కొత్త హంగులతో
పొరబాట్లు చేయడం... చేసిన తప్పులను దిద్దుకుని ముందుకెళ్లడం మనకే కాదు.. టెక్నాలజీకి కూడా వర్తిస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే తీసుకోండి.. దాదాపు 20 ఏళ్లుగా ఉపయోగిస్తున్న విధానానికి పూర్తి భిన్నంగా విడుదలైన విండోస్-8 అటు సామాన్యులను.. ఇటు కంపెనీలనూ నిరాశపరిచింది. టచ్ స్క్రీన్‌ను దృస్టిలో పెట్టుకుని దీన్ని అభివృద్ధి చేయడం ఇందుకు ఒక కారణం. ఈ తప్పును దిద్దుకునేందుకా అన్నట్లు విండోస్ తాజాగా తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రకటించింది. విండోస్ 8 చేదు అనుభవాన్ని దూరం చేసేందుకన్నట్లు తాజా వెర్షన్‌ను విండోస్ -9 అని కాకుండా విండోస్ -10 గా పేరుపెట్టడం ఒక విశేషం. మిగిలిన కొత్త విశేషాలేమిటో చూద్దామా...
మళ్లీ స్టార్ట్ బటన్...
విండోస్ స్క్రీన్‌పై కొట్టొచ్చినట్టు కనిపించే అంశం ఎడమవైపు అడుగుభాగంలో ఉండే ‘స్టార్ట్’ బటన్. విండోస్ -8లో దీన్ని తీసేశారు. బదులుగా లైవ్‌టైల్స్‌తో కూడిన స్టార్ట్‌స్క్రీన్ కనిపించింది. తాజాగా విండోస్ -10లో మళ్లీ పాతపద్ధతిలోనే స్టార్ట్ బటన్‌ను ప్రవేశపెట్టాలని విండోస్ నిర్ణయించింది. ప్రోగ్రామ్ మెనూను చూసుకోవడంతోపాటు... విండోస్‌ను కట్టేయడం కూడా ఒక క్లిక్‌దూరంలోనే ఉంటుంది. ఇంకో విశేషం ఏమిటంటే... సంప్రదాయ స్టార్ట్ మెనూతోపాటు విండోస్ 8 మాదిరిగా కొన్ని ఆప్‌టైల్స్ కూడా స్టార్ట్‌బటన్‌తోపాటు రావడం! అంతేకాదు.. మన అవసరాలకు తగ్గట్టుగా స్టార్ట్ స్క్రీన్ పొడవు, వెడల్పులను తగ్గించుకోవడం, పెంచుకోవడం కూడా చేసుకోవచ్చు.
సరికొత్త టాస్క్ వ్యూ...
ఆపిల్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఎక్స్’ను ఉపయోగించే వారికి మిషన్ కంట్రోల్ ఫీచర్ గురించి తెలిసే ఉంటుంది. విండోస్ -10లో అచ్చు ఇలాంటి అంశాలతోనే సరికొత్త టాస్క్ వ్యూ ఆప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఒకటి కంటే ఎక్కువ డెస్క్‌టాప్‌లను వేర్వేరు అప్లికేషన్లతో సృష్టించేందుకు, కొన్ని ఇతర పనులు చేపట్టేందుకు ఉపయోగపడుతుంది ఈ టాస్క్ వ్యూ. ఒక్కో డెస్క్‌టాప్‌లో వేర్వేరు అప్లికేషన్లను రన్ చేసుకునే అవకాశముండటం వల్ల పనులన్నింటినీ చకచకా చక్కబెట్టేయవచ్చునన్నమాట. పాయింటర్‌ను డెస్క్‌టాప్‌పై కదుపుతూ ఏ డెస్క్‌టాప్‌లో ఏ అప్లికేషన్ ఉంది? పని ఎంతవరకూ పూర్తయిందో తెలుసుకోవచ్చు.
హైబ్రిడ్ కంటిన్యూయెమ్ మోడ్...
ల్యాప్‌టాప్‌తోపాటు, టాబ్లెట్‌గానూ పనిచేసే హైబ్రిడ్ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ రెండు రకాల వినియోగాన్ని గుర్తించి తదనుగుణంగా మార్పులు చేసుకునేందుకు ‘కంటిన్యూయెమ్ మోడ్’ ఫీచర్‌ను విండోస్ 10 ఓఎస్‌లో ఏర్పాటు చేసింది. టాబ్లెట్‌లా ఉపయోగించేటప్పుడు టచ్‌స్క్రీన్ ఫీచర్లను ఆన్ చేసేందుకు, లైవ్‌టైల్స్ ఆప్షన్లను ఉపయోగించుకునేందుకు పనికొస్తుంది ఈ ఫీచర్. కీబోర్డు అటాచ్‌మెంట్‌ను తగిలించిన వెంటనే టాబ్లెట్ నుంచి ల్యాప్‌టాప్ శైలిలోకి మారిపోతుందన్నమాట. విండోస్ -8లో అప్లికేషన్లను స్క్రీన్‌కు ఒక పక్కన ఏర్పాటు చేసేందుకు ఉన్న స్నాప్ ఫీచర్‌ను కొత్త ఓఎస్‌లోనూ కొన్ని మార్పులతో ఏర్పాటు చేశారు. కొత్త స్పాప్ ఫీచర్‌లో అప్లికేషన్లతోపాటు సాధారణ ప్రోగ్రామ్‌లను కూడా చక్కగా అమర్చుకునేందుకు వీలుంటుంది. తద్వారా మల్టీటాస్కింగ్ మరింత సులువు అవుతుందని అంచనా.
అప్లికేషన్లను ఓపెన్ చేయడం సులువు
విండోస్ - 8తో మైక్రోసాప్ట్ తనదైన అప్లికేషన్లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వీటిని వాడటం కొంచెం కష్టమయ్యేది. స్టార్ట్‌స్క్రీన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే అప్లికేషన్లను వాడేందుకు అవకాశముండేది. విండోస్-10 ఓఎస్‌లో ఈ ఇబ్బంది లేదు. అప్లికేషన్లన్నింటినీ సాధారణ విండోస్‌లోనే ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని అటుఇటు కదిల్చేందుకు, సైజును తగ్గించేందుకు, పెంచుకునేందుకు కూడా అవకాశముండటం విశేషం.