ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోకుండా నిరోధించడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవలి చర్యలు ఫలితం ఇవ్వలేదు. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో రూపాయి విలువ ఒకేరోజు 43 పైసలు పతనమయ్యింది. 73.34 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 73.42ను కూడా చూసింది. రూపాయి బలహీనత బాటలో ఇంట్రాడే, ముగింపు రెండూ కొత్త రికార్డులు కావడం గమనార్హం. రూపాయి ప్రారంభంతోటే 73.26 దిగువన ప్రారంభమైంది. గరిష్టంగా 72.90ని తాకింది. ఈ ఏడాది రూపాయి ఇప్పటి వరకూ 15 శాతం పతనమయ్యింది. ఇప్పటి వరకూ రూపాయి ఇంట్రాడే, ముగింపు కనిష్టం స్థాయిలు 72.99, 72.98.
కారణాలు ఇవీ...
ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడవుతున్న డాలర్ ఇండెక్స్ మళ్లీ పటిష్ట నిరోధం 95 స్థాయిని దాటి ట్రేడవుతోంది. ఈ వార్తరాసే 9 గంటల సమయానికి 95.35 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తీవ్రత తగ్గడం లేదు. నాలుగున్నర సంవత్సరాల గరిష్ట స్థాయిలో క్రూడ్ ధరలు ట్రేడవుతున్నాయి. బుధవారం రాత్రి 11 గంటలకు నైమెక్స్ బ్యారల్ ధర 2% ఎగసి 76.70 డాలర్ల వద్ద ట్రేడవుతుంటే, భారత్ దిగుమతుల్లో ప్రధానమైన బ్రెంట్ క్రూడ్ ధర 86.58 వద్ద ట్రేడవుతోంది. ఇక అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రేటు పెం పుతో దేశంలో ఇన్వెస్ట్‌చేసే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వడ్డీగిట్టుబాటుకాని పరిస్థితి. ఫెడ్ రేటు పెంపు, బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో, ఈ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం తక్ష ణం విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెన క్కు తీసుకు వెళ్లిపోవడం భారీగా జరుగుతోంది. ఒకవైపు క్రూడ్ దిగుమతులకు వ్యయాలు పెరుగుతుండడం, విదేశీ నిధులు బయటకు వెళ్లిపోతుండడం వంటి పరిణామాలు కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం)పై ఆందోళనలను సృష్టిస్తోంది.
ఆర్‌బీఐ కీలక సమావేశం ప్రారంభం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ 5వ తేదీన పాలసీ రేట్లపై తమ విధానాన్ని ప్రకటించనుంది. అరశాతం వరకూ రేటు పెంపు ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. క్రూడ్ ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల అంచనాలు ఇందుకు ఒక కారణం. అలాగే అమెరికా వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో దేశం నుంచి విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతోంది. ఇది రూపాయి బలహీనతకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోనూ రేట్ల పెంపు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
ఇక ప్రత్యక్షంగా ఈసీబీలకు ఆయిల్ కంపెనీలు!
డాలర్ మారకంలో రూపాయి పతనం కొనసాగుతుండటంతో విదేశీ కరెన్సీని భారీగా వినియోగించుకునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల(ఓఎంసీ)కు కేంద్రం వెసులుబాటు కల్పించింది. వర్కింగ్ క్యాపిటల్‌కుగాను విదేశీ వాణిజ్య రుణాలను (ఈసీబీ) ప్రత్యక్షంగా ఎటువంటి అనుమతులూ లేకుండా ఆటోమేటిక్‌గా సమీకరించుకోడానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అనుమతి నిచ్చింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. తాజా నిర్ణయం నేపథ్యంలో... చమురు మార్కెటింగ్ కంపెనీలు ‘‘ఆటోమేటిక్ రూట్’’ ద్వారా గుర్తింపుకలిగిన రుణదాతల నుంచి మూడేళ్ల నుంచి ఐదేళ్ల మెచ్యూరిటీ కనీస సగటుతో వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం ఈసీబీలను సమీకరించుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం ఓఎంసీలు ప్రత్యక్ష లేదా పరోక్ష షేర్‌హోల్డర్లు లేదా గ్రూప్ కంపెనీ నుంచి సగటున ఐదేళ్ల మెచ్యూరిటీతో మాత్రమే ఈసీబీలను సమీకరించుకోగలుగుతున్నాయి. విదేశీ కరెన్సీ రుణాలకు సంబంధించి ప్రభుత్వ రంగ రిఫైనరీలకు ఒక్కొక్కదానికీ ఉన్న 750 మిలియన్ డాలర్ల పరిమితిని కూడా సెంట్రల్ బ్యాంక్ తొలగించింది. కొత్త నిబంధనల మేరకు వార్షిక విదేశీ కరెన్సీ రుణ పరిమితి 10 బిలియన్ డాలర్లుగా ఉంది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment