‘వింగ్‌స్టర్’.. తింటే మీరే స్టార్!
5 నిమిషాల్లో తింటే..
ప్రతి రోజూ వింగ్‌స్టర్ చాలెంజ్, ఫాస్టెస్ట్ ఈటర్ అనే రెండు రకాల పోటీలు పెడుతున్నాం. ఇవేంటంటే.. 5 నిమిషాల్లో లెవల్ 8లో 8 చికెన్ వింగ్స్‌ను తినాలి. అది కూడా 5 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా. కర్చీప్‌తో తుడుచుకోకుండా! అలా చేస్తే మీరు తిన్న డిష్‌కు బిల్లు చెల్లించనక్కర్లేదు. పైగా రెస్టారెంట్‌లో ఉన్న వింగ్‌స్టర్ వాల్ ఆఫ్ ఫ్రేంలోకి మీ ఫొటో చేరుతుంది. ఒకవేళ మీరు అందరి కంటే త్వరగా తినేయగలిగితే.. రూ.1,000 నగదు కూడా అందుకోవచ్చు. ఇప్పటివరకు ఈ వింగ్‌స్టర్ చాలెంజ్‌లో 400 మంది పాల్గొంటే.. గెలిచింది కేవలం 40 మంది.
5 నిమిషాల్లో.. 8 చికెన్ వింగ్స్‌ను తింటేనే సుమీ
* యూఎస్ చికెన్ వింగ్స్‌ను హైదరాబాదీలకు పరిచయం చేస్తున్న వింగ్‌స్టర్
* నెలాఖరులో జేఎన్‌టీయూలో.. జూన్‌లో విజయవాడలో ఔట్‌లెట్లు
* నాలుగు నెలల్లో 700-800 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ అంటేనే బిర్యానీ అడ్డా. కొత్తవారెవరైనా సరే నగరానికొస్తే బిర్యానీ రుచి చూడందే తిరిగెళ్లరు. అలాంటి భోజన ప్రియులను మరో కొత్త రకం వంటకం పిలుస్తోంది. ఇంకా చెప్పాలంటే... ప్రారంభమైన కొద్ది కాలంలోనే ఈ వంటకం లక్ష మంది కస్టమర్ల చేత ఆహో.. ఓహో అనిపించుకుంది. ఆ వంటకమే ‘చికెన్ వింగ్స్’! అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ వంటకాన్ని హైదరాబాదీలకూ పరిచయం చేశారు రాకేష్ నాదెండ్ల. అసలా వంటకమేంటి? దాని కథేంటి? రాకేష్ మాటల్లోనే...
ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లా. చదువు, ఆపై ఉద్యోగ రీత్యా 8 ఏళ్ల పాటు అక్కడే ఉన్నా. అప్పుడు రోజూ అక్కడ బాగా ప్రాచుర్యం పొందిన చికెన్ వింగ్స్‌ను తినేవాణ్ణి. ఇండియాకు తిరిగొచ్చాక అవి ఇక్కడ దొరికేవి కాదు. ఇంట్లో వాళ్లను చేయమంటే ఎలా చేయలో వాళ్లకి తెలియదు. దాంతో వింగ్స్ వ్యాపారాన్ని ఆరంభించి, అందరికీ రుచి చూపించాలని నిర్ణయించుకున్నా. మొదట్లో ఫ్రాంచైజీ మోడల్‌ను తీసుకుందామని అమెరికాకు చెందిన రెస్టారెంట్ వాళ్లతో మాట్లాడితే... రూ.5 కోట్లు ఖర్చవుతుందన్నారు. పైగా సాస్‌లు, స్పైస్‌లను అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి.
దీంతో సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నా. సింగపూర్, దుబాయ్ నుంచి షెఫ్‌లను తెచ్చుకున్నా. వాళ్లతో ఏడాది పాటు సాస్‌లు తయారు చేయించా. తయారైన వంటకాన్ని రోజూ నాతో పాటు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తినిపించా. అయితే నేను ఫ్యామిలీ మెంబర్‌ను కావటంతో వాళ్లు బాగుందనే చెప్పేవాళ్లు. అప్పుడే అని పించింది... ఈ చికెన్ వింగ్స్‌ను జనాల్లోకి తీసుకెళితే గానీ అసలైన రుచి బయటపడదని!!. అలా తొలిసారిగా రూ.25 లక్షల పెట్టుబడితో 2014 లో మాదాపూర్‌లో వింగ్‌స్టర్ రెస్టారెంట్‌ను ప్రారంభించాం.
ప్రత్యేక వంటలు చాలా ఉన్నాయ్...
వింగ్‌స్టర్, చికెన్ స్టఫ్డ్ ఆమ్లెట్, వింగ్‌స్టర్ రైస్ బౌల్‌తో పాటు ఉలవచారు సాస్, గోంగూర సాస్ వంటివి మేం ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం. వీటితో పాటూ చైనీస్, అమెరికన్, ఇటాలియన్ మెనూ కూడా ఉంటాయి. ది వింగ్‌స్టర్ మెర్సీ, బార్బిక్యూ వార్స్, జెస్టీ రిట్రీట్, మైల్డ్ వేన్‌జియన్స్, ది గార్లిక్ ఎస్కేప్, ఫెర్రీ వింగ్స్, ది ఫ్లేమింగ్ ఫ్రెంజీ, వింగ్స్ ఆఫ్ ఫైర్ పేర్లతో 1-8 లెవల్స్ ఉంటాయి. లెవల్ పెరుగుతున్న కొద్దీ అందులో స్పైసీ కూడా పెరుగుతుంటుంది. వీటి ధరలు రూ.59-199 మధ్యే ఉంటాయి.
త్వరలో మరో రెండు ఔట్‌లెట్లు..
ప్రస్తుతం రోజుకు 50-70 మంది కస్టమర్లు రెస్టారెంట్‌కు వస్తుంటారు. నెలకు రూ.25-30 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఏడాదికి కోటికి పైగా టర్నోవర్‌ను నమోదు చేస్తున్నాం. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్స్ తీసుకుంటున్నాం. రోజుకు 50 వరకు ఆర్డర్లొస్తున్నాయి. ఈ నెలాఖరులో జేఎన్‌టీయూ రోడ్‌లో, జూన్ కల్లా విజయవాడలోని గురునానక్ కాలనీ రోడ్‌లో ఔట్‌లెట్లు ప్రారంభిస్తున్నాం. ఒక్కో ఔట్‌లెట్‌పై రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఫ్రాంచైజీ మోడల్‌లోనూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు రూ.కోటికి పైగా సొంతగా పెట్టుబడులు పెట్టాం. మరో మూడు నెలల్లో 700-800 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించనున్నాం. జులై నాటికి మిలియన్ డాలర్ల టర్నోవర్‌ను చేరుకోవాలనేది మా లక్ష్యం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...