హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన నిర్మాణ రంగ కంపెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్ కు వరల్డ్ బ్యాంక్ షాకిచ్చింది. మోసపూరిత విధానాలు అవలంభించిన కారణంగా కంపెనీపై రెండేళ్లపాటు నిషేధం విధించింది. దీంతో వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయం చేసే ఏ కాంట్రాక్టునూ మధుకాన్ చేపట్టే వీలు ఉండదు.
లక్నో–ముజఫర్‌పూర్ నేషనల్ హైవే ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు పాల్పడినట్టు రుజువు కావడంతో వరల్డ్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు సివిల్ ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్ పనులు మధుకాన్ దక్కించుకుంది. వరల్డ్ బ్యాంకుకు చెందిన ఇంటెగ్రిటీ వైస్ ప్రెసిడెన్సీ ఈ కేసు విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలు సృష్టించి తాత్కాలిక పేమెంట్ సర్టిఫికేట్స్‌లో ఖర్చులను పెంచి చూపించినట్టు ఈ విచారణలో రుజువయింది.
అయితే వరల్డ్ బ్యాంకు నిర్ణయం ఏమాత్రం ప్రభావం చూపదని, వచ్చే మూడేళ్ల కాలానికి సరిపడా సామర్థ్యానికి మించి ఆర్డరు బుక్ ఉందని కంపెనీ వెల్లడించింది. అసలు వరల్డ్ బ్యాంకు ప్రాజెక్టులపై తమ సంస్థ ఆధారపడి లేదని మధుకాన్ చెప్పడం గమనార్హం. 513 కిలోమీటర్ల లక్నో–ముజఫర్‌పూర్ నేషనల్ హైవే ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు సుమారు రూ.3,040 కోట్లు ఆర్థిక సాయం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment