
ఏప్రిల్ 5న పావుశాతం రేటు కోత: డాయిష్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వచ్చే నెల 5వ తేదీ ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా పావుశాతం మాత్రమే రేటు కోత నిర్ణయం తీసుకుంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం డాయిష్ బ్యాంక్ అంచనావేసింది. అంతకుమించి రేటు కోతకు ఆర్‌బీఐ ముందు ద్రవ్యోల్బణం పరమైన అడ్డంకులు ఉంటాయని విశ్లేషించింది. వాస్తవ వడ్డీరేటు 1.5 శాతం నుంచి 2 శాతం శ్రేణిలో ఉండాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు కనబడుతోందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. 2016-17లో ద్రవ్యోల్బణం 5 శాతంగా అంచనా వేస్తే... 6.50 శాతం లోపునకు రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) తగ్గించే అవకాశాలు ఆర్‌బీఐ ముందు అతి తక్కువగా ఉంటాయని విశ్లేషించింది. ఒకవేళ 50 బేసిస్ పాయింట్లను ఏప్రిల్5న తగ్గిస్తే... ఆపై రేటు కోత ఉండబోదని ఆర్‌బీఐ స్పష్టమైన సంకేతం ఇచ్చే అవకాశం ఉందని వివరించింది.