భారీగా తగ్గిన అజిమ్ ప్రేమ్ జీ జీతం
భారీగా తగ్గిన అజిమ్ ప్రేమ్ జీ జీతం
Published Mon, Jun 5 2017 8:51 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM
న్యూఢిల్లీ : దేశీయ సాఫ్ట్ వేర్ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన విప్రో సంస్థ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ సుపరిచితమే. టాప్ టెక్ బిలీనియర్లలో ఒకరైన అజిమ్ ప్రేమ్ జీ జీతం 2016-17లో భారీగా తగ్గిపోయింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన వేతనం 63 శాతం తగ్గి, రూ.79 లక్షలు మాత్రమే అందుకున్నట్టు తెలిసింది. ఈ ఏడాదిలో కనీసం ఎలాంటి కమిషన్లను కూడా పొందలేదు. ముందటి ఆర్థిక సంవత్సరంలో అజిమ్ ప్రేమ్ జీ వేతనం రూ.2.17 కోట్లగా ఉంది. ప్రేమ్ జీ ప్యాకేజీలో 66,464 డాలర్ల వేతనం, అలవెన్స్ లు, దీర్ఘకాలిక పరిహారాలు 13,647 డాలర్లు కలిసి ఉన్నాయి. దీంతో మొత్తం ఆయన అందుకున్న జీతం 1,21,853 డాలర్లేనని అమెరికా మార్కెట్ రెగ్యులేటరి సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కు సమర్పించిన డాక్యుమెంట్లలో తెలిసింది.
ముందటి ఆర్థిక సంవత్సరం కంటే 2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి పెరిగిన నికర లాభాలను బట్టి 0.5 శాతం కమిషన్ ను అజిమ్ ప్రేమ్ జీకి ఇస్తారు. అయితే 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అజిమ్ ప్రేమ్ జీ ఎలాంటి కమిషన్లను పొందలేదని సెక్యురిటీస్ కు సమర్పించిన డాక్యుమెంట్లలో తెలిసింది. కాగ ఇటీవల ఐటీ పరిశ్రమలో కంపెనీల వృద్ధి మందగించడంతో కీలక ఎగ్జిక్యూటివ్ ల పరిహారాలు తగ్గిపోతున్నాయి. వృద్ధి ప్రభావం వీరి పరిహారాలపై పడుతోంది. ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ కూడా 67 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో వార్షిక ఆదాయాలు 4.7 శాతం తగ్గాయి. నాలుగో క్వార్టర్ రెవెన్యూలు కూడా స్వల్పంగా పడిపోయాయి.
Advertisement
Advertisement