
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కంపెనీల దెబ్బకి దక్షణకొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో వెయ్యికి పైగా ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుందన్న వార్తలపై సంస్థ స్పందించింది. ఇవి తప్పుడు వార్తలని కొట్టి పారేసింది. పైగా మరింత మంది ప్రతిభావంతులను ప్రోత్సహించనున్నామని పేర్కొంది. భారతదేశంలో తమ పెట్టుబడులు కొనసాగుతాయనీ, దేశీయ టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌కు సిద్ధమైన అనంతరం 5జీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తామని తెలిపింది. ఇది మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారి తీస్తుందని శాంసంగ్ ప్రకటించింది.
భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తామని, ఇందుకోసం పెట్టుబడులు పెడుతూనే ఉంటామని శాంసంగ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఆర్ అండ్ డీలో పెట్టుబడులు, 5జీ నెట్వర్క్ వంటి కొత్త వ్యాపారాల అన్వేషణకు ఉపయోగిస్తామన్నారు. ఈ క్రమంలోనే గతేడాది 2వేలకు పైగా కొత్త కొలువులను ఆఫర్ చేశామంటూ మంగళవారం వివరణ ఇచ్చింది. ఇండియాలో తమ వ్యాపారం విస్తరిస్తున్న క్రమంలో ఉద్యోగాల కల‍్పనలో తమ పాత్ర ఉంటుందన్నారు. దీర్ఘకాలిక వ్యాపార విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఉద్యోగాలను కల్పించనున్నామని ప్రతినిధి తెలిపారు. భారత మార్కెట్ తన 5జీ టెక్నాలజీ రానున్న నేపథ్యంతో తాము నైపుణ్యమున్న ఉద్యోగులకు ఏడాది పొడవునా ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment