
పురుషులతో సమానంగా మహిళలూ తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటున్నారు. సొంతంగా వ్యాపారాలను సృష్టిస్తున్న వారు... ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్న వారు... వ్యాపార సామ్రాజ్యాలను ఒంటిచేత్తో నడిపిస్తున్న వారు... ఎందరో ఉన్నారు. అయితే, ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలకు వచ్చే సరికి వారిలో ఎక్కడో తటపటాయింపు..! పెట్టుబడి నిర్ణయాల్లో పురుషులతో సమానంగా రాణించే సామర్థ్యాలు ఉన్నా కానీ, వనితలు చొరవగా ముందుకు రావడం లేదని డీఎస్‌పీ విన్వెస్టర్ పల్స్ సర్వే ఫలితాలు చూస్తే అర్థమవుతోంది. మన దేశంలో మగవారితో పోలిస్తే ఇన్వెస్ట్‌మెంట్ విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్న స్త్రీలు సగం మందేనట. ఇలా ముందుకు వచ్చే వారి వెనుక వారి భర్తల ప్రోత్సాహమే ప్రధాన కారణంగా ఉంటోంది. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే స్త్రీల వెనుక ప్రోత్సాహం అందించేవారిలో తల్లిదండ్రుల కంటే జీవిత భాగస్వాముల సంఖ్యే అధికంగా ఉంది. కొందరు తమంతట తామే ఉత్సాహంగా ముందుకు వస్తుంటే, కొందరు మాత్రం తప్పనిసరై ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు డీఎస్‌పీ విన్వెస్టర్ పల్స్ 2019 సర్వే పేర్కొంది.
చిన్న వయస్సు నుంచి ఇన్వెస్టింగ్ పాఠాలు...
‘సీనియర్ స్థాయి నిపుణులు, ఫండ్ మేనేజర్లలోనూ మహిళలు ఉన్నప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లుగా మహిళలు పెద్దగా ముందుకురాకపోవడం ఆశ్చర్యకరమైన అంశమని’’ డీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ ప్రెసిడెంట్ కల్పే¯Œ పారిక్ తెలిపారు. ‘‘మహిళల్లో ఎక్కువ మంది తల్లిదండ్రుల కంటే భర్తల నుంచే ఎక్కువ ప్రోత్సాహం పొందుతుండటం గమనించాల్సిన విషయం. తమ కుమార్తెలకు చిన్న వయసు నుంచే ఇన్వెస్టింగ్ గురించి నేర్పాలని తండ్రులకు నా మనవి. ఇన్వెస్టింగ్ విషయంలో మహిళలు ముందే విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని మా సర్వే ఎత్తిచూపుతోంది’’ అని డీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ సేల్స్, మార్కెటింగ్ హెడ్ అదితి కొఠారి తెలిపారు.
సర్వే ఇలా...
పరిశోధనా సంస్థ నీల్సన్ తో కలసి డీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ ఈ సర్వే నిర్వహించింది. డబ్బు విషయాల్లో వారి లక్ష్యాలు, వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇన్వెస్ట్‌మెంట్, వారసత్వం విషయాల్లో మహిళలు, పురుషుల ప్రవర్తనను ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా 8 పట్టణాల్లో 4,013 మంది మహిళలు, పురుషుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. మెట్రో నగరాలు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరుతోపాటు ఇండోర్, కొచ్చి, లూధియానా, గువాహటి పట్టణాలను ఈ సర్వే కవర్ చేసింది. మొత్తం 4,013 మందిలో 1,853 మంది మగవారు కాగా, 2,160 మంది స్త్రీలు. 25–60 ఏళ్ల వయసు గ్రూపులోని వారే వీరంతా. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారు లేదా గతంలో కనీసం 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన వారు, అవివాహితులు, వివాహితులు, పిల్లల్లేని వారు లేదా పెళ్లయి పిల్లలు ఉన్న వారు కూడా ఇందులో ఉన్నారు. మహిళలు తమ పెట్టుబడి నిర్ణయాల బాధ్యతలను తీసుకునే దిశగా వారిని ప్రోత్సహించడం, వారిలో నమ్మకాన్ని ప్రోది చేయడం ద్వారా తమ ఆర్థిక విషయాల నిర్వహణకు మరొకరిపై ఆధారపడే పరిస్థితి లేకుండా చూడటమే ఈ సర్వే ఉద్దేశమని డీఎస్‌పీ విన్వెస్టర్ పల్స్ సర్వే పేర్కొంది.
లక్ష్యాలు
తమ వారసుల విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, రుణాల్లేని జీవితం, అత్యున్నత ప్రమాణాలతో కూడిన జీవితం ఈ లక్ష్యాలు పురుషులు, స్త్రీలకు ఒకే తీరులో ఉన్నాయి. తమ పిల్లలకు సంబంధించిన లక్ష్యాల్లో పురుషులతో పోలిస్తే స్త్రీలకే కొంత ఆసక్తి ఎక్కువగా ఉంది. మహిళల టాప్–3 లక్ష్యాల్లో మొదటి రెండు పిల్లల విద్య, వివాహాలే. పిల్లల విద్య పట్ల 34 శాతం మంది, వారి వివాహాల పట్ల 29 శాతం మంది మహిళలు ప్రాధాన్యం చూపిస్తుంటే, పురుషుల శాతం ఈ లక్ష్యాల విషయంలో 31, 26 శాతంగానే ఉంది. సొంతంగా వెంచర్ ఏర్పాటు చేయాలని 26 శాతం మంది, రిటైర్మెంట్‌కు ప్రణాళిక వేసుకోవాలని 23 శాతం మగవారు భావిస్తుంటే, ఈ విషయాల్లో స్త్రీలు 23 శాతం, 20 శాతంగానే ఉన్నారు. మరింత ఆసక్తి కలిగించే అంశం... ఒంటరి పురుషులతో పోలిస్తే ఒంటరి మహిళలు ఎక్కువ మంది తమకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆలోచిస్తున్నారు. పిల్లల విద్య కోసం 22 శాతం, వివాహాల కోసం 23 శాతం ఒంటరి మహిళలు ఆలోచిస్తుంటే, ఈ విషయంలో మగవారు 16 శాతం, 12 శాతంగానే ఉన్నారు. తమ లక్ష్యాలను సాధించుకోవడం, మెరుగైన జీవితం, విజయం, మెరుగైన ఆరోగ్యం విషయాల్లో స్త్రీ, పురుషులు సరిసమానంగా ఉన్నారు.
ఆర్థిక విషయాల్లో మహిళల పాత్ర
మార్కెట్ ఆధారిత స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ తదితర పెట్టుబడుల విషయాల్లో పూర్తిగా తమదే నిర్ణయమని 12 శాతం మంది మహిళలు చెప్పారు. ఈ విషయంలో మగవారి శాతం 31. అంటే పురుషులతో పోలిస్తే మూడింట ఒకవంతుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బంగారం, ఆభరణాల కొనుగోళ్ల విషయాల్లో తమ నిర్ణయమే ఫైనల్ అని చెప్పిన మహిళలు 28 శాతం మంది. ఈ విషయంలో మగవారు 17 శాతంగా ఉన్నారు. 39 శాతం మంది మహిళలు ముందు పెట్టుబడుల ప్రణాళిక వేసుకుని, దీనికి తగ్గట్టు నెలవారీ ఖర్చులను సర్దుబాటు చేసుకుంటామని చెప్పారు. అంటే వారి మొదటి ప్రాధాన్యత ప్రణాళికే. ఆర్థిక సలహాదారులను సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే మహిళలు 42 శాతం కాగా, పురుషులు 46 శాతం మంది ఉన్నారు.
పిల్లల పట్ల బాధ్యత
తమ పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటామని 55 శాతానికి పైగా చెప్పారు. అయితే, కుమార్తెల పట్ల బాధ్యతగా ఉంటామన్న వారు 51% అయితే, కుమారుల పట్ల బాధ్యత వ్యక్తం చేసిన వారు 58% మేర ఉన్నారు. తమ కుమారులు, కుమార్తెలకు పెట్టుబడుల విషయంలో భిన్నంగా సూచిస్తామని దాదాపు 48% మంది తెలిపారు. పిల్లలు చిన్న వయసు నుంచే... కాలేజీ నుంచి లేదా ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడాన్ని మొదలు పెట్టాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. పిల్లలు 20 ఏళ్లు రాకముందే పెట్టుబడుల గురించి నేర్చుకోవాలని 65% మంది భావిస్తున్నారు. తమ సంపదను పిల్లలకు పంచుతామని అత్యధికంగా 76% మంది చెప్పారు. తమ వారసత్వ సంపదను కుమారులు, కుమార్తెలకు సమానంగా పంచుతామని 65% మంది చెప్పారు. మిగిలిన వారు కుమార్తెల కంటే కుమారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామన్నారు. వీరిలో కుమారులకు 45%, కుమార్తెలకు 24% కేటాయిస్తామన్నది వారి మాట. తల్లుల్లో 22% మంది కుమారుల పట్ల ఎక్కువ మొగ్గు చూపారు. దీనికి వ్యతిరేక దిశలో తండ్రులు తమ కుమారుల (12%) కంటే కుమార్తెలకు (18%) మొగ్గు చూపారు.
సర్వే హైలైట్స్
- 64 శాతం మంది మగవారు పెట్టుబడులపై నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నారు.
- మహిళలు మాత్రం 33 శాతం మందే స్వీయ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు.
- వీరిలోనూ ముఖ్యంగా తమ భర్తల ప్రోత్సాహం కారణంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పిన వారు 33 శాతం. ఈ విషయంలో తల్లిదండ్రుల శాతం 24గానే ఉంది.
-తమ భర్తలు తమను ఇన్వెస్టింగ్‌లోకి ప్రవేశించేలా చేశారని చెప్పిన వారు 40 శాతం.
- తల్లిదండ్రులు తమను ఈ దిశగా అడుగులు వేయించారని చెప్పిన వారు 27 శాతం.
- నిర్ణయాలు తీసుకునే మగువల్లోనూ తాము తీసుకోగలమనే నమ్మకంతోనే ఆ పనిచేస్తున్నట్టు 30 శాతం మంది చెప్పారు.
- పిల్లల భవిష్యత్తు లక్ష్యాల విషయంలో తండ్రులతో పోలిస్తే తల్లుల పాత్ర ఎక్కువగా ఉండటం గమనార్హం. తల్లులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సర్వేలో అభిప్రాయాలు తెలియజేసిన వారిలో ఎక్కువ మంది మహిళలు చెప్పిన మాట... తమ పిల్లలు 20 ఏళ్లు వచ్చే నాటికి ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకోవాలని.
- పెట్టుబడుల దిశగా తమను తమ తల్లిదండ్రులు అడుగులు వేయించారని 40 శాతం మగవారు చెప్పారు. తల్లిదండ్రుల తర్వాత సహచర పనివారు తమను ఈ దిశగా నడిపించినట్టు చెప్పిన వారు 35 శాతం మంది.
- 25 ఏళ్లు రాకముందే తాము పెట్టుబడులు ఆరంభించామని చెప్పిన వారు 65 శాతంగా ఉన్నారు. 25 ఏళ్లలోపే ఇన్వెస్ట్‌మెంట్ ఆరంభించడం సరైనదని 76 శాతం మంది చెప్పారు.
ఇక స్వీయ పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే 33 శాతం మంది మగువల వెనుక వారి జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధానంగా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. తమ భర్తలు మరణించడం లేదా విడాకుల వల్ల తాము సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని 13 శాతం మంది మహిళలు చెప్పడం గమనార్హం. 30 శాతం మంది తాము సొంతంగా పెట్టుబడికి సంబంధించి నిర్ణయాలు తీసుకోగలమని చెప్పారు. ఇక?తమ పిల్లల విద్య, సొంతిల్లు, పిల్లల వివాహాలు, అప్పుల్లేని జీవితం, ఉన్నత ప్రమాణాలతో జీవించడం అనే ముఖ్యమైన లక్ష్యాల విషయంలో స్త్రీ, పురుషులు సరిసమానంగానే ఉన్నట్టు డీఎస్‌పీ సర్వే తెలిపింది. ఇన్వెస్ట్‌మెంట్ లేదా కారు లేదా ఇల్లు కొనుగోళ్ల నిర్ణయాల్లో పురుషుల ఆధిపత్యం ఉంటుంటే, బంగారం/ఆభరణాలు, రోజువారీ ఇంటి ఖర్చులు విషయంలో మహిళల పాత్ర కీలకంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment