టాటా 'నానో' కథ ముగిసినట్టేనా?
టాటా 'నానో' కథ ముగిసినట్టేనా?
Published Sat, Apr 15 2017 8:42 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM
రతన్ టాటా తన మానసపుత్రికగా చెప్పుకుంటున్న కారు 'నానో'. కానీ ఆ కారు మాత్రం రతన్ టాటా కలలను అందుకోలేకపోతుంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా ఆటో ఇండస్ట్రీలోకి వచ్చి సంచలనాలు సృష్టించిన నానో, మూత పడే దిశకు వస్తోంది. మార్చి నెలలో ఈ కారు అమ్మకాలు కేవలం 174 యూనిట్లే అమ్ముడుపోయాయి. అంతేకాక, ఈ వెహికిల్ ప్లాట్ ఫామ్స్ ను కూడా కంపెనీ తగ్గించేస్తుందట. కానీ రతన్ టాటా మానసపుత్రిక తర్వాతి పరిస్థితేమిటంటే కంపెనీ అధికారులు మాత్రం నోరు విప్పడం లేదు. టాటా మోటార్స్ కు సప్లయిర్స్ గా ఉన్న ఎగ్జిక్యూటివ్ లు మాత్రం నానో తమ చర్చల్లో భాగం కాదని తేల్చేస్తున్నారు. దీంతో నానో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుందని తెలుస్తోంది.
''టాటా మోటార్స్ సైతం నానో ప్రాజెక్ట్ పై ఇప్పడి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సహజంగానే ఈ కారు ప్రస్తావన ముగిసిపోయేలా చేయాలని వారు ఆలోచిస్తున్నారు'' అని నానో కారు పార్ట్స్ తయారుచేసే కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. టియాగో వంటి కొత్త ప్లాట్ ఫామ్స్ పైనే మేనేజ్ మెంట్ ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. కీలక మార్కెట్లలో కస్టమర్ డిమాండ్ బట్టి నానో కారును ఉత్పత్తి చేస్తామని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నానో కార్ల ఉత్పత్తి 64 శాతానికి పడిపోయి, కేవలం 7589 యూనిట్ల ప్రొడ్యూస్ చేశారు. గతేడాది టాటా గ్రూప్ లో నెలకొన్న వివాదంలో ఈ కారు ప్రస్తావనను మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రతన్ టాటా తన మానసపుత్రికగా చెప్పుకుంటున్న నానో కారు కంపెనీకి గుదిబండగా తయారైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నానో వల్లే కంపెనీలోని ఇతర సంస్థలపై ప్రభావం పడిందని, లాభార్జించలేకపోతున్నామని విమర్శించారు.
Advertisement