జీడీపీ డేటా, ఫలితాలు కీలకం...
⇔ చివరి దశ క్యూ4 ఫలితాలు
⇔ రుతుపవనాల పురోగతి
⇔ ఈ వారం మార్కెట్ పభావిత అంశాలు
ఈ వారంలో వెలువడే జీడీపీ, తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. నైరుతి రుతుపవనాల పురోగతి కూడా ప్రభావం చూపుతుందని వారంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడ, ప్రపంచ మార్కెట్ల గమనం, డాలర్‌తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తదితర అంశాలు కూడా కీలకమేనని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
31న జీడీపీ డేటా...
నేడు(సోమవారం–ఈ నెల 29) బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, ఎల్ అండ్ టీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్‌లు ఆర్థిక ఫలితాలను వెల్ల డించనున్నాయి. మంగళవారం (ఈ నెల 30న) హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు తమ ఫలితాలను ప్రకటిస్తాయి. ఇక బుధవారం (ఈ నెల 31న) గత ఆర్థిక సంవత్సరం క్యూ4 జీడీపీ గణాంకాలను ప్రభుత్వం వెల్లడించనున్నది. గురువారం (వచ్చే నెల 1న) మార్కెట్ ఎకనామిక్స్ సంస్థ తయారీ రంగానికి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు వస్తాయి. మే నెల వాహన విక్రయ గణాంకాలు గురువారం వెలువడనుండటంతో వాహన షేర్లు వెలుగులోకి రావచ్చు. ఇంధన ధరల సవరణ కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, విమానయాన కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది.
మార్కెట్ ముందుకే..
మార్కెట్ ఇప్పటికే రికార్డ్ స్థాయికి చేరనందున ఈ వారం ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. సకాలంలో రుతుపవనాలు రావడం, జీడీపీ గణాంకాలు బావుండడం సంభవిస్తే మార్కెట్ మరింత ముందుకు దూసుకుపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కంపెనీల ఫలితాల వెల్లడి చివరి దశకు వచ్చినందున ఇక ఇప్పుడు అందరి కళ్లు జీఎస్‌టీ అమలుపై ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. కంపెనీల ఫలితాలు మెరుగుపడుతుండడం, విదేశీ పెట్టుబడులు జోరుగా వస్తుండడంతో మార్కెట్ ర్యాలీ కొనసాగుతోందని పేర్కొన్నారు.