సాక్షి,ముంబై: టెలికాం రంగం సంచలనం రిలయన్స్ జియో ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్లను దడదడలాడిస్తోంది. జియో దెబ్బకి మార్కెట్ లీడర్ ఎయిర్‌టెల్ లక్షల సంఖ్యలో కస్టమర్లను ఇప్పటికే కోల్పోగా, తాజాగా జాబితాలోకి ఇప్పుడు వోడాఫోన్ ఐడియా వచ్చి చేరింది. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తాజాగా వెలువరించిన గణాంకాల ప్రకారం వోడాఫోన్-ఐడియా మెగా మెర్జర్‌తో దేశంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించిన వోడాఫోన్ ఐడియాకు భారీ షాకే తగిలింది. సుమారు10.5 మిలియన్ కస్టమర్లలో దాదాపు 50శాతానికి పైగా జియోకు మళ్లిపోయారు. ఇదే మార్కెట్లో ఇతర టెల్కోల గుండెల్లో గుబులు రేపుతోంది.
ట్రాయ్ అందించిన లెక్కల ప్రకారం జియో, బీఎస్ఎన్ఎల్ కలిపి అక్టోబర్ మాసంలో కోటికిపైగా కొత్త కస్టమర్లను తమ నెట్‌వర్క్‌లో జోడించుకున్నాయి. ముఖ్యంగా జియో ఒక్కటే ఏకంగా కోటిమందిని కొత్తగా తన ఖాతాలో వేసుకుంది. జియో మొత్తం కనెక్షన్ల సంఖ్య 26.28కోట్లకు చేరిందని తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్తగా 3,63,991మంది వినియోగదారులను చేర్చుకోవడంతో మొత్తం చందాదారుల సంఖ్య 11.34 కోట్లకు చేరింది. అయితే వోడాఫోన్ ఐడియా సహా మిగిలిన టెల్కోలు ఎయిర్‌టెల్, టాటా టెలీసర్వీసెస్, ఎంటీఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కాం ) చతికిల పడ్డాయి. కోటికిగా పైగా వినియోగదారులను కోల్పోయాయి.
వోడాఫోన్ ఐడియా 2018లో సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య కాలంలో 14 మిలియన్ల మంది చందాదారులను కోల్పోగా, ఇదే సమయంలో రిలయన్స్ జియో 23.5( 23 కోట్ల 50 వేలమంది) మిలియన్ల కస్టమర్లను కొత్తగా చేర్చుకుంది. సెప్టెంబర్ నాటికి వోడాఫోన్ ఐడియా యావరేజ్ రెవెన్యూ పర్ మంత్ (ARPU) నెలకు రూ. 88 గా ఉంటే, రిలయన్స్ జియో ARPU నెలకు రూ. 99 గా ఉంది. అలాగే జియోకు 7.3 మిలియన్లు వోడా ఫోన్ ఐడియా కస్టమర్లు 2018 అక్టోబర్‌లో తమ సబ్‌స్క్రిప్షన్లను వదులుకోవడం గమనార్హం.
మరోవైపు ఇటీవలఎయిర్‌టెల్ లైఫ్ కస్టమర్లపై కొత్తగా విధించిన నిబంధన కీలక పరిణామం. తమ యావరేజ్ రెవెన్యూ పర్ మంత్ను పెంచుకోడానికి నెలకు కనీస రీఛార్జ్ రూ. 35 మెయింటైన్ చేయకపోతే జీవిత కాల ఫ్రీ ఇన్ కమింగ్ ప్లాన్ రద్దు చేస్తామని ప్రకటించింది. ఇదే బాటలో వోడాఫోన్ ఐడియా నడవడంతో దాదాపు ఒక కోటి 40 లక్షల మంది వినియోగదారులను కోల్పోవాల్సి వచ్చింది. 2018లో వోడాఫోన్ ఐడియా తన కస్టమర్లను క్రమ క్రమంగా కోల్పోతూ వచ్చింది. జూలైలో 0.6 మిలియన్ల కస్టమర్లను పెరగ్గా, ఆగస్ట్ నాటికి 2.3 మిలియన్ల కస్టమర్లను కోల్పోయింది. ఇలా సంస్థకు గుడ్ బై చెప్పిన వారి సంఖ్య అక్టోబర్ నాటికి 7.4 మిలియన్లకు చేరింది.
జనవరి-జూన్‌లో 9-10 మిలియన్లుగా ఉన్న జియో నెట్‌వర్క్ రన్ రేటు, జూలై-సెప్టెంబరులో 12-13 మిలియన్లుకు పెరిగింది. అయితే అక్టోబరులో కొంచెం తక్కువగా ఉందని మెర్గాన్ స్టాన్లీ వ్యాఖ్యానించింది. మరోవైపు ఎయిర్‌టెల్ వొడాఫోన్ ఐడియా, వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్ చందాదారులలో మంచి పెరుగుదల నమోదు చేసిందని పేర్కొంది. ఈ పరిణామాలపై వోడాఫోన్ ఐడియా సమీక్షించుకోవాలని, నాణ్యమైన సేవలతో, సరసమైన టారిఫ్ ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకోవడంతోపాటు సరికొత్త వ్యూహాలతో 2019 చివరినాటికి తమ పనితీరును మెరుగు పరుచుకోవాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment