గణాంకాలు కీలకం
జీడీపీ, పీఎంఐ గణాకాలు
⇒ వాహన విక్రయ వివరాలు
⇒ యూపీ ఎన్నికలపై ఇన్వెస్టర్ల ఆసక్తి
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), సేవల, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌ను నడిపిస్తాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. విలీనాలు, షేర్ల బైబ్యాక్ ప్రకటనలు, వివిధ రంగాల వారీ వార్తల ప్రభావం స్టాక్‌మార్కెట్‌పై ఉంటుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు.
మంగళవారం జీడీపీ గణాంకాలు
2016 డిసెంబర్ క్వార్టర్(క్యూ3) జీడీపీ గణాంకాలు ఈ మంగళవారం(ఫిబ్రవరి 28) కేంద్రం వెల్లడిస్తుంది. అదే రోజు కీలకమైన ఎనిమిది పరిశ్రమల పనితీరుకు సంబంధించిన గణాంకాలు కూడా వస్తాయి. ఇక బుధవారం(మార్చి 1న) ఫిబ్రవరి నెల వాహన విక్రయాల గణాంకాలు వెలువడతాయి. దీంతో వాహన షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. ఫిబ్రవరిలో భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలను మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ బుధవారం వెలువరించనున్నది. ఇక భారత సేవల రంగం పీఎంఐ గణాంకాలను ఈ సంస్థ శుక్రవారం(మార్చి3న) వెల్లడిస్తుంది. ఇంధన ధరల సవరణ నేపథ్యంలో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓఎల్ వంటి ప్రభుత్వ రంగ మార్కెటింగ్ కంపెనీల షేర్లు, జెట్ ఎయిర్‌వేస్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, స్పైస్‌జెట్‌వంటి విమానయాన కంపెనీల షేర్లు వెలుగులోకి రావచ్చు.
యూపీపై దృష్టి...
దేశీయంగా ఎలాంటి ప్రధాన సంఘటన లేనందున ఈ వారం మార్కెట్ నిస్తేజంగా ఉండొచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా అంచనా వేస్తున్నారు. అందుకని ప్రధానంగా అంతర్జాతీయం సంకేతాల ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్టాక్ సూచీల్లో కరెక్షన్ జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇన్వెస్టర్లు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దృష్టిపెట్టారని వివరించారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తే, మార్కెట్లో ర్యాలీ వస్తుందని పేర్కొన్నారు. మార్కెట్ భవితవ్యాన్ని తేల్చడానికి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అబ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. యూపీతో పాటు జరిగిన ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 11న వస్తాయి. నిఫ్టీ 9,016 పాయింట్ల నిరోధాన్ని దాటగలిగితే మరింతగా ముందుకు వెళుతుందని, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ హెడ్(రిటైల్ రీసెర్చ్) దీపక్ జసాని చెప్పారు. ఒకవేళ 8,809 మద్దతు కోల్పోతే బలహీనపడుతుందని వివరించారు.
విదేశీ పెట్టుబడులు ఎట్‌రూ.14,638 కోట్లు
పన్ను అంశాల్లో స్పష్టత కారణంగా ఈ నెలలో విదేశీ పెట్టుబడులు జోరుగా ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.14,638 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో మరో రెండు ట్రేడింగ్ సెషన్లు మిగిలిఉన్నందున పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో ఇప్పటిదాకా ఎఫ్‌పీఐలు మన స్టాక్స్‌లో రూ.9,359 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.5,279 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు.