ముంబై: మరింతమంది ఉద్యోగులు ఇళ్ల నుంచి కాకుండా కార్యాలయాల నుంచి పనిచేయవలసి ఉంటుందని సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తాజాగా పేర్కొన్నారు. కార్యాలయాలకు రావడం ద్వారా సిబ్బంది మధ్య దగ్గరతనం ఏర్పడుతుందని, సంబంధాలు మెరుగుపడతాయని తెలియజేశారు. మానవులకు ఇవి కీలకమని, ఇందుకు ఎలాంటి టెక్నాలజీ దోహదం చేయదని స్పష్టం చేశారు. 2023 ఎన్‌టీఎల్‌ఎఫ్ సదస్సులో ప్రసంగిస్తూ రిషద్ ఎంతటి ఆధునిక టెక్నాలజీ అయినా మానవ సంబంధాలను నిర్మించలేదని వ్యాఖ్యానించారు.
తిరిగి ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్న సిద్ధాంతాన్ని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అటు ఆఫీసులు, ఇటు ఇళ్లవద్ద నుంచి పనిచేసే హైబ్రిడ్ వర్కింగే భవిష్యత్ విధానమని ఆయన తెలిపారు. టెక్నాలజీ రంగంలోనే ఇలాంటి విధానాలు వీలవుతాయని రిషద్ చెప్పారు. అయితే, ఉద్యోగులు ఇంటి నుంచే కాకుండా.. కార్యాలయాలకు సైతం వచ్చి పనిచేయడానికి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా సిబ్బంది ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసినప్పటికీ గత రెండేళ్లలో ఉద్యోగవలస భారీగా పెరిగిపోయిందని రిషద్ పేర్కొన్నారు. దీంతో 60 శాతం మంది ఉద్యోగులు కొత్తగా చేరినవారేనని వెల్లడించారు. వెరసి వీరంతా ఆర్గనైజేషన్ సంస్కృతిని తెలుసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment