సర్కారు స్కీములన్నీ.. ఒకే క్లిక్ తో!
♦ వినూత్న సేవలందిస్తున్నఇండియన్ ఐరిస్ సోషల్ స్టార్టప్
♦ ఒకే వేదికగా కేంద్ర రాష్ట్రాల పథకాలు, పాలసీలు
♦ పథకాల ఎంపిక, దరఖాస్తు విధానం, విశ్లేషణ కూడా..
♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో సంస్థ కో-ఫౌండర్ సాహిత్య సింధు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మీకు తెలుసా? కేరళ ప్రభుత్వం ‘ఎంటర్‌ప్రెన్యూర్స్ సపోర్ట్’ స్కీం కింద రబ్బర్, రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ రంగాల్లో ఏర్పడే చిన్న, మధ్య తరహా కంపెనీలకు రూ.30 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది.
♦ అస్సాంలో ఎవరైనా పర్యాటక రంగంలో రూ.కోటి అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెడితే... వారు చెల్లించే పన్నుల్లో 25% ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుంది.
♦ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు నర్సరీ నుంచి పీహెచ్‌డీ వరకు ఉచితంగా విద్యనందిస్తోంది. అలాగే ఎంపిక చేసిన 50 మంది విద్యార్థులకు విదేశాల్లో పై చదువులకయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తోంది.
♦ నిజానికివన్నీ తెలియటం కష్టం. రాష్ట్ర ప్రభుత్వాల పాలసీ వివరాల్ని స్థానిక మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేసే పాలసీలో? ఆయా రాష్ట్రాల వెబ్‌సైట్లో కూడా సమగ్రంగా ఉండటం కష్టం. పెపైచ్చు సందేహాలొస్తే తీర్చే నిపుణులు కూడా ఉండరు. మరెలా..? దీనికి పరిష్కారంగానే ఆరంభమైంది ‘ఇండియన్ ఐరిస్’!! కేంద్రం, దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, పాలసీ గురించి ఉంటుందిక్కడ. ప్రభుత్వ పథకాల గురించి గ్రామీణులను ఎడ్యుకేట్ చేయటమే తమ ప్రధాన లక్ష్యమంటున్నారు ఇండియన్ ఐరిస్ కో-ఫౌండర్, విశాఖపట్నానికి చెందిన సాహిత్య సింధు. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే...
బెంగళూరులో ‘సిస్కో’లో పనిచేస్తున్నపుడు నేను ట్రిపుల్ ఐటీ అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లా. అక్కడ అచ్చం నాలాంటి ఆలోచనే ఉన్న నారాయణ్ సింగ్ రావుతో పరిచయం ఏర్పడింది. ‘‘దేశంలో కేంద్రం, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, పాలసీ గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు అస్సలు అవగాహన ఉండట్లేదు. అవి నగరాలు, పట్టణాల వరకే పరిమితమవుతున్నాయి. గ్రామీణులకు సరైన విద్య, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడమే ఇందుకు కారణం. ప్రభు త్వ పథకాలు, బ్యాంకు రుణాల కోసం ఎక్కడికెళ్లాలో కూడా వారికి తెలియదు. ఎవరిని సంప్రదించాలో అర్థం కాదు.
అందుకే చాలా వరకు ప్రభుత్వ పథకాలు ఆశించినంత సక్సెస్ కాలేకపోతున్నా యి. ఇంకా చెప్పాలంటే దుర్వినియోగం అవుతున్నాయి కూడా! 2015 జూన్‌లో ఇండియన్ ఐరిస్(ఠీఠీఠీ.్టజ్ఛిజీఛీజ్చీజీటజీట.ఛిౌఝ) సంస్థ ప్రారంభానికి కారణమైంది ఇదే. మా పనేంటంటే.. కేంద్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, పథకాల వివరాలను సేకరించి ఇండియన్ ఐరిస్ వెబ్‌సైట్‌లో పెట్టడమే. సంబంధిత పథకాలను ఎలా వినియోగించుకోవాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? డాక్యుమెంట్ల సేకరణ వంటి విషయాల్లోనూ సేవలందిస్తాం. అన్నీ ఉచితమే.
50కి పైగా విభాగాల్లో..: ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ), స్టార్టప్స్, సంక్షేమ పథకాలు వంటి 50కి పైగా విభాగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, పాలసీలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో సేవలందిస్తున్నాం. త్వరలోనే అన్ని భారతీయ భాషల్లోనూ అనువాదం చేస్తాం.
అవగాహన కోసం యాత్రలు..: మా సేవలను వినియోగించుకోవాలంటే మా వెబ్‌సైట్‌లో చూడాలి. అయితే అందరికీ ఇంటర్నెట్ ఉండదు కనక ప్రజల్లోకి నేరుగా వెళ్లి అవగాహన కల్పించాలని నిర్ణయించాం. ఇటీవలే బైకర్స్ క్లబ్‌తో కలసి రాజస్తాన్‌లో పర్యటించాం. ఇప్పుడు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో పర్యటించాలని నిర్ణయించుకున్నాం.
నెలకు 40 వేల మంది..: ప్రస్తుతం మా వెబ్‌సైట్‌ను నెలకు 75-80 వేల మంది చూస్తున్నారు. 40 వేల మంది వినియోగించుకుంటున్నారు. ఇందులో దక్షిణాది వాటానే ఎక్కువ. ఇటీవలే జాయిన్ ఆర్ మొబైల్ యాప్‌ను విడుదల చేశాం. ప్రస్తుతం మా సంస్థలో 10 మంది ఉద్యోగులు, 100 మంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అనూజ్, భరత్.. వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.
ఈ ఏడాదిలో కన్సల్టెన్సీ సేవలు..
‘‘డెయిరీ ఫాం, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాం. కానీ ప్రభుత్వ సాయం, బ్యాంకు రుణాల గురించి తెలియట్లేదు. మీరు సహాయం చేయండని’’ మా సేవలు వినియోగించుకుంటున్న వారిలో చాలా మంది కోరారు. అందుకే సమాచారం ఇవ్వడంతో పాటూ పేపర్ వర్క్ నుంచి కంపెనీ ప్రారంభించే దాకా అన్ని విషయాలను దగ్గరుండి చూసుకునే కన్సల్టెన్సీ సేవల్ని ఆరంభించాలని నిర్ణయించాం. ఈ ఏడాది చివరికి అందుబాటులోకి తెస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...