విండోస్ 10 వచ్చేసింది..
♦ భారత్ సహా 190 దేశాల్లో అందుబాటులోకి
♦ నమోదు చేసుకుంటే ఉచిత అప్‌గ్రేడేషన్
న్యూఢిల్లీ : సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బుధవారం తమ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 10’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఢిల్లీ సహా ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో దీన్ని ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్.. సుమారు 190 దేశాల్లో విండోస్ 10ను బుధవారం నుంచే అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఆవిష్కరణగా కెన్యాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. 50 లక్షల మంది పైగా యూజర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం దీన్ని తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ‘‘విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలోకెల్లా ఇది అత్యంత సురక్షితమైన వెర్షన్. పీసీల నుంచి ట్యాబ్లెట్లు, ఫోన్లు, ఎక్స్‌బాక్స్ మొదలైన అన్నిటికీ ఇది అనుకూలంగా ఉంటుంది’’ అని చెప్పారాయన.
సిసలైన విండోస్ 7 లేదా విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వారికి విండోస్ 10 అప్‌గ్రేడింగ్ ఉచితంగా అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ (విండోస్ అండ్ డివెజైస్ గ్రూప్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టెర్రీ మయర్సన్ తెలిపారు. ఇందుకోసం నమోదు చేసుకున్న వారికి అప్‌గ్రేడ్ ఎప్పుడు అందించేదీ నోటిఫై చేస్తామని ఆయన తెలియజేశారు. భారత మార్కెట్లో యూజర్లకు ఉపయోగపడేలా యాప్స్ తయారీ కోసం కంపెనీ పలువురు డెవలపర్లతో కలసి పనిచేస్తోంది. ఇప్పటికే జొమాటో, బుక్ మై షో, జబాంగ్, మొబిక్విక్, గానా వంటి సంస్థలతో చేతులు కలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల పైచిలుకు విండోస్ యూజర్లు ఉన్నారని అంచనా.
మళ్లీ స్టార్ట్ మెనూ...
వాయిస్ ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్ కోర్టానా, గేమింగ్ కోసం ఎక్స్‌బాక్స్ యాప్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో కొత్త వెబ్ బ్రౌజర్ ‘మైక్రోసాఫ్ట్ ఎడ్జ్’ మొదలైనవి కొత్త వెర్షన్లో ఉండే ఫీచర్లు. విండోస్ 7, అంతకు పూర్వపు వెర్షన్ల తరహాలోనే విండోస్ 10లో మళ్లీ స్టార్ట్ మెనూకి చోటు కల్పించారు. అలాగే ఫోటోలు, మ్యాప్స్, మ్యూజిక్, సినిమాల కోసం ప్రత్యేకంగా బిల్టిన్ యాప్స్ ఇందులో ఉన్నాయి. కోర్టానా ఫీచర్ మాత్రం భారత్‌లో అందుబాటులోకి రావడానికి మరికాస్త సమయం పడుతుందని మైక్రోసాప్ట్ ఇండియా డెరైక్టర్ (విండోస్ బిజినెస్ గ్రూప్) వినీత్ దురాని తెలిపారు.