windows operating system
-
క్రౌడ్‌స్ట్రైక్ అతలాకుతలం
వాషింగ్టన్: ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం సాంకేతిక సమస్య ఆర్థికంగా కూడా అంతర్జాతీయంగా గట్టి ప్రభావమే చూపింది. పలు దిగ్గజ సంస్థల షేర్ల విలువ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తప్పుడు అప్డేట్తో సమస్యకు కారణమైన సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్‌స్ట్రైక్‌కు ఆర్థికంగా గట్టి దెబ్బే తగిలింది. శుక్రవారం ఆ సంస్థ షేర్ వాల్యూ ఒక్కసారిగా 11 శాతానికి పైగా పడిపోయింది. 42.22 డాలర్లున్న ఒక్కో వాటా విలువ 30 డాలర్లకు తగ్గింది. సంస్థ మొత్తం విలువ 83 బిలియన్ డాలర్ల పై చిలుకని అంచనా. ఆ లెక్కన 900 కోట్ల డాలర్లకు పైగా హరించుకుపోయినట్టే. అయితే ఆర్థిక నష్టం కంటే కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ సంస్థగా క్రౌడ్‌స్ట్రైక్‌కు ఉన్న ఇమేజీకి జరిగిన నష్టమే చాలా ఎక్కువ. ఎందుకంటే దాని కస్టమర్లుగా ఉన్న కంపెనీలు, పెద్ద సంస్థల్లో చాలావరకు తమ సైబర్ సెక్యూరిటీ బాధ్యతల కోసం ఇతర సైబర్ సెక్యూరిటీ సంస్థలవైపు చూస్తున్నట్టు సమాచారం. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ ఇప్పటికే ఈ జాబితాలో చేరారు. ‘‘మా వ్యవస్థల నుంచి క్రౌడ్స్ట్రౌక్ను తొలగించేశాం’’ అంటూ ఆయన సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు. సెంటినల్ వన్, పాలో ఆల్టో నెట్వర్క్ వంటి క్రౌడ్ర్స్టౌక్ ప్రత్యర్థి కంపెనీలు ఈ పరిస్థితిని రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నాయి. భారీ పరిహారాలు! మరోవైపు క్రౌడ్‌స్ట్రైక్ కస్టమర్లంతా తమకు జరిగిన నష్టానికి ఆ సంస్థ నుంచి భారీగా నష్టపరిహారం డిమాండ్ చేసేలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఆ సంస్థ క్లయింట్ల జాబితాలో ఉండటం తెలిసిందే. షట్‌డౌన్ దెబ్బకు వాటి షేర్ల విలువ సగటున ఒక శాతం దాకా పడిపోయినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
ఇంటర్నెట్లో అండర్ వరల్డ్‌గా డార్క్ వెబ్!
...ఇటీవల కాలంలో బయటపడిన ఈ రెండు ఉదంతాలే కాదు... నగరంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో సగానికి పైగా డార్క్ నెట్ ద్వారానే సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం మహేష్ బ్యాంక్ కేంద్రంగా చోటు చేసుకున్న రూ.12.48 కోట్ల స్కామ్‌లోనూ డార్క్ వెబ్ పాత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్–న్యూలో పని చేస్తున్న సిబ్బంది, అధికారులకు ఈ కోణంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షి హైదరాబాద్: మాదకద్రవ్యమైన ఎల్ఎస్డీ బ్లాట్స్ డార్క్ నెట్ నుంచి ఖరీదు చేసి, నగరంలో విక్రయిస్తున్న షాబాజ్నగర్, కూకట్పల్లి ప్రాంతాలకు చెందిన సయ్యద్ ఆసిఫ్ జిబ్రాన్, పి.తరుణ్‌లను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు గత నెల 24న పట్టుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టును హెచ్–న్యూ ఫిబ్రవరి 26న రట్టు చేసింది. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ డార్క్‌నెట్ నుంచి ఎల్ఎస్డీ బ్లాట్స్ ఖరీదు చేసి విక్రయించాడు. అదో ‘అక్రమ’లోకం డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్‌తో సమాజానికి, ఏజెన్సీలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మాఫియా ప్రపంచంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ అధోజగత్తు ఉంది. కనిపించే అండర్‌వరల్డ్‌లో మాఫియా డాన్లు రాజ్యమేలితే... ఇంటర్నెట్లోని డార్క్‌నెట్/వెబ్‌గా పిలిచే అండర్‌గ్రౌండ్ వెబ్‌లో డ్రగ్స్, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా వంటి వ్యాపారాలు సాగుతుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటూ అక్రమ దందాలకు డార్క్ వెబ్ అడ్డాగా మారిపోయింది. నిఘాకు చిక్కకుండా ఉండేందుకు... కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్ వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చి, అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిఘాకు చిక్కకుండా, ‘తమ వినియోగదారుల’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాలు ఇంటర్నెట్లోని అండర్ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. ‘ఎంట్రీ’ సైతం ఈజీ కాదు.. ఏ వినియోగదారుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. ఈ అధోజగత్తులో అడుగుపెట్టాలంటే టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్స్టాల్ అవుతుంది. వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకుంటున్న పెడ్లర్లు తమ దందా కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ల్యాప్‌టాప్, కంప్యూటర్ ద్వారానే యాక్సస్ చేసే డార్క్ వెబ్‌ను ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల నుంచీ ఆపరేట్ చేసేస్తున్నారు. ఇందులో ఉండే అనేక వెబ్సైట్, గ్రూపులను సంప్రదించి డ్రగ్స్, మారణాయుధాల సహా ఏదైనా ఖరీదు చేసేయవచ్చు. పోస్టు లేదా కొరియర్ ద్వారా వచ్చే ఈ ‘మాల్’ను అందుకోవడానికి తప్పుడు చిరునామాలు ఇచ్చి నేరుగా ఆయా ఆఫీసులకు వెళ్లి..నకిలీ ధ్రువీకరణలు చూపించి డెలివరీ తీసుకుంటూ తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిట్ కాయిన్స్ రూపంలో చెల్లింపులు... డీప్ వెబ్‌లోని వెబ్సైట్లలో ఆర్డర్ ఓ ఎత్తయితే దీనికి సంబంధించిన చెల్లింపులు మరోఎత్తు. ఈ లావాదేవీలు సైతం ఆన్లైన్లోనే క్రిప్టోకరెన్సీగా పిలిచే బిట్‌కాయిన్స్ రూపంలోనే సాగుతాయి. దీనికోసమూ ఇంటర్నెట్లో కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. వాటిలోకి లాగిన్ కావడం ద్వారా ఓ ఖాతా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా నగదు చెల్లించి బిట్ కాయిన్స్‌ను తమ ఖాతాలోకి జమ చేసుకుంటారు. ‘డీప్ వెబ్’లో కొనుగోలు చేసిన ‘మాల్’కు అవసరమైన చెల్లింపులన్నీ ఈ బిట్‌కాయిన్స్ రూపంలోనే చేస్తారు. ఈ వ్యవహారంలో ఎక్కడా విక్రయిస్తున్న, ఖరీదు చేస్తున్న వ్యక్తుల వివరాలు వేరొకరికే కాదు... ఒకరికొకరికీ తెలిసే అవకాశం ఉండదు. హెచ్–న్యూకు చిక్కిన పెడ్లర్స్ ఈ రకంగానే దందా చేస్తూ ఎల్ఎస్డీని ఖరీదు చేసి నగరంలోని వారికి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే అసాంఘిక శక్తులకు కలిసి వస్తున్న అంశంగా మారిపోయింది. ఈ తరహా కేసులు గతంలో ఇతర నగరాల్లో ఎక్కువగా వెలుగులోకి వచ్చినా... ఇటీవల కాలంలో నగరంలోనూ పెరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇలా ఆర్డర్ చేసిన డ్రగ్స్‌లో కొన్ని విదేశాల నుంచి మరికొన్ని ఉత్తరాది నుంచి వస్తున్నట్లు ఆధారాలు సేకరించామన్నారు. (చదవండి: డీజే.. డ్రగ్స్ రిస్క్!) -
విండోస్ యూజర్లకు అలెర్ట్..! అవి కచ్చితంగా కావాల్సిందే..
మనలో చాలా మంది ఎక్కువగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంను వాడుతుంటాం. గత ఏడాది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. విండోస్ 10ను వాడే యూజర్లు ఉచితంగా విండోస్ 11కు ఆప్ గ్రేడ్ కావచ్చునని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా విండోస్ 11 ప్రో ఆపరేటింగ్ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్ చిన్న మెలిక పెట్టింది. కచ్చితంగా కావాల్సిందే..! మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ప్రోకి ప్రారంభ సెటప్ సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ అవసరం అని కంపెనీ ప్రకటించింది. విండోస్ 11 హోమ్ ఎడిషన్ మాదిరిగానే, విండోస్ 11 ప్రొ ఎడిషన్‌ను మొదటి సారి వినియోగించే సమయంలో మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. ప్రస్తుతం, విండోస్ 11 ప్రొ వినియోగదారులు సెటప్ సమయంలో ఇంటర్నెట్ నుంచి కంప్యూటర్ ని డిస్కనెక్ట్ చేయడంతో తాత్కాలికంగా లోకల్ అకౌంట్ క్రియేట్ చేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయకుండానే ప్రారంభించవచ్చును. మీ వ్యక్తిగత సమాచారంతో పాటు, పూర్తిగా లెవల్లో విండోస్ 11 ప్రొను వినియోగించాలంటే మాత్రం మైక్రోసాఫ్ట్ అకౌంట్ తప్పనిసరి. అయితే ఇప్పటికే విండోస్ 10లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ వాడుతున్నవారు నేరుగా మైక్రోస్టాఫ్ 11 ప్రొ ఎడిషన్‌లోకి లాగిన్ అవవచ్చు. అంతేకాకుండా వారు ఇప్పటికే ఆ అకౌంట్లో నిలువు చేసుకున్న డాటాను ఈ వెర్షన్లో వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే మైక్రోసాఫ్ట్ రాబోయే కొన్ని నెలల్లో విండోస్ 11 ప్రోని విడుదల చేయనుంది. -
ప్రపంచ వ్యాప్తంగా విండోస్ 11 యూజర్లు ఎంతో తెలుసా ?
స్మార్ట్ఫోన్లు జన జీవితంలోకి ఎంతగా చొచ్చుకువచ్చినా.. ఆకాశమే హద్దుగా గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ దూసుకుపోతున్నా.. చాపకింద నీరులా మాక్‌పాడ్ ప్రపంచాన్ని చుట్టేస్తున్నా... ఇప్పటికీ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లకు విండోస్ సాఫ్ట్వేర్లే ప్రధాన అండ. విండోస్ 8 ఓస్ నుంచి మైక్రోసాఫ్ట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది,. ఐప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరి నమ్మకం ఇంకా మైక్రోసాఫ్ట్ - విండోస్ మీదనే ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పిన వివరాలే అందుకు తార్కాణం. విండోస్ యూజర్లు ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల మంది విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ల వెల్లడించారు. ఇందులో ఫస్ట్, థర్డ్ పార్టీవి కూడా ఉన్నాయని వెల్లడించారు. విండోస్ 10తో పోల్చితే విండోస్ 11 వేగం మూడింతలు ఎక్కువ అని తెలిపారు. వీటిని మినహాయిస్తే విండోస్ 7, విండోస్ 8లపై కూడా ఇదే సంఖ్యలో యూజర్ల ఉంటారని అంచనా. దీంతో ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌గా విండోస్ నిలిచింది. టీమ్‌దే ఆధిపత్యం ఇక కోవిడ్ సంక్షోభం తర్వాత వర్చువల్ మీటింగ్స్ సర్వసాధారణం అయ్యాయి. అనేక రకాల యాప్‌లు జనం నోళ్లలో నానుతున్నాయి. అయితే బిజినెస్ వరల్డ్ మాత్రం వర్చువల్ మీటింగ్స్‌కి ఎక్కువగా మైక్రోసాఫ్ట్‌కి చెందని టీమ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. సత్య నాదెళ్ల తెలిపిన వివరాల ప్రకారం ఫార్చున్ 500 కంపెనీల్లో 90 శాతం టీమ్‌పైనే ఆధారపడుతున్నాయి. చదవండి:భవిష్యత్తులో ఇవే కీలకమన్న సత్య నాదెళ్ల -
గూగుల్ సంచలన నిర్ణయం...!
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆండ్రాయిడ్ యాప్‌లను విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్చేయనున్నట్లు పేర్కొంది. ఆండ్రాయిడ్ యాప్‌లకు మద్దతు ఇచ్చే మొదటి ఆపరేటింగ్ సిస్టమ్‌గా విండోస్ 11 నిలిచింది. విండోస్ 11 లో ఆండ్రాయిడ్ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కాకుండా అమెజాన్ యాప్ స్టోర్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీలో భారత్ స్థానం ఎంతో తెలుసా...! తాజాగా గూగుల్ ఆండ్రాయిడ్ యాప్‌లను, గేమ్‌లను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పాటుగా ఆపిల్ మాక్ బుక్స్‌లో సపోర్ట్చేయడానికి గూగుల్ ప్రణాళికలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి యూఎస్ కోర్టులో ఆపిల్ కంపెనీకి, ఏపిక్ గేమ్స్ మధ్య విచారణ కొనసాగుతుంది. దీంతో గూగుల్ ‘గేమ్స్ ఫ్యూచర్’ అనే అంతర్గత గూగుల్ కాన్ఫిడెన్షియల్ ప్రెజెంటేషన్‌లో ఈ నిర్ణయాన్ని పొందుపర్చినట్లూ ప్రముఖ టెక్ వెబ్‌సైబ్ ది వెర్జ్ గుర్తించంది. ఈ నిర్ణయాన్ని గూగుల్ ప్లే డివిజన్ 2020 అక్టోబర్ నెలలో తీసుకుంది. ఈ ప్రెజెంటేషన్‌లో భాగంగా గూగుల్ 2025 నాటికి గేమింగ్ రంగంలో తన రోడ్‌మ్యాప్‌ను సిద్దంచేసుకుంది. (చదవండి: ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే వడ్డీ కట్టక్కర్లేదు) -
సెక్యూరిటీ ప్రాసెసర్ చిప్.. హ్యాకర్లకు చెక్
న్యూయార్క్: గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా సెక్యూరిటీ ప్రాసెసర్ చిప్‌ను ఆవిష్కరించింది. ప్లూటన్ పేరుతో కొత్తగా అభివృద్ధి చేసిన ఈ చిప్ విండోస్ పీసీలకు మరింత భద్రతను చేకూర్చనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ కొత్త సెక్యూరిటీ చిప్‌ను సిలికాన్ దిగ్గజాలు ఇంటెల్, ఏఎండీ, క్వాల్కామ్ సాంకేతిక సహకారంతో రూపొందించినట్లు తెలియజేసింది. తద్వారా విండోస్ పీసీలలోని నెక్ట్స్ జనరేషన్ హార్డ్‌వేర్‌కు మరింత భద్రతను కల్పించనున్నట్లు వివరించింది. సీపీయూలతో.. మైక్రోసాఫ్ట్ ప్లూటన్ను భవిష్యత్ సీపీయూలలో అంతర్గతంగా ఏర్పాటు చేయనున్నట్లు ఓఎస్ సెక్యూరిటీ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ డేవిడ్ వెస్టన్ తెలియజేశారు. తద్వారా హార్డ్‌వేర్, క్రిప్టోగ్రాఫిక్స్ భద్రతకు వినియోగించే ట్రస్ట్డ్ ప్లాట్పామ్ మాడ్యూల్(టీపీఎంలు)ను ఈ చిప్ రీప్లేస్ చేయనున్నట్లు వివరించారు. ఈ ఆధునిక సెక్యూరిటీ ప్రాసెసర్(ప్లూటన్) హ్యాకర్ల నుంచి మరింత భద్రతను చేకూరుస్తుందని పేర్కొన్నారు. తద్వారా హ్యాకర్లు ఆపరేటింగ్ సిస్టమ్‌లో భాగంగా అంతర్గతంగా దాక్కునేందుకు లేదా.. ఫిజికల్ ఎటాక్స్ చేసేందుకు కష్టమవుతుందని తెలియజేశారు. క్రెడిన్షియల్, ఎన్క్రిప్షన్ కీస్ వంటివి చోరీ చేయడాన్ని ఈ చిప్ అరికడుతుందని వివరించారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ బగ్స్నుంచి రికవరీ సాధించేందుకు సైతం తోడ్పడుతుందని పేర్కొన్నారు. వెరసి కమ్యూనికేషన్ చానల్‌పై దాడి అవకాశాలకు చెక్ పెడుతుందని చెప్పారు. గత పదేళ్లుగా టీపీఎంలు విండోస్‌కు మద్దతిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
విండోస్ 10 వచ్చేసింది..
♦ భారత్ సహా 190 దేశాల్లో అందుబాటులోకి ♦ నమోదు చేసుకుంటే ఉచిత అప్‌గ్రేడేషన్ న్యూఢిల్లీ : సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బుధవారం తమ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 10’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఢిల్లీ సహా ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో దీన్ని ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్.. సుమారు 190 దేశాల్లో విండోస్ 10ను బుధవారం నుంచే అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఆవిష్కరణగా కెన్యాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. 50 లక్షల మంది పైగా యూజర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం దీన్ని తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ‘‘విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లలోకెల్లా ఇది అత్యంత సురక్షితమైన వెర్షన్. పీసీల నుంచి ట్యాబ్లెట్లు, ఫోన్లు, ఎక్స్‌బాక్స్ మొదలైన అన్నిటికీ ఇది అనుకూలంగా ఉంటుంది’’ అని చెప్పారాయన. సిసలైన విండోస్ 7 లేదా విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వారికి విండోస్ 10 అప్‌గ్రేడింగ్ ఉచితంగా అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ (విండోస్ అండ్ డివెజైస్ గ్రూప్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టెర్రీ మయర్సన్ తెలిపారు. ఇందుకోసం నమోదు చేసుకున్న వారికి అప్‌గ్రేడ్ ఎప్పుడు అందించేదీ నోటిఫై చేస్తామని ఆయన తెలియజేశారు. భారత మార్కెట్లో యూజర్లకు ఉపయోగపడేలా యాప్స్ తయారీ కోసం కంపెనీ పలువురు డెవలపర్లతో కలసి పనిచేస్తోంది. ఇప్పటికే జొమాటో, బుక్ మై షో, జబాంగ్, మొబిక్విక్, గానా వంటి సంస్థలతో చేతులు కలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల పైచిలుకు విండోస్ యూజర్లు ఉన్నారని అంచనా. మళ్లీ స్టార్ట్ మెనూ... వాయిస్ ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్ కోర్టానా, గేమింగ్ కోసం ఎక్స్‌బాక్స్ యాప్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో కొత్త వెబ్ బ్రౌజర్ ‘మైక్రోసాఫ్ట్ ఎడ్జ్’ మొదలైనవి కొత్త వెర్షన్లో ఉండే ఫీచర్లు. విండోస్ 7, అంతకు పూర్వపు వెర్షన్ల తరహాలోనే విండోస్ 10లో మళ్లీ స్టార్ట్ మెనూకి చోటు కల్పించారు. అలాగే ఫోటోలు, మ్యాప్స్, మ్యూజిక్, సినిమాల కోసం ప్రత్యేకంగా బిల్టిన్ యాప్స్ ఇందులో ఉన్నాయి. కోర్టానా ఫీచర్ మాత్రం భారత్‌లో అందుబాటులోకి రావడానికి మరికాస్త సమయం పడుతుందని మైక్రోసాప్ట్ ఇండియా డెరైక్టర్ (విండోస్ బిజినెస్ గ్రూప్) వినీత్ దురాని తెలిపారు. -
కొత్త హంగులతో
పొరబాట్లు చేయడం... చేసిన తప్పులను దిద్దుకుని ముందుకెళ్లడం మనకే కాదు.. టెక్నాలజీకి కూడా వర్తిస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే తీసుకోండి.. దాదాపు 20 ఏళ్లుగా ఉపయోగిస్తున్న విధానానికి పూర్తి భిన్నంగా విడుదలైన విండోస్-8 అటు సామాన్యులను.. ఇటు కంపెనీలనూ నిరాశపరిచింది. టచ్ స్క్రీన్‌ను దృస్టిలో పెట్టుకుని దీన్ని అభివృద్ధి చేయడం ఇందుకు ఒక కారణం. ఈ తప్పును దిద్దుకునేందుకా అన్నట్లు విండోస్ తాజాగా తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రకటించింది. విండోస్ 8 చేదు అనుభవాన్ని దూరం చేసేందుకన్నట్లు తాజా వెర్షన్‌ను విండోస్ -9 అని కాకుండా విండోస్ -10 గా పేరుపెట్టడం ఒక విశేషం. మిగిలిన కొత్త విశేషాలేమిటో చూద్దామా... మళ్లీ స్టార్ట్ బటన్... విండోస్ స్క్రీన్‌పై కొట్టొచ్చినట్టు కనిపించే అంశం ఎడమవైపు అడుగుభాగంలో ఉండే ‘స్టార్ట్’ బటన్. విండోస్ -8లో దీన్ని తీసేశారు. బదులుగా లైవ్టైల్స్తో కూడిన స్టార్ట్స్క్రీన్ కనిపించింది. తాజాగా విండోస్ -10లో మళ్లీ పాతపద్ధతిలోనే స్టార్ట్ బటన్‌ను ప్రవేశపెట్టాలని విండోస్ నిర్ణయించింది. ప్రోగ్రామ్ మెనూను చూసుకోవడంతోపాటు... విండోస్‌ను కట్టేయడం కూడా ఒక క్లిక్దూరంలోనే ఉంటుంది. ఇంకో విశేషం ఏమిటంటే... సంప్రదాయ స్టార్ట్ మెనూతోపాటు విండోస్ 8 మాదిరిగా కొన్ని ఆప్టైల్స్ కూడా స్టార్ట్బటన్తోపాటు రావడం! అంతేకాదు.. మన అవసరాలకు తగ్గట్టుగా స్టార్ట్ స్క్రీన్ పొడవు, వెడల్పులను తగ్గించుకోవడం, పెంచుకోవడం కూడా చేసుకోవచ్చు. సరికొత్త టాస్క్ వ్యూ... ఆపిల్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఎక్స్’ను ఉపయోగించే వారికి మిషన్ కంట్రోల్ ఫీచర్ గురించి తెలిసే ఉంటుంది. విండోస్ -10లో అచ్చు ఇలాంటి అంశాలతోనే సరికొత్త టాస్క్ వ్యూ ఆప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఒకటి కంటే ఎక్కువ డెస్క్‌టాప్‌లను వేర్వేరు అప్లికేషన్లతో సృష్టించేందుకు, కొన్ని ఇతర పనులు చేపట్టేందుకు ఉపయోగపడుతుంది ఈ టాస్క్ వ్యూ. ఒక్కో డెస్క్‌టాప్‌లో వేర్వేరు అప్లికేషన్లను రన్ చేసుకునే అవకాశముండటం వల్ల పనులన్నింటినీ చకచకా చక్కబెట్టేయవచ్చునన్నమాట. పాయింటర్‌ను డెస్క్టాప్పై కదుపుతూ ఏ డెస్క్‌టాప్‌లో ఏ అప్లికేషన్ ఉంది? పని ఎంతవరకూ పూర్తయిందో తెలుసుకోవచ్చు. హైబ్రిడ్ కంటిన్యూయెమ్ మోడ్... ల్యాప్‌టాప్‌తోపాటు, టాబ్లెట్‌గానూ పనిచేసే హైబ్రిడ్ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ రెండు రకాల వినియోగాన్ని గుర్తించి తదనుగుణంగా మార్పులు చేసుకునేందుకు ‘కంటిన్యూయెమ్ మోడ్’ ఫీచర్‌ను విండోస్ 10 ఓఎస్‌లో ఏర్పాటు చేసింది. టాబ్లెట్లా ఉపయోగించేటప్పుడు టచ్‌స్క్రీన్ ఫీచర్లను ఆన్ చేసేందుకు, లైవ్టైల్స్ ఆప్షన్లను ఉపయోగించుకునేందుకు పనికొస్తుంది ఈ ఫీచర్. కీబోర్డు అటాచ్‌మెంట్‌ను తగిలించిన వెంటనే టాబ్లెట్ నుంచి ల్యాప్‌టాప్ శైలిలోకి మారిపోతుందన్నమాట. విండోస్ -8లో అప్లికేషన్లను స్క్రీన్కు ఒక పక్కన ఏర్పాటు చేసేందుకు ఉన్న స్నాప్ ఫీచర్‌ను కొత్త ఓఎస్‌లోనూ కొన్ని మార్పులతో ఏర్పాటు చేశారు. కొత్త స్పాప్ ఫీచర్లో అప్లికేషన్లతోపాటు సాధారణ ప్రోగ్రామ్‌లను కూడా చక్కగా అమర్చుకునేందుకు వీలుంటుంది. తద్వారా మల్టీటాస్కింగ్ మరింత సులువు అవుతుందని అంచనా. అప్లికేషన్లను ఓపెన్ చేయడం సులువు విండోస్ - 8తో మైక్రోసాప్ట్ తనదైన అప్లికేషన్లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వీటిని వాడటం కొంచెం కష్టమయ్యేది. స్టార్ట్స్క్రీన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే అప్లికేషన్లను వాడేందుకు అవకాశముండేది. విండోస్-10 ఓఎస్‌లో ఈ ఇబ్బంది లేదు. అప్లికేషన్లన్నింటినీ సాధారణ విండోస్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని అటుఇటు కదిల్చేందుకు, సైజును తగ్గించేందుకు, పెంచుకునేందుకు కూడా అవకాశముండటం విశేషం. -
విండోస్ ‘దేశీ’ మొబైల్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విండోస్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకు దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీలు సైతం రంగంలోకి దిగాయి. అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లను అందించి భారత మొబైల్ ఫోన్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీలు.. ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) ఆధారిత స్మార్ట్ఫోన్లపై దృష్టిపెట్టాయి. దిగ్గజ కంపెనీ నోకియాను సైతం ఆన్‌డ్రాయిడ్ మార్కెట్లోకి దింపిన భారతీయ బ్రాండ్లు కొత్త సంచలనాలకు రెడీ అవుతున్నాయి. కస్టమర్ల ముంగిటకు కొత్త కొత్త విండోస్ ఫోన్లు అదీ రూ.10 వేల లోపే తేబోతున్నాయి. తక్కువ ధరకే విండోస్ ఫోన్లు.. ఓపెన్ సోర్స్ వేదిక కావడంతో చాలా కంపెనీలు ఆండ్రాయిడ్ ఓఎస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అందుకే మొత్తం స్మార్ట్ఫోన్లలో వీటి వాటా 78.9% ఉంది. విండోస్ ఓఎస్ లెసైన్సు రుసుమును మైక్రోసాఫ్ట్ గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయని కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ సాక్షికి చెప్పారు. అదే జరిగితే మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి అడుగు పెట్టడం ఖాయం. అంతేకాదు రూ.10 వేల లోపే విండోస్ ఫోన్లు లభించవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప్రస్తుతం విండోస్ వాటా 3.9 శాతమే. 2018కల్లా ఇది 7 శాతానికి చేరుతుందని పరిశోధనా సంస్థ ఐడీసీ అంచనా వేస్తోంది. ఆన్‌డ్రాయిడ్ మార్కెట్ ప్రస్తుతమున్న 78.9 నుంచి 76 శాతానికి చేరుతుందని వెల్లడించింది. ఆపిల్ ఐఓఎస్ 14.9 నుంచి 14.4 శాతానికి తగ్గుతుందని వివరించింది. జోలో బ్రాండ్ ఇటీవలే విండోస్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించి ఈ విభాగంలోకి ప్రవేశించిన తొలి భారతీయ బ్రాండ్‌గా నిలిచింది. కొద్ది రోజుల్లో విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తేబోతోంది. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్‌లు కూడా కొద్ది రోజుల్లో విండోస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నాయి. కొద్ది రోజుల క్రితం మైక్రోసాఫ్ట్‌తో చైనా కంపెనీ జియోనీ చేతులు కలిపింది. ఆన్‌డ్రాయిడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రెండూ కలిగిన స్మార్ట్ఫోన్లను కార్బన్ మొబైల్స్ జూన్‌కల్లా ప్రవేశపెడుతోంది. రూ.6 వేలకే సెల్కాన్ విండోస్ ఫోన్లు.. తొలుత 4, 5 అంగుళాల్లో విండోస్ ఫోన్లను సెల్కాన్ తేనుంది. వీటిని రూ.6-7 వేలకే పరిచయం చేయాలని భావిస్తున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. మే నాటికి ఇవి మార్కెట్లో ఉంటాయని చెప్పారు. ఈ నెలలోనే మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు వివరించారు. ఆన్‌డ్రాయిడ్, విండోస్ డ్యూయల్ ఓఎస్ ఫోన్లు పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మంచి ఫీచర్లతో మోడళ్లకు రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. -
రెండు ఓఎస్‌లపై పనిచేసే మైక్రోమ్యాక్స్ ‘ల్యాప్‌ట్యాబ్’
లాస్‌వేగాస్: మైక్రోమ్యాక్స్.. ల్యాప్‌ట్యాబ్ పేరుతో రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పని చేసే కొత్త ట్యాబ్లెట్‌ను తీసుకొస్తోంది. విండోస్ 8, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్‌లపై పనిచేసే ఈ ల్యాబ్‌ట్యాబ్ ధర రూ.30,000 లోపు ఉంటుందని మైక్రోమ్యాక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు. ఇక్కడ జరుగుతున్న కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించిన ఈ ట్యాబ్లెట్‌ను వచ్చే నెల నుంచి భారత్‌లో విక్రయిస్తామన్నారు. ఈ ట్యాబ్‌లో 1.46 గిగాహెర్ట్జ్ ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్, 10.1 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 64 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయి. -
నోకియా ‘లూమియా 1020’ రూ. 49,999
చెన్నై: నోకియా కంపెనీ 41 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ లూమియా 1020ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఫొటోగ్రఫీ అభిరుచి ఉన్నవాళ్లు, ఫొటోగ్రాఫర్లు లక్ష్యంగా ఈ లూమియా 1020ను అందుబాటులోకి తెస్తున్నామని నోకియా ఇండియా డెరైక్టర్(సౌత్) టి.ఎస్. శ్రీధర్ చెప్పారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్ ధరను రూ.49,999గా నిర్ణయించామని పేర్కొన్నారు. నోకియా స్టోర్ నుంచి 800 కోట్ల పాటలను యాక్సెస్ చేసుకోవచ్చని, నోకియా పోర్టల్ నుంచి 1.65 లక్షల యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 11.43 సెం.మీ. డిస్ప్లే ఉన్న ఈ ఫోన్లో డ్యూయల్ కోర్ 1.5 గిగా హెర్ట్జ్క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ మాస్ మెమెరీ, 7 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచే విక్రయాలు ప్రారంభించామని, ఆరు నెలల నెలసరి వాయిదాల్లో (ఈఎంఐ)ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ ఏడాది జూన్ నాటికి 2.7 కోట్ల లూమియా రేంజ్ ఫోన్లను విక్రయించామని చెప్పారు.