కీలడిలో పురావస్తు శాఖ పరిశోధనలు కొనసాగిస్తున్న ప్రాంతం
సాక్షి, చెన్నై : మదురై జిల్లా కీలడి కావేరి కూం పట్టినంలో రెండేళ్ల క్రితం పురాతన కాలం నాటి నిర్మాణాలు బయటపడ్డాయి. దీంతో కేంద్ర పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. కీలడి పరిసరాల్లో రెండేళ్లుగా తీవ్ర పరిశోధన సాగుతోంది. ఇప్పటికే మూడు విడతలుగా పురావస్తు పరిశోధన సాగింది. ఈ పరిశోధనలకు అడ్డంకులు సృష్టించిన వాళ్లూ ఉన్నారు. అన్నింటినీ అధిగమి ంచి, చివరకు గత వారం రాష్ట్ర సాంస్కృతిక విభాగంతో కలసి కేంద్ర పురావస్తు శాఖ నాలుగో విడత పరిశోధనను చేపట్టింది. ఇదివరకు సాగిన మూడు పరిశోధనల్లో పురాతన కాలానికి చెందిన ఎనిమిది వేల వస్తువులు బయటపడ్డాయి. ఇందులో అద్దాలతో రూపొందించిన వస్తువులతో పాటు నవరత్నాలు పొదిగిన వస్తువులు సైతం ఉన్నట్టు వెలుగు చూసింది. అయితే, నాలుగో విడత పరిశోధనల్లో బంగారు నిధి బయటపడ్డట్టుగా సమాచారం. గత రెండేళ్లుగా కీలడికి చెందిన చంద్రన్‌కు చెందిన పదిహేను ఎకరాల విస్తీర్ణంలోని స్థలంలో పరిశోధన సాగింది. తాజాగా కార్తీక్ అనే వ్యక్తికి చెందిన ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలోని స్థలంలో పరిశోధన సాగుతోంది.
ఇక్కడ బావులు, ఆ బావుల మధ్య భాగంలో రహస్య గది, అందులో నుంచి గుహలోకి వెళ్లే రీతిలో మార్గాలు ఉండడం పురావస్తు వర్గాల్ని విస్మయంలో పడేశాయి. ఈ గుహల్లో బంగారు నిధి ఉన్నట్టుగా పరిశోధనలో గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఓ గుహలో కొంతమేరకు బంగారు నిధి బయటపడగా, దానిని అక్కడి నుంచి మరోచోటకు తరలించినట్టు తెలిసింది. దీంతో బావుల్లోని గుహల్లో, రహస్య గదుల్లో గుట్టలు గుట్టలుగా బంగారు నిధి ఉండేందుకు ఆవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం. అయితే, నాలుగో విడత పరిశోధన ముగిసిన అనంతరం పూర్తి వివరాల్ని పురావస్తు శాఖ బయట పెట్టనుంది. అంతవరకు అక్కడున్న బంగారు నిధి గురించిన వివరాల కోసం వేచి చూడాల్సిందే. అక్కడ బంగారు నిధి ఉన్నట్టు పరిశోధనలో వెలుగుచూడడం వల్లే ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారని తెలిసింది. కార్తీక్‌కు చెందిన స్థలం పరిసరాల్లో ఎవరినీ అనుమతించకుండా భద్రతను కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment