉంటాయి. ఎవరికి ఏ పథకం లాభం? గోల్డ్ ఈటీఎఫ్/ గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్స్ : ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేవారికి, రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసేవారికి (సిప్) గోల్డ్ బాండు : ప్రభుత్వ మద్దతున్న పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి; భవిష్యత్తులో బంగారం కొనా లనుకున్నవారికి గోల్డ్ డిపాజిట్ పథకం : నేరుగా బంగారం ఉండి, దాన్ని అదే రూపంలో తమ వద్ద ఉంచుకోకూడదని భావించేవారికి ఉదాహరణకు ఈ మూడు పథకాల్లో రూ.2.5 లక్షలు లేదా అంతకు సమానమైన బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం... ఈ పట్టిక చూస్తే ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఎంఎఫ్‌లకన్నా గోల్డ్ డిపాజిట్ స్కీమ్, బాండ్లపైనే ఎక్కువ రాబడి వస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం... వడ్డీ. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసినపుడు మిగతా వాటికన్నా ఎక్కుకే రాబడి రావచ్చు. ఎందుకంటే ధరలు పెరిగినా, తగ్గినా ఆ ధరలకే యూనిట్లు లభిస్తాయి కనక సగటు ధర తక్కువే ఉంటుంది. లాభమూ బాగానే ఉంటుంది. ఒకవేళ బంగారం ధరలు బాగా పడిపోయినా ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ బాండ్లు, డిపాజిట్ స్కీమ్‌తో పోలిస్తే సిప్ పద్ధతిలో నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అయితే పై స్కీముల్లో వడ్డీ రేట్లు కాస్త ఆకర్షణీయంగానే ఉన్నాయి. అందుకని బాగా డబ్బులుండి ఎక్కడో ఒకచోట ఇన్వెస్ట్ చేదాద్దమనుకున్న వారికి, ఇంట్లో ఆభరణాలు కాకుండా అదనపు బంగారం ఉన్నవారికి మాత్రం పై రెండు స్కీములూ ఆకర్షణీయమేనని చెప్పొచ్చు. -
న్యూ ఫండ్ ఆఫర్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
నాలుగేళ్ల నుంచి కోటక్ గోల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా మొత్తం నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ప్లాన్ (సిప్) ఇన్వెస్ట్మెంట్స్ మొత్తంలో ఈ గోల్డ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ 9 శాతంగా ఉంది. ప్రతీ ఏడాది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోతున్నాను. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు తగ్గుతుండటంతో ఈ గోల్డ్ఫండ్ రాబడులు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ డైవర్సిటీ వ్యూహంలో భాగంగా ఈ గోల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా? లేకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసి, ఈ గోల్డ్ఫండ్ నుంచి వైదొలగమంటారా? - శౌరి, నెల్లూరు పుత్తడిలో పెట్టుబడి పెట్టమని సాధారణంగా ఎవరికీ సలహా ఇవ్వము. ఎందుకంటే బంగారమనేది విభిన్నమైన ఇన్వెస్ట్మెంట్. బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే మీకు వడ్డీ వస్తుంది. అదే షేర్లలో అయితే యాజమాన్యంలో కొంత వాటా వస్తుంది. బంగారం విషయంలో మాత్రం అలా కాదు. బంగారం విలువ డిమాండ్, సరఫరాలపై ఆధారపడి ఉంటుంది. 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నప్పుడు బంగారం మంచి రాబడులను ఇచ్చింది. అది అసాధారణమైన పరిస్థితి. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే డైవర్సిఫికేషన్ కాదని గమనించాలి. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో బంగారంపై ఇన్వెస్ట్మెంట్స్ 5 శాతం మించకూడదని సలహా ఇస్తాము. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. డెట్, ఈక్విటీల మిశ్రమంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిగణిస్తారు కదా ! అలాంటప్పుడు పన్నుల విషయంలో డెట్ విభాగానికి, ఈక్విటీ విభాగానికి వేర్వేరుగా పన్నులు చెల్లించాలా? బ్యాలెన్స్డ్ ఫండ్స్‌కు సంబంధించి పన్నులు ఎలా లెక్కించాలి? - లలిత, వరంగల్ మీరు చెప్పినట్లుగానే డెట్, ఈక్విటీల మిశ్రమంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిగణిస్తారు. ఈక్విటీ విభాగం పెట్టుబడులను బట్టి వీటిని ఈక్విటీ ఓరియెంటెడ్, లేదా డెట్ ఓరియెంటెడ్ ఫండ్స్‌గా విభజించవచ్చు. ఒక ఫండ్ తన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 65 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే దానిని ఈక్విటీ ఓరియెంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్‌గా పరిగణిస్తారు. వీటిల్లో ఒక ఏడాదికి మించి ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే మూలధన లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అలా కాకుండా ఏడాది కంటే తక్కువ కాలానికే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే, 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఓరియెంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్‌ను పన్నుల పరంగా డెట్ఫండ్గానే పరిగణిస్తారు. వీటిపై వచ్చే స్వల్పకాల మూలధన లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ట్యాక్సశ్లాబ్ననుసరించి పన్ను విధిస్తారు. ఇక వీటిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20 శాతంగా ఉంటుంది. న్యూఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎన్ఎఫ్ఓల గురించి ఎందుకు బాగా ప్రచారం చేస్తాయి? - ఉత్తమ్ కుమార్, విజయవాడ న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్ఎఫ్ఓ)ల్లో ఇన్వెస్ట్ చేయొద్దనే సాధారణంగా మేము ఇన్వెస్టర్లకు సలహా ఇస్తుంటాం. గతంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిదనేది మా సూచన. మార్కెట్లో అప్పటివరకూ లేని వినూత్నమైన ఆఫర్‌తో వచ్చే ఎన్ఎఫ్ఓలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే అలాంటి ఎన్ఎఫ్ఓలు ఎప్పుడో గానీ రావు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు వివిధ కారణాల వల్ల ఎన్ఎఫ్ఓలను తీసుకువస్తాయి, వాటిని బాగా ప్రచారం చేస్తాయి. తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవడం, మరింతమంది ఇన్వెస్టర్లను ఆకర్షించి, వారి నుంచి పెట్టుబడులను సమీకరించి, తమ నిర్వహణ ఆస్తులను పెంచుకోవడం.. తదితర కారణాల వల్ల ఎన్ఎఫ్ఓలను తీసుకువస్తాయి. అందుకే ఎన్ఎఫ్ఓల్లో ఇన్వెస్ట్ చేసేముందు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అప్పటివరకూ ఏ ఫండ్ ఆఫర్ చేయని వినూత్నమైన థీమ్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుంటే దీర్ఘకాలం పాటు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయండి. నేను జీవన్ సరళ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వార్షిక ప్రీమియం రూ.29,800. నేను ఇప్పటికే మొదటి ప్రీమియాన్ని చెల్లించాను. అయితే ఇది సరైన పాలసీ కాదని, దీని కంటే మంచి పాలసీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ పాలసీని ఇప్పుడు సరెండర్ చేయడమే ఉత్తమమా లేకుంటేమరో ప్రీమియం చెల్లించిన తర్వాత సరెండర్ చేయమంటారా? - వీరేశ్, హైదరాబాద్ ఎల్ఐసీ జీవన్ సరళ్ అనేది ఎండోమెంట్ పాలసీ. ఈ కేటగిరిలోని ఇతర ప్లాన్ల మాదిరే వ్యయాల విషయమై ఈ పాలసీలో పారదర్శకత లేదు. పాలసీ ముగిసిన తర్వాత పాలసీ మొత్తాన్ని, లాయల్టీ బోనస్‌లను ఎల్ఐసీ మీకు చెల్లిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది సరైన ఇన్వెస్ట్మెంట్ కాదు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు దీనికంటే మంచి రాబడులు పొందవచ్చు. అందుకని తక్షణం ఈ పాలసీని సరెండర్ చేయండి. మీరు చెల్లించిన ప్రీమియమ్‌లో 30 శాతం సరెండర్ వేల్యూగా(తొలి ఏడాది ప్రీమియం మినహా) మీకు వస్తుంది. ఇప్పుడు మీరు సరెండర్ చేస్తే మీకు ఏమీ రాదు. అయితే మీ నష్టాలను మీరు తగ్గించుకోగలుగుతారు. మరో ప్రీమియం చెల్లించిన తర్వాత ఈ పాలసీని సరెండర్ చేస్తే మీ నష్టాలు మరింతగా పెరుగుతాయి. -
గోల్డ్ ఫండ్లా.. గోల్డ్ ఈటీఎఫ్లా?
మిడ్ క్యాప్ ఆధారిత బిర్లా సన్ లైఫ్, ఎల్అండ్టీ మ్యూచువల్ ఫండ్లు న్యూ ఫండ్ ఆఫర్లు ప్రకటించాయి. ఈ రెండింటిలో దేనిలో ఇన్వెస్ట్ చేయవచ్చో తగిన సలహా ఇవ్వగలరు? - సరితా గోయల్, ఈ-మెయిల్ మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఈ రెండూ కూడా క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్. దీంతో మీరు వీటిలో ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. తరచూ ఇన్వెస్ట్ చేస్తుండటం ద్వారా పొదుపు మొత్తం పెరుగుతుంది. ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఈ సూత్రం మరింత కీలకం. క్రమంగా పెట్టుబడులు పెడితేనే యావరేజ్ చేసుకోగలుగుతాం. ఆ రకంగా చూస్తే.. క్రమక్రమంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం వీటిలో లేవు. కనుక ఇలాంటి ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం అంటూ ఇవి ఊరించినా.. పెట్టుబడులు ఏకమొత్తంగా పెట్టకూడదని, క్రమక్రమంగానే ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి వీటిని పక్కన పెట్టొచ్చు. గోల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేక గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? - చంద్రవదన్, అనంతపురం గోల్డ్ ఫండ్లయినా, గోల్డ్ ఈటీఎఫ్లైనా పెట్టుబడులు బంగారంతో ముడిపడి ఉన్నవే. గోల్డ్ ఈటీఎఫ్ విషయానికొస్తే.. షేరు కొనుక్కున్నట్లే బ్రోకింగ్ ఏజెంటు నుంచి డీమ్యాట్ అకౌంటు తీసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే గోల్డ్ ఫండ్ సంగతి తీసుకుంటే.. ఇందులో బ్రోకింగ్ ఏజెన్సీ ప్రమేయం ఉండదు. మ్యూచువల్ ఫండ్ యూనిట్ల తరహాలోనే వీటిని తీసుకోవచ్చు. గోల్డ్ ఫండ్‌లో నిధులను తీసుకెళ్లి గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈటీఎఫ్‌లతో పోలిస్తే గోల్డ్ ఫండ్లు సుమారు 75 బేసిస్ పాయింట్ల మేర ఖరీదైనవిగా ఉంటాయి. దీర్ఘకాలికంగా చూస్తే బంగారం అంత సరైన ఇన్వెస్ట్మెంట్ కాదు. గత అయిదారేళ్లుగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నందున బంగారం ధర పరుగులు తీసింది. ఇటీవలి కాలంలో బంగారానికి ఆర్థికపరమైన ప్రాధాన్యత పెరిగింది. ఫలితంగా రేట్లు మరింత హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పైగా షేర్లు, ఫిక్సిడ్ ఇన్కమ్, రియల్ ఎస్టేట్ లాగా బంగారం అధిక రాబడినిచ్చే పెట్టుబడి సాధనం కాదు. సుమారు రూ. 10,000 మొత్తాన్ని 8-10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సాధనాన్ని సూచించగలరు? - భాను, వైజాగ్ మీరు తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక పూర్తి ఈక్విటీ ఫండ్ల జోలికి వెళ్లకండి. వీటిలో ఉండే రిస్కుల వల్ల పెట్టుబడి విలువ అకస్మాత్తుగా భారీగా పడిపోతే కొత్త ఇన్వెస్టర్లకు ఆందోళన కలుగుతుంది. కాబట్టి కొన్ని బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కింద పెట్టుబడులు పెట్టొచ్చు. ఇందుకోసం హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, కెనరా రోబెకో బ్యాలెన్స్డ్ లాంటివి ఎంచుకోవచ్చు. ఫండ్స్ఇండియాడాట్కామ్ ద్వారా పెట్టుబడులు పెట్టడం సురక్షితమేనా? - కుల్దీప్, ఒంగోలు మ్యూచువల్ ఫండ్స్‌ను ఆన్లైన్లో విక్రయించే ఫండ్స్ఇండియాడాట్కామ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం సురక్షితమైనదే. డిస్ట్రిబ్యూటర్/ ఏజెంటు ద్వారా ఇన్వెస్ట్ చేయడంలాంటిదే. ఇలాంటి వెబ్సైట్ల ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించిన డెరైక్ట్ ప్లాన్స్‌లో పెట్టుబడులకు సాధ్యపడదు. డెరైక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయాలంటే సదరు ఫండ్ సంస్థ వెబ్సైట్ ద్వారానే చేయాలి. సుందరం స్మైల్, టాటా ఈక్విటీ పీఈలలో సుమారు రూ. 40,000 పెట్టుబడి పెట్టాను. ఏడాది కాలంగా ఇన్వెస్ట్ చేయడం లేదు. వీటిలో నుంచి వైదొలగడం మంచిదా లేక పెట్టుబడిని అలాగే ఉంచేయవచ్చా? - రాజేంద్ర, వరంగల్ టాటా ఈక్విటీ పీఈ నిజానికి వైవిధ్యభరితమైన మంచి ఫండ్. మీరు ఇందులో పెట్టుబడులు ఆపకుండా ఉండాల్సింది. ఇప్పటికైనా సరే..ఇందులో ఇన్వెస్ట్మెంట్లను అలాగే కొనసాగించండి. ఇక సుందరం స్మైల్ విషయానికొస్తే.. ఈ స్మాల్ క్యాఫ్ ఫండ్ పనితీరు గత కొన్నేళ్లుగా ఆశాజనకంగా లేదు. అయితే, ఇది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడ్డుకాలం యావత్తూ మీరు వేచి చూశారు. మరికొన్నాళ్లు ఓపిక పడితే మెరుగైన ఫలాలు అందుకోవచ్చు. -
పసిడి ఫండ్‌పై పునరాలోచన మేలు
నా ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 5 ఫండ్లు ఉన్నాయి. వీటి వివరాలు.., ఎస్బీఐ మ్యాగ్నమ్ ఎమర్జింగ్ బిజినెసెస్, రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, డీఎస్పీ బ్లాక్‌రాక్ టాప్ 100, రిలయన్స్ గోల్డ్. ఈ ఫండ్స్ పర్వాలేదా? మీరేమైనా మార్పులు, చేర్పులు సూచిస్తారా? నా పోర్ట్‌ఫోలియోలో మరిన్ని అగ్రెసివ్ లార్జ్-క్యాప్ ఫండ్స్‌కు చోటివ్వమంటారా? - నవీన్, శ్రీకాకుళం మీరు మంచి ఫండ్స్‌నే ఎంపిక చేసుకున్నారు. ఈక్విటీ ఫండ్స్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంటాయి. స్వల్పకాలానికంటే దీర్ఘకాలానికే ఈక్విటీ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెట్టాలి. అగ్రెసివ్ ఫండ్స్ విషయంలో ఇది మరింతగా వర్తిస్తుంది. లార్జ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్స్... అగ్రెసివ్ ఫండ్స్‌లా పనితీరును కనబరిచే అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. నష్టభయం ఉన్నప్పటికీ, చిన్న కంపెనీల్లోనే అగ్రెసివ్ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. అయితే కొన్ని లార్జ్‌క్యాప్ ఫండ్స్ అగ్రెసివ్ ఫండ్స్‌లాగానే పనితీరు కనబరుస్తాయి. దీనికి ఉదాహరణగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ను చెప్పుకోవచ్చు. మీరు దీర్ఘకాలిక ఇన్వెస్టర్ అయినట్లయితే మరిన్ని అగ్రెసివ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లయితే, మా వాల్యూ రీసెర్చ్ వెబ్‌సైట్‌లోని లార్జ్ అండ్ మిడ్, మిడ్-క్యాప్ కేటగిరిల్లోని ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. భవిష్యత్తులో నిలకడైన వృద్ధిని బంగారం ఇవ్వలేదని చెప్పొచ్చు. అందుకే మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న గోల్డ్ ఫండ్ విషయమై పునరాలోచన చేయండి. డీఎస్పీ బ్లాక్‌రాక్ టాప్ 100 మాతం అగ్రెసివ్ ఫండ్ కాదని చెప్పవచ్చు. ఇక మిగిలిన ఫండ్స్ అన్నీ బావున్నాయి. అన్ని ఫండ్స్ మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. నేను 2007లో రిలయన్స్ ట్యాక్స్ సేవర్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌లో రూ.20,000 పెట్టుబడులు పెట్టాను. ఇప్పటిదాకా డివిడెండ్ రూపంలో రూ.11,600 వచ్చాయి. ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? కొనసాగమంటారా? -శ్రీవాణి, హైదరాబాద్ రిలయన్స్ ట్యాక్స్ సేవర్ అనేది 3-స్టార్ రేటింగ్ ఉన్న పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్. కానీ అన్ని ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటోంది. దీంతో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి లేదు. ఈ ఫండ్స్ చెల్లించే డివిడెండ్‌ను రీ ఇన్వెస్ట్ చేస్తే మళ్లీ దానికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈ లాకిన్ పీరియడ్ పూర్తయ్యేదాకా మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి లేదు. ఒకవేళ మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే, మీరు మీ ప్లాన్‌ను డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ నుంచి డివిడెండ్ పేఅవుట్కు మార్చుకోవలసి ఉంటుంది. ఇలా మార్చుకుంటే మీకు రావలసిన డివిడెండ్‌ను రీ ఇన్వెస్ట్ చేయకుండా డివిడెండ్‌ను మీకు నేరుగా ఫండ్ కంపెనీ చెల్లిస్తుంది. మూడేళ్ల తర్వాత మీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవచ్చు. నా వయస్సు 46 సంవత్సరాలు. నేను హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ యంగ్‌స్టార్ సూపర్ టూ పాలసీ- ఆపర్చునిటీస్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ప్రీమియం టెర్మ్ ఐదేళ్లు, బెనిఫిట్ టెర్మ్ పదేళ్లుగా ఉన్న ఈ ఫండ్‌లో 2010, నవంబర్ నుంచి ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నాను. ఏడాదికి రూ.25,000 చొప్పున మూడేళ్ల పాటు చెల్లించాను. ఆ తర్వాత ఆపేశాను. ఈ ఏడాది డిసెంబర్ 1 నాటికి ఈ ప్లాన్ విలువ రూ.58,120గా ఉంది. ఈ పాలసీ నుం చి వైదొలగమంటారా? కొనసాగమంటారా? - జాన్సన్, గుంటూరు హెచ్డీఎఫ్సీ యంగ్‌స్టార్ సూపర్ టూ అనేది యూనిట్ లింక్డ్ పాలసీ.సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంతైతే రాబడి వస్తుందో అంతే రాబడి ప్రస్తుతం ఈ ఫండ్ ద్వారా వస్తోంది. మీరు ఇప్పటికే మూడేళ్లపాటు ప్రీమి యం చెల్లించారు. కానీ ప్రస్తుతమున్న విలువ దృష్ట్యా మీకు నష్టం వచ్చింది. మీరు ఇప్పుడు ఈ పాలసీని సరెండర్ చేస్తే, డిస్కంటిన్యూ చార్జీల కింద మీ వార్షిక ప్రీమియంలో 10 శాతం మొత్తాన్ని, లేదా రూ. 1,000 (ఏది కనిష్టమైతే, అది) చెల్లించాలి. మీ నష్టాలకు ఇది అదనం. ఇప్పటికే మీ ప్లాన్ డిస్కంటిన్యూ మోడ్‌లో ఉంది. ఇక ఫండ్ మేనేజ్మెంట్ చార్జీల కింద మీ డిస్కంటిన్యూడ్ పాలసీపై 0.50 శాతాన్ని ఈ ప్లాన్ సంస్థ చార్జ్ చేస్తుంది. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, మీ పాలసీని సరెండర్ చేసి మీ నష్టాలను పరిమితం చేసుకుంటేనే సముచితంగా ఉంటుంది. మీరు ఈ పాలసీని సరెండర్ చేస్తే, మీకు ఇన్సూరెన్స్ కవర్ ఉండదు కాబట్టి, మీకు సరిపోయేలా టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక మిగిలిన మొత్తాన్ని మీరు భరించగలిగే నష్ట భయాన్ని బట్టి ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ధీరేంద్ర కమర్,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్