
వాషింగ్టన్ : 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికే పరిమితమవుతుందని ఆపై ఏడాది 5.8 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రుణాల జారీ మందగించడం, ప్రైవేట్ వినిమయం పడిపోవడం, ప్రాంతీయ సమస్యలతో వృద్ధి రేటు తగ్గుతుందని పేర్కొంది. బంగ్లదేశ్‌లో వృద్ధి రేటు 7 శాతానికి పైగా నమోదవుతుందని, పాకిస్తాన్‌లో మూడు శాతం వృద్ధి చోటుచేసుకుకోవచ్చని అంచనా వేసింది. టారిఫ్‌ల పెంపు ప్రభావం, అనిశ్చితి కొనసాగడం వంటి కారణాలతో అమెరికా వృద్ధి రేటు 1.8 శాతంతో మందగించవచ్చని స్పష్టం చేసింది.
యూరప్‌లోనూ వృద్ధి రేటు 1 శాతానికే పరిమితమవుతుందని పేర్కొంది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేటు మందగిస్తున్న క్రమంలో పేదరిక నిర్మూలనకు అవసరమైన వ్యవస్ధాగత సంస్కరణలకు విధాన నిర్ణేతలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి సీలా పజర్బాసిగ్ అన్నారు. వ్యాపార వాతావరణం, చట్టాల పనితీరు, రుణ నిర్వహణ, ఉత్పాదకతలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment