wipro chairman
-
ఆఫీసుల నుంచే విధులు: విప్రో
ముంబై: మరింతమంది ఉద్యోగులు ఇళ్ల నుంచి కాకుండా కార్యాలయాల నుంచి పనిచేయవలసి ఉంటుందని సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తాజాగా పేర్కొన్నారు. కార్యాలయాలకు రావడం ద్వారా సిబ్బంది మధ్య దగ్గరతనం ఏర్పడుతుందని, సంబంధాలు మెరుగుపడతాయని తెలియజేశారు. మానవులకు ఇవి కీలకమని, ఇందుకు ఎలాంటి టెక్నాలజీ దోహదం చేయదని స్పష్టం చేశారు. 2023 ఎన్టీఎల్ఎఫ్ సదస్సులో ప్రసంగిస్తూ రిషద్ ఎంతటి ఆధునిక టెక్నాలజీ అయినా మానవ సంబంధాలను నిర్మించలేదని వ్యాఖ్యానించారు. తిరిగి ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్న సిద్ధాంతాన్ని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అటు ఆఫీసులు, ఇటు ఇళ్లవద్ద నుంచి పనిచేసే హైబ్రిడ్ వర్కింగే భవిష్యత్ విధానమని ఆయన తెలిపారు. టెక్నాలజీ రంగంలోనే ఇలాంటి విధానాలు వీలవుతాయని రిషద్ చెప్పారు. అయితే, ఉద్యోగులు ఇంటి నుంచే కాకుండా.. కార్యాలయాలకు సైతం వచ్చి పనిచేయడానికి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా సిబ్బంది ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసినప్పటికీ గత రెండేళ్లలో ఉద్యోగవలస భారీగా పెరిగిపోయిందని రిషద్ పేర్కొన్నారు. దీంతో 60 శాతం మంది ఉద్యోగులు కొత్తగా చేరినవారేనని వెల్లడించారు. వెరసి వీరంతా ఆర్గనైజేషన్ సంస్కృతిని తెలుసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
విప్రో లాభం 9% డౌన్
న్యూఢిల్లీ: సిబ్బంది ఖర్చులు పెరగడం, అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయాలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ విప్రో నికర లాభం 9.3% క్షీణించింది. రూ. 2,659 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 2,930 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం సుమారు 15% పెరిగి రూ. 19,667 కోట్ల నుంచి రూ. 22,540 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా లాభం సుమారు 4%, ఆదాయం 5% వృద్ధి చెందాయి. ‘ఆర్డర్లు, భారీ డీల్స్, ఆదాయాల్లో పటిష్టమైన వృద్ధి సాధించడం.. మార్కెట్లో మా పోటీతత్వం మెరుగుపడటాన్ని సూచిస్తోంది‘ అని కంపెనీ సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. వివాదాస్పదమైన మూన్‌లైటింగ్‌పై (రెండు సంస్థల్లో ఉద్యోగాలు చేయడం) స్పందిస్తూ ఇది న్యాయపరమైన అంశం కంటే నైతిక విలువలకు సంబంధించిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఉద్యోగులు చిన్నా చితకా ఇతరత్రా పనులు చేసుకోవడం ఫర్వాలేదని కానీ ఏకంగా పోటీ కంపెనీకి పని చేయడం మాత్రం నైతికత కాదని ఆయన స్పష్టం చేశారు. మూన్‌లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగించామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో డెలాపోర్ట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇతర విశేషాలు.. ► ఆర్డరు బుకింగ్‌లు 23.8 శాతం, భారీ డీల్స్ 42 శాతం పెరిగాయి. క్యూ2లో 725 మిలియన్ డాలర్ల విలువ చేసే 11 భారీ డీల్స్ కుదిరాయి. ► సమీక్షాకాలంలో విప్రో 10,000 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. అట్రిషన్ రేటు వరుసగా మూడో త్రైమాసికంలోనూ తగ్గింది. క్యూ1లో 23.3 శాతంగా ఉన్న ఈ రేటు స్వల్పంగా 23 శాతానికి దిగి వచ్చింది. ► సెప్టెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా కేవలం 605 పెరిగి 2,59,179కి చేరింది. తాజాగా 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంది. బుధవారం బీఎస్ఈలో విప్రో షేరు సుమారు 1% లాభంతో రూ. 407.75 వద్ద క్లోజయ్యింది. -
విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్!!
న్యూఢిల్లీ: చిన్న స్థాయి వంట నూనెల సంస్థను దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఐటీ దిగ్గజం, విప్రో వ్యవస్థాపకుడు అజీం హెచ్ ప్రేమ్‌జీ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ చేతికి పగ్గాలు అందించనున్నారు. వచ్చే నెల 74వ పడిలో అడుగుపెట్టనున్న అజీం ప్రేమ్‌జీ.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి జూలై 30న రిటైరవుతున్నారు. ఆ తర్వాత నుంచి అజీం కుమారుడు, సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్, బోర్డు సభ్యుడు అయిన రిషద్ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. రిటైరయ్యాక అజీం ప్రేమ్‌జీ అయిదేళ్ల పాటు 2024 దాకా విప్రో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. ఆయన వ్యవస్థాపక చైర్మన్‌గా ఉంటారని విప్రో పేర్కొంది. ‘దేశ టెక్నాలజీ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరు, విప్రో వ్యవస్థాపకులు అయిన అజీం ప్రేమ్‌జీ దాదాపు 53 ఏళ్లు కంపెనీకి సారథ్యం వహించిన తర్వాత జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన కంపెనీ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారు’ అని స్టాక్ ఎక్సే్చంజీలకు విప్రో తెలియజేసింది. మరోవైపు చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆబిదాలి జెడ్ నీముచ్‌వాలాను మరో విడత అయిదేళ్ల పాటు సీఈవో, ఎండీ హోదాల్లో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విప్రో ఎంటర్ప్రైజెస్, విప్రో–జీఈ హెల్త్‌కేర్ చైర్మన్‌గా అజీం ప్రేమ్‌జీ కొనసాగుతారు. షేర్‌హోల్డర్ల అనుమతుల మేరకు జూలై 31 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని విప్రో వివరించింది. ‘ఇటు విప్రో, అటు టెక్నాలజీ పరిశ్రమ పెను మార్పులకు లోనవుతున్న తరుణంలో అన్ని వర్గాలకూ ప్రయోజనాలు చేకూర్చేలా కృషి చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’ అని రిషద్ పేర్కొన్నారు. ఇకపై పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాలు.. వంట నూనెల సంస్థగా మొదలైన విప్రోను 8.5 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ టెక్ దిగ్గజంగా అజీం తీర్చిదిద్దారు. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ను అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ సంస్థగా నిలబెట్టారు. ఇన్ఫ్రా ఇంజినీరింగ్, మెడికల్ డివైజ్‌ల తయారీ తదితర రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించారు. వీటి ఆదాయం దాదాపు 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీత అయిన అజీం ప్రేమ్‌జీ రిటైర్మెంట్ తర్వాత దాతృత్వ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లో మరింతగా పాలుపంచుకోవాలని భావిస్తున్నారు. ‘ఈ సుదీర్ఘ ప్రస్థానం ఎంతో సంతృప్తికరం. భవిష్యత్‌లో మా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యకలాపాలకు మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాను. కంపెనీని అధిక వృద్ధి బాట పట్టించగలిగే సామర్థ్యాలు రిషద్‌కు ఉన్నాయని గట్టిగా విశ్వసిస్తున్నాను‘ అని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. తన పేరిటే ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ప్రేమ్‌జీ సేవా కార్యకలాపాల్లో ఉన్నారు. ఈ ట్రస్టు కు రూ. 52,750 కోట్ల విలువ చేసే విప్రో షేర్లను ఈ ఏడాది మార్చిలో ఆయన విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యా రంగంలో సేవలు అందించడంతో పాటు బడుగు వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న దాదాపు 150 పైగా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. -
భారీగా తగ్గిన అజిమ్ ప్రేమ్ జీ జీతం
న్యూఢిల్లీ : దేశీయ సాఫ్ట్ వేర్ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన విప్రో సంస్థ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ సుపరిచితమే. టాప్ టెక్ బిలీనియర్లలో ఒకరైన అజిమ్ ప్రేమ్ జీ జీతం 2016-17లో భారీగా తగ్గిపోయింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన వేతనం 63 శాతం తగ్గి, రూ.79 లక్షలు మాత్రమే అందుకున్నట్టు తెలిసింది. ఈ ఏడాదిలో కనీసం ఎలాంటి కమిషన్లను కూడా పొందలేదు. ముందటి ఆర్థిక సంవత్సరంలో అజిమ్ ప్రేమ్ జీ వేతనం రూ.2.17 కోట్లగా ఉంది. ప్రేమ్ జీ ప్యాకేజీలో 66,464 డాలర్ల వేతనం, అలవెన్స్ లు, దీర్ఘకాలిక పరిహారాలు 13,647 డాలర్లు కలిసి ఉన్నాయి. దీంతో మొత్తం ఆయన అందుకున్న జీతం 1,21,853 డాలర్లేనని అమెరికా మార్కెట్ రెగ్యులేటరి సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కు సమర్పించిన డాక్యుమెంట్లలో తెలిసింది. ముందటి ఆర్థిక సంవత్సరం కంటే 2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి పెరిగిన నికర లాభాలను బట్టి 0.5 శాతం కమిషన్ ను అజిమ్ ప్రేమ్ జీకి ఇస్తారు. అయితే 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అజిమ్ ప్రేమ్ జీ ఎలాంటి కమిషన్లను పొందలేదని సెక్యురిటీస్ కు సమర్పించిన డాక్యుమెంట్లలో తెలిసింది. కాగ ఇటీవల ఐటీ పరిశ్రమలో కంపెనీల వృద్ధి మందగించడంతో కీలక ఎగ్జిక్యూటివ్ ల పరిహారాలు తగ్గిపోతున్నాయి. వృద్ధి ప్రభావం వీరి పరిహారాలపై పడుతోంది. ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ కూడా 67 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో వార్షిక ఆదాయాలు 4.7 శాతం తగ్గాయి. నాలుగో క్వార్టర్ రెవెన్యూలు కూడా స్వల్పంగా పడిపోయాయి. -
ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ నుంచి లెన్స్‌కార్ట్‌కు నిధులు
న్యూఢిల్లీ: రూ.400 కోట్లు సేకరించిన మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే లెన్స్‌కార్ట్ మరోసారి నిధులు సేకరించింది. ఈ సారి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ నుంచి నిధులను రాబట్టింది. అయితే ఎంత మొత్తం అన్నది బయటకు వెల్లడించలేదు. లెన్స్‌కార్ట్ ఆన్లైన్ విభాగంలో కళ్లద్దాల స్టోర్స్‌ను నిర్వహించే ప్రముఖ సంస్థ. ఆఫ్‌లైన్ విభాగంలోనూ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. తాజా నిధుల సేకరణ ఆన్లైన్ ఐవేర్ మార్కెట్లో వృద్ధికి సహకరిస్తుందని లెన్స్కార్ట సీఈవో, వ్యవస్థాపకుడు పీయూష్ బన్సాల్ ఢిల్లీలో తెలిపారు. రిటైల్ విభాగంలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు ఎంతో అనుభవం ఉందని, ఫ్యాబ్ ఇం డియా తదితర కంపెన్లీలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అనుభవం తమకు ఉపకరిస్తుందన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విభాగంలో మరింత వృద్ధిపై దృష్టి పెడతామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.400కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రూ.500కోట్లకు చేరుకుంటామన్నారు. -
ప్రధాని మోదీతో ప్రేమ్‌జీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ గురువారం సమావేశమయ్యారు. ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుమించి సమావేశం వివరాలను వెల్లడించలేదు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ పలువురు వ్యాపార దిగ్గజాలతో గత కొన్ని రోజులుగా సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ్‌జీతో ఈ భేటీ జరిగింది. కాగా భారత విమానయాన రంగం పురోభివృద్ధికి సమాచార సంకేతిక రంగం తోడ్పాటు అవసరమని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. విమానయానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుతో భేటీ సందర్భంగా అయన మాట్లాడారు.