న్యూ ఫండ్ ఆఫర్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? | Can investment in the New Fund Offers? | Sakshi
Sakshi News home page

న్యూ ఫండ్ ఆఫర్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?

Published Mon, Aug 24 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

న్యూ ఫండ్ ఆఫర్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?

న్యూ ఫండ్ ఆఫర్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?

నాలుగేళ్ల నుంచి కోటక్ గోల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని  ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా మొత్తం నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌ప్లాన్ (సిప్) ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తంలో ఈ గోల్డ్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ 9 శాతంగా ఉంది. ప్రతీ ఏడాది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోతున్నాను. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు తగ్గుతుండటంతో ఈ గోల్డ్‌ఫండ్ రాబడులు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ డైవర్సిటీ వ్యూహంలో భాగంగా ఈ గోల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా? లేకుంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేసి, ఈ గోల్డ్‌ఫండ్ నుంచి వైదొలగమంటారా?
 - శౌరి, నెల్లూరు

 పుత్తడిలో పెట్టుబడి పెట్టమని సాధారణంగా ఎవరికీ సలహా ఇవ్వము. ఎందుకంటే బంగారమనేది విభిన్నమైన ఇన్వెస్ట్‌మెంట్. బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే మీకు వడ్డీ వస్తుంది. అదే షేర్లలో అయితే యాజమాన్యంలో కొంత వాటా వస్తుంది. బంగారం విషయంలో మాత్రం అలా కాదు. బంగారం విలువ డిమాండ్, సరఫరాలపై ఆధారపడి ఉంటుంది. 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నప్పుడు బంగారం మంచి రాబడులను ఇచ్చింది. అది అసాధారణమైన పరిస్థితి. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే డైవర్సిఫికేషన్ కాదని గమనించాలి. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్స్ 5 శాతం మించకూడదని సలహా ఇస్తాము. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి.  

 డెట్, ఈక్విటీల మిశ్రమంగా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను పరిగణిస్తారు కదా ! అలాంటప్పుడు పన్నుల విషయంలో డెట్ విభాగానికి, ఈక్విటీ విభాగానికి వేర్వేరుగా పన్నులు చెల్లించాలా? బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌కు సంబంధించి పన్నులు ఎలా లెక్కించాలి?                         
- లలిత, వరంగల్

 మీరు చెప్పినట్లుగానే డెట్, ఈక్విటీల మిశ్రమంగా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను పరిగణిస్తారు. ఈక్విటీ విభాగం పెట్టుబడులను బట్టి వీటిని ఈక్విటీ ఓరియెంటెడ్, లేదా డెట్ ఓరియెంటెడ్ ఫండ్స్‌గా విభజించవచ్చు. ఒక ఫండ్ తన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 65 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే దానిని ఈక్విటీ ఓరియెంటెడ్ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌గా పరిగణిస్తారు. వీటిల్లో ఒక ఏడాదికి మించి ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగిస్తే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే మూలధన లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అలా కాకుండా ఏడాది కంటే తక్కువ కాలానికే ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే, 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఓరియెంటెడ్ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను పన్నుల పరంగా డెట్‌ఫండ్‌గానే పరిగణిస్తారు. వీటిపై వచ్చే స్వల్పకాల మూలధన లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ట్యాక్సశ్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. ఇక వీటిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20 శాతంగా ఉంటుంది.

 న్యూఫండ్ ఆఫర్(ఎన్‌ఎఫ్‌ఓ)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?  మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎన్‌ఎఫ్‌ఓల గురించి ఎందుకు బాగా ప్రచారం చేస్తాయి?
 - ఉత్తమ్ కుమార్, విజయవాడ

 న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్‌ఎఫ్‌ఓ)ల్లో ఇన్వెస్ట్ చేయొద్దనే సాధారణంగా మేము ఇన్వెస్టర్లకు సలహా ఇస్తుంటాం.  గతంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిదనేది మా సూచన. మార్కెట్లో అప్పటివరకూ లేని వినూత్నమైన ఆఫర్‌తో వచ్చే ఎన్‌ఎఫ్‌ఓలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే అలాంటి ఎన్‌ఎఫ్‌ఓలు ఎప్పుడో గానీ రావు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు వివిధ కారణాల వల్ల ఎన్‌ఎఫ్‌ఓలను తీసుకువస్తాయి,  వాటిని బాగా ప్రచారం చేస్తాయి.  తమ  పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవడం, మరింతమంది ఇన్వెస్టర్లను ఆకర్షించి, వారి నుంచి పెట్టుబడులను సమీకరించి, తమ నిర్వహణ ఆస్తులను పెంచుకోవడం.. తదితర కారణాల వల్ల ఎన్‌ఎఫ్‌ఓలను తీసుకువస్తాయి. అందుకే ఎన్‌ఎఫ్‌ఓల్లో ఇన్వెస్ట్ చేసేముందు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అప్పటివరకూ ఏ ఫండ్ ఆఫర్ చేయని వినూత్నమైన థీమ్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుంటే దీర్ఘకాలం పాటు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయండి.

 నేను జీవన్ సరళ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వార్షిక ప్రీమియం రూ.29,800. నేను ఇప్పటికే మొదటి ప్రీమియాన్ని చెల్లించాను. అయితే ఇది సరైన పాలసీ కాదని, దీని కంటే మంచి పాలసీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ పాలసీని ఇప్పుడు సరెండర్ చేయడమే ఉత్తమమా లేకుంటేమరో ప్రీమియం చెల్లించిన తర్వాత సరెండర్ చేయమంటారా?                                   
- వీరేశ్, హైదరాబాద్

 ఎల్‌ఐసీ జీవన్ సరళ్ అనేది ఎండోమెంట్ పాలసీ. ఈ కేటగిరిలోని ఇతర ప్లాన్‌ల మాదిరే వ్యయాల విషయమై ఈ పాలసీలో పారదర్శకత లేదు. పాలసీ ముగిసిన తర్వాత పాలసీ మొత్తాన్ని, లాయల్టీ బోనస్‌లను ఎల్‌ఐసీ మీకు చెల్లిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది సరైన ఇన్వెస్ట్‌మెంట్ కాదు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు దీనికంటే మంచి రాబడులు పొందవచ్చు. అందుకని తక్షణం ఈ పాలసీని సరెండర్ చేయండి. మీరు చెల్లించిన ప్రీమియమ్‌లో 30 శాతం సరెండర్ వేల్యూగా(తొలి ఏడాది ప్రీమియం మినహా) మీకు వస్తుంది. ఇప్పుడు మీరు సరెండర్ చేస్తే మీకు ఏమీ రాదు. అయితే మీ నష్టాలను మీరు తగ్గించుకోగలుగుతారు. మరో ప్రీమియం చెల్లించిన తర్వాత ఈ పాలసీని సరెండర్ చేస్తే మీ నష్టాలు మరింతగా పెరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement