విప్రో లాభం 1.8 శాతం అప్
బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. 2015, డిసెంబర్ 31తో ముగిసిన క్యూ3లో రూ.2,234 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,192 కోట్లతో పోలిస్తే 1.8 శాతం వృద్ధి చెందింది. అదేవిధంగా ఆదాయం కూడా 7.1 శాతం పెరిగి రూ.12,085 కోట్ల నుంచి రూ.12,951 కోట్లకు చేరింది.
కీలకమైన ఐటీ సేవల విషయానికొస్తే.. క్యూ3లో డాలర్ల రూపంలో కంపెనీ 1.86 బిలియన్ డాలర్ల(రూ.12,310) ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువని విప్రో తెలిపింది. ఉద్యోగుల సెలవులు, చెన్నై వరదల ప్రభావం తమపై ఉంటుందని ఇంతకుముందే విప్రో ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ గెడైన్స్ అంచనా, 1,875-1,912 మిలియన్ డాలర్లు అని వెల్లడించింది. క్యూ3లో విప్రో 39 క్లయింట్లను జతచేసుకుంది.
ఇంటిగ్రేటెడ్ డొమైన్, టెక్నాలజీ సేవల ద్వారా కోర్ బిజినెస్ లో వృద్ధి నమోదు చేస్తామని సీఈవో అబిదాలి జెడ్. నీముచువాలా తెలిపారు. ఐటీ ప్రొడక్ట్స్ సెగ్ మెంట్ లో ఆదాయం 6.5 బిలియన్లకు (98 మిలియన్ డాలర్లు) చేరిందని వెల్లడించారు.