GDP growth forecast
-
పెరిగిన జీడీపీ వృద్ధి అంచనాలు
రాబోయే కేంద్ర బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ నామమాత్ర జీడీపీ వృద్ధి 10.4%గా ప్రకటిస్తారని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 9.7 శాతం కంటే ఇది అధికం. వాస్తవ జీడీపీలో ఊహించిన ద్రవ్యోల్బణం నమోదు కావడమే ఈ పెరుగుదలకు కారణమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.నామమాత్రపు జీడీపీ వృద్ధిని నడిపించే అంశాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతం నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణంలో ఈ పెరుగుదల నామమాత్ర జీడీపీ వృద్ధికి గణనీయంగా దోహదం చేసే అవకాశం ఉంది. వినియోగాన్ని పునరుద్ధరించేందుకు సబ్సిడీల హేతుబద్ధీకరణ తోడ్పడుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: మహా కుంభమేళా ఎఫెక్ట్.. పెరిగిన ఛార్జీలు2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 4.5% కంటే తక్కువగా ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి ఈ లక్ష్యం కీలకం కానుంది. జీడీపీలో వృద్ధి అంచనా వేసినప్పటికీ, ప్రపంచ ఆర్థిక ప్రతికూలతలు, భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. వాస్తవ జీడీపీ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 6.6% ఉంటుందని అంచనా. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మూలధన వ్యయంపై ప్రభుత్వం దృష్టి సారించడం ఆర్థిక వృద్ధికి సానుకూల చర్యగా భావిస్తున్నారు. -
భారత్ వృద్ధి అంచనా పెంచిన ఏడీబీ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 30 బేసిస్ పాయింట్లు పెంచింది. తొలి అంచనాలు (2023 డిసెంబర్ అంచనాలు) 6.7 శాతంకాగా, దీనిని 7 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెరుగుదల, వినియోగ డిమాండ్ పటిష్టత తాజా అంచనాలకు కారణమని ఏప్రిల్ ఎడిషన్ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ప్రధాన ‘‘గ్రోత్ ఇంజిన్’’గా భారత్ ఉంటుందని అవుట్‌లుక్‌లో విశ్లేíÙంచింది. ఇక 2025–26లో వృద్ధి 7.2 శాతంగా ఉంటుందన్నది ఏడీబీ తాజా అంచనా. అయితే ప్రస్తుత ఆర్థిక సవాళ్ల పట్ల అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. 2024–25 విషయానికి వస్తే, ఆర్బీఐ కూడా దేశాభివృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం. -
ఎకానమీ వృద్ధి అంచనాలకు క్రిసిల్ కోత
సాక్షి, ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం 7.3 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.8 శాతం. అధిక చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఎగుమతుల డిమాండ్ మందగమనం తన తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది. ఈ మేరకు క్రిసిల్ విడుదల చేసిన నివేదికలో కొన్నిముఖ్యాంశాలు.. ♦ అధిక కమోడిటీ, సరకు ధరలు, ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గుముఖం పట్టడంతో ఎగుమతులకు డిమాండ్ తగ్గే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ వినియోగంకు దోహదపడే అంశాలు కూడా బలహీనంగా ఉండటం తీవ్ర ప్రతికూలాంశం. ♦ కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవల్లో పెరుగుదల, సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ప్రస్తుతం ఎకానమీకి ఉన్న బలాలు. ♦ ద్రవ్యోల్బణం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతం ఉంటే, 2022–23లో సగటున 6.8 శాతంగా ఉంటుందని అంచనా. ఇది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. వినియోగం పునరుద్ధరణపై ప్రభావం చూపుతుంది. స్థూల దేశీయోత్పత్తిలో కొనుగోలు, వినియోగ రంగాలపాత్ర కీలకం. ♦ అధిక కమోడిటీ ధరలు, గ్లోబల్ వృద్ధి మందగించడం, సరఫరా చైన్‌లో సవాళ్లు భారత్ కరెంట్ ఖాతాపై (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతుంది. కరెంట్ ఖాతా లోటు 2021-22లో (జీడీపీ) 1.2 శాతం ఉంటే, 2022-23లో 3 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ♦ఆర్థిక బలహీనతల నేపథ్యంలో 2023 మార్చి నాటికి అమెరికా డాలర్లో రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉంది. పెరుగుతున్న వాణిజ్య లోటు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) ప్రవాహాలు భారీగా వెనక్కు మళ్లడం, అమెరికా డాలర్ ఇండెక్స్ బలోపేతం (రిజర్వ్ రేట్ల పెంపుదల కారణంగా) రూపాయి-డాలర్ మారకపు విలువ సమీప కాలంలో తీవ్ర ఒడిదుడుకులకు, దిగువముఖ పయనానికి దారితీసే వీలుంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్‌ను ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఎంచుకోవచ్చు. ♦2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ క్రూడ్ సగటు బ్యారెల్‌కు 105-110 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. 2013 తర్వాత క్రూడ్ ఈ స్థాయిలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. ♦ అధిక కమోడిటీ ధరలు భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పెరుగుతున్న దిగుమతి బిల్లుతో వాణిజ్య లోటు తీవ్రం అయ్యే వీలుంది. దిగుమతుల బిల్లు పెరగడం ద్ర వ్యోల్బణం పెరుగుదలకూ కారణం అవుతుంది. ♦ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను మరో 75 బేసిస్ పాయింట్లకు పెంచే వీలుంది. మే, జూన్ నెలల్లో రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి ఎగసింది. వడ్డీరేట్ల పెరుగుదల వృద్ధి అవకాశాలను దెబ్బతీసే అంశం. రియల్టీ మహమ్మారి స్థాయికన్నా కిందకు పడిపోయే వీలుంది. ద్రవ్యోల్బణం కట్టడికి ద్రవ్య పరపతి విధానాలు మరికొంతకాలం కఠినంగా కొనసాగే అవకాశం ఉంది. 2022-23పై అంచనాల కోతలు (శాతాల్లో) ఇలా... సంస్థ తాజా తొలి ఆర్బీఐ 7.2 7.8 ఎస్అండ్పీ 7.3 7.8 ఫిచ్ 8.5 10.3 ప్రపంచ బ్యాంక్ 7.5 8.0 ఐఎంఎఫ్ 8.2 9 ఏడీబీ 7.5 –– ♦ మూడీస్ గత ఏడాది నవంబర్‌లో 2022–23లో భారత్ వృద్ధి 9.3 శాతం ఉంటుందని అంచనావేసింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంచనా తగ్గించే అవకాశం ఉంది. అయితే 2022 క్యాలెండర్ ఇయర్లో వృద్ధి రేటు అంచనాలను మూడీస్ 9.1 శాతం నుంచి 8.8 శాతానికి కోత పెట్టింది. -
భారత జీడీపీ వృద్ధి: వరల్డ్ బ్యాంకు షాకింగ్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో భారతదేశ జీడీపీ అంచనాలపై ప్రపంచ బ్యాంక్ కీలక అంచనాలను విడుదల చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఊహించిన దానికంటేఎక్కువ కాలం కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా వార్, సరఫరా గొలుసు అంతరాయాలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత రీత్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2022-మార్చి 2023 వరకు) భారత ఆర్థికవృద్ధి అంచనాను 7.5 శాతానికి తగ్గించింది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ తాజా సంచికలో ఈ అంచనాలను మంగళవారం వెల్లడించింది. అంతేకాదు 2023-24లో వృద్ధి మరింత మందగించి 7.1 శాతానికి చేరుకుంటుందని కూడా పేర్కొంది. ఇండియా జీడీపీ వృద్ధి అంచనాను సవరించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో 8.7 శాతం నుండి 8 శాతానికి తగ్గించింది. ఇపుడు 7.5 శాతానికి అంచనా వేసింది. ఇది మునుపటి (2021-22) ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతంగా ఉంచింది. అలాగే వ్యాపార వాతావరణాన్ని మెరుగు పర్చేందుకు ప్రోత్సాహకాలు, సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రైవేట్ రంగ స్థిర పెట్టుబడుల ద్వారా కూడా వృద్ధికి తోడ్పడాలని పేర్కొంది. కాగా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించిన సంగతి తెలిసిందే. గత నెలలో, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అధిక ద్రవ్యోల్బణాన్ని పేర్కొంటూ 2022 క్యాలెండర్ సంవత్సరానికి జీడీపీ ప్రొజెక్షన్‌ను 9.1 శాతం నుండి 8.8 శాతానికి తగ్గించింది. ఇంధనం మొదలు కూరగాయలు, వంట నూనె తదితర అన్ని వస్తువుల ధరల పెరుగుదల ఏప్రిల్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు గరిష్ట స్థాయి 15.08 శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. మరోవైపు గత నెలలో బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 4.40 శాతానికి పెంచిన ఆర్బీఐ రానున్న మానిటరీ పాలసీ రివ్యూలో మరోసారి వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. -
అదే ఫిక్స్ : వృద్ధి 5 శాతమే..
వాషింగ్టన్ : 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికే పరిమితమవుతుందని ఆపై ఏడాది 5.8 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రుణాల జారీ మందగించడం, ప్రైవేట్ వినిమయం పడిపోవడం, ప్రాంతీయ సమస్యలతో వృద్ధి రేటు తగ్గుతుందని పేర్కొంది. బంగ్లదేశ్లో వృద్ధి రేటు 7 శాతానికి పైగా నమోదవుతుందని, పాకిస్తాన్లో మూడు శాతం వృద్ధి చోటుచేసుకుకోవచ్చని అంచనా వేసింది. టారిఫ్‌ల పెంపు ప్రభావం, అనిశ్చితి కొనసాగడం వంటి కారణాలతో అమెరికా వృద్ధి రేటు 1.8 శాతంతో మందగించవచ్చని స్పష్టం చేసింది. యూరప్‌లోనూ వృద్ధి రేటు 1 శాతానికే పరిమితమవుతుందని పేర్కొంది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేటు మందగిస్తున్న క్రమంలో పేదరిక నిర్మూలనకు అవసరమైన వ్యవస్ధాగత సంస్కరణలకు విధాన నిర్ణేతలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి సీలా పజర్బాసిగ్ అన్నారు. వ్యాపార వాతావరణం, చట్టాల పనితీరు, రుణ నిర్వహణ, ఉత్పాదకతలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. చదవండి : రిస్క్ కు వెరవడమే మందగమనానికి కారణం -
దాస్.. ‘డబుల్’ ధమాకా!
ముంబై: మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో 2వ తేదీ నుంచీ ఎంపీసీ ద్రవ్య విధాన కమిటీ ద్వైమాసిక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం కీలక నిర్ణయాలు మూడవరోజు– గురువారం వెలువడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) ఇది తొలి ద్వైమాసిక సమావేశం. రెండు నెలల క్రితం జరిగిన ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. గత ఏడాది ఆర్బీఐ రెండు సార్లు అరశాతం రేటు పెంచింది. తాజా నిర్ణయంతో పెరిగిన మేర రివర్స్ అయినట్లయ్యింది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ మరో వారంలో ఉండగా ఆర్బీఐ తాజా కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, రివర్స్ రెపో రేటును కూడా ఆర్బీఐ పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి సర్దుబాటు అయ్యింది. బ్యాంకులు తమ వద్ద మిగులు నిధులు ఉంటే, వాటిని ఆర్బీఐ వద్ద ఉంచి వడ్డీ పొందుతాయి. ఈ రేటునే రివర్స్ రెపోగా పేర్కొంటారు. ఈ రేటు ఎక్కువగా ఉంటే, తద్వారానే అధిక ప్రయోజనం పొందడానికి బ్యాంకులు మొగ్గుచూపుతాయి. వ్యవస్థలో రుణ లభ్యత, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెరగాలంటున్న ఆర్బీఐ, రివర్స్రెపో రేటును కూడా తగ్గించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరంలో రెండవ ద్వైమాసిక సమావేశం జూన్ 3 నుంచి 6వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలు ఎలా ఉంటాయంటే? బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. దీనిని తగ్గిస్తే, బ్యాంకులకు నిధుల సమీకరణ భారం తగ్గుతుంది. ఇలా తమకు లభించే వడ్డీరేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయిస్తే, గృహ, రుణ, వాహన రుణాలపై కస్టమర్ల నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) తగ్గుతాయి. అయితే తమకు లభించిన రేటు ప్రయోజనాన్ని యథాతథంగా బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించడం లేదన్న విమర్శ అన్ని వర్గాల నుంచీ వ్యక్తమవుతుంది. ఆర్బీఐ తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తగ్గించిన రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందేలా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఫిబ్రవరిలో పావుశాతం రేటు తగ్గిస్తే, కొన్ని బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్స్) కేవలం 5 నుంచి 10 బేసిస్ పాయింట్లే తగ్గించిన విషయాన్ని గుర్తుచేసింది. మరింత రేటు కోత అవసరాన్ని స్పష్టంచేసింది. కాగా రెపో రేటు, బాండ్ ఈల్డ్స్ వంటి బెంచ్‌మార్క్ రేట్లతో వ్యక్తిగత, గృహ, ఆటో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాల అనుసంధానంపై బ్యాంకులతో ఆర్బీఐ మరిన్ని చర్చలు జరుపుతుందని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. దీనితో ఇందుకు సంబంధించి తుది మార్గదర్శకాల జారీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. యథాతథమే బెటరన్న ఇరువురు కాగా రేటు కోత నిర్ణయం ఏకాభిప్రాయ ప్రాతిపదికన జరగలేదు. ఇరువురు సభ్యులు ఇందుకు ‘నో’ అన్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ఎంసీసీ సభ్యుడు ఛేతన్ ఘాటే ఇందులో ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్‌తో పాటు పామీదువా, రవీంద్ర దోలాకియా, మైఖేల్పాత్రలు రేటుకోతకు సానుకూలంగా ఓటు వేశారు. ఇక ద్రవ్య వ్యవస్థకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరిపై ఆరుగురిలో ఐదుగురు ప్రస్తుతం ఉన్న ‘న్యూట్రల్’ (తటస్థం)ను కొనసాగించాలని పేర్కొంటే, రవీంద్ర డోలాకియా మాత్రం ‘అకామిడేటివ్’ (సర్దుబాటుకు అనువైన) విధానాన్ని అనుసరించడానికి ఓటు చేశారు. దీనితో తటస్థం విధానాన్నే ఆర్బీఐ ఎంచుకున్నట్లయ్యింది. ధరా‘భయం’ ఉపశమనం... ద్రవ్యోల్బణం రేటు అంచనాలను మాత్రం ఆర్బీఐ తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 2.9–3 శాతం శ్రేణిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరిలో ఈ అంచనాలను 3.2–3.4 శ్రేణిగా ఆర్బీఐ పేర్కొంది. కాగా ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో 3.5–3.8% వరకూ ఉంటుందని అంచనావేసింది. అంటే ఆర్బీఐ లక్ష్యం 4% దిగువనే ద్రవ్యోల్బణం ఉంటుందన్నమాట. ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2.57 శాతం. కాగా ఆహార, ఇంధన ధరలు తీవ్రంగా పెరిగితే మాత్రం మొత్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. వృద్ధి, ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా... ‘తాజా నిర్ణయానికి ప్రధానంగా రెండు అంశాలు కారణం. ఒకటి వృద్ధిరేటు మందగమనంలో ఉండడం. రెండవది ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం. ధరల స్పీడ్ తక్కువగా ఉన్నందువల్ల వృద్ధి లక్ష్యంగా రేటు కోతకు తగిన సమయమని భావించడం జరిగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో ఎగుమతుల వృద్ధి బలహీనంగా ఉంది. దిగుమతులు విషయానికి వస్తే, చమురు యేతర దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతులూ తగ్గాయి. దేశంలో వృద్ధి మందగమన పరిస్థితులను ఇది సూచిస్తోంది. ఇక ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) అవరోధాలు లేకుండా చూస్తాం’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ఎదురీత... దేశీయ ఆర్థిక వ్యవస్థ ఎదురీదుతోందని విధాన ప్రకటన తెలిపింది. ప్రత్యేకించి అంతర్జాతీయ రంగంలో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరిలో ఈ రేటును 7.4 శాతంగా అంచనా వేసింది. అంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టిందన్నమాట. డిసెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)వృద్ధి రేటు 6.6 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రైవేటు పెట్టుబడుల్లో బలహీనత దీనికి కారణం. బలహీనంగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులకు ఊతం ఇవ్వడం ద్వారా దేశీయ వృద్ధి రేటును పటిష్ట పరచుకోవాల్సి ఉందని ప్రకటన పేర్కొంది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.1 శాతం శ్రేణిలో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేయగా, రెండవ అర్ధభాగంలో 7.3 శాతం నుంచి 7.4 శాతం మధ్య ఉంటుందని భావించింది. సుప్రీం తీర్పు వ్యతిరేకం కాదు... మొండిబకాయిలకు సంబంధించి 2018 ఫిబ్రవరి 12 ఆర్బీఐ సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిందంటే.. దానర్థం, ఆర్బీఐ అధికారాలను తీసుకుందని కాదు. ఇందుకు సంబంధించిన అధికారాలను ఎలా వినియోగించాలన్నది సుప్రీంకోర్టు సూచించింది. అందువల్ల ఎన్పీఏ పునర్వ్యవస్థీకరణ, పరిష్కార ప్రణాళికలకు సంబంధించి త్వరలో ఆర్బీఐ సవరిత మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఎన్పీఏల సత్వర పరిష్కారానికి ఆర్బీఐ కట్టుబడి ఉంది. బ్యాంకింగ్ స్థిరత్వానికి ఇది ఎంతో అవసరం. మొత్త ఫైనాన్షియల్ రంగంలో పరిస్థితులకు అనుసంధానమైన అంశం ఇది. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న ఒక సంస్థ సహా (కొటక్ మహీంద్రా బ్యాంక్) విద్యుత్ కంపెనీలు ఆర్బీఐని కోర్టుకు లాగడం ఆందోళనకరమన్న విశ్లేషణలు సరికాదు. ఏ సంస్థ నిర్ణయాన్నైనా చట్టం ముందు సవాలు చేయడం ఒక రాజ్యాంగ హక్కు. ఐఎల్ ఎఫ్ఎస్ రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించవద్దని ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన రూలింగ్ విషయానికి వస్తే, దీనిని సవరించవలసిందిగా ఆర్బీఐ ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇక గణాంకాల విషయానికి వస్తే, అధికారికంగా అందిన డేటాకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, తమ పాలసీలపై స్పందనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. కార్పొరేట్ రుణాలకు సెకండరీ మార్కెట్ అభివృద్ధిపై కార్యాచరణ బృందం ఏర్పాటు చేయడం జరుగుతుంది. – శక్తికాంత్ దాస్, ఆర్బీఐ గవర్నర్ రేట్ల తగ్గింపును బ్యాంకులు బదలాయిస్తే మంచిదే: పరిశ్రమలు పారిశ్రామిక వర్గాలు రేటు తగ్గింపును స్వాగతించాయి. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చే అంశంగా పేర్కొన్నాయి. వినియోగ వ్యయాలు పెరుగుతాయని విశ్లేషించాయి. అయితే తాజా రేటు కోత ప్రయోజనాలన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయిస్తేనే ఇది సాధ్యమని పేర్కొన్నాయి. ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం రేటు కోతకు దోహదపడిందన్నారు. రేటు మరికొంత తగ్గింపునకూ అవకాశం ఉందని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ తల్వార్ అభిప్రాయపడ్డారు. వృద్ధి పటిష్టతపై ఆర్బీఐ పాలసీ దృష్టి సారించిందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. అయితే రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకింగ్ తగిన చర్యలు తీసుకోవాలని వీరు అభిప్రాయపడటం గమనార్హం. బ్యాంకుల నుంచి స్పందన నిల్... ఆర్బీఐ వరుసగా రెండవదఫా రేటుకోత నిర్ణయం తీసుకున్నా... ఈ ప్రయోజనాన్ని తక్షణం కస్టమర్లకు బదలాయించడంపై బ్యాంకుల నుంచి తగిన స్పందన రాలేదు. పాలసీ బాగుందని పేర్కొన్నా, తమ నుంచి రేటు కోతపై ఏ బ్యాంక్ నుంచీ తక్షణం ఎటువంటి స్పష్టమైన ప్రకటనలు వెలువడలేదు. సంక్లిష్టతలు ఉన్నాయ్ జీడీపీ రేటు అంచనా తగ్గింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న అంచనాలు ఉన్నా, తగిన వర్షపాతం లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. లిక్విడిటీ లభ్యతలకు చర్యలు బాగున్నాయి. ముందుచూపుతో రూపొందించిన ద్రవ్య విధానమిది. మార్కెట్ భాగస్వాముల డిమాండ్‌ను నెరవేర్చుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చీఫ్ బ్యాంకింగ్‌కు సానుకూలం రేటు తగ్గింపు, లిక్విడిటీ అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు బ్యాంకర్లకు సానుకూలం. అలాగే రేటు తగ్గింపు ప్రయోజనం సత్వర బదలాయింపునకూ ఈ నిర్ణయం దోహదపడుతుంది. రేటు కోత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ధరలు అదుపులో ఉంటాయన్న అంచనాలు సానుకూలం. – సునిల్ మెహతా, ఐబీఏ చైర్మన్ భయపడాల్సింది ఏదీలేదు ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను తగ్గించినంత మాత్రాన భయపడాల్సింది ఏమీలేదు. వృద్ధికి సంబంధించి రానున్న కాలంలో ఆశాజనకమైన పలు అంశాలు ఉన్నాయి. బడా కార్పొరేట్ కంపెనీలకు రుణ వృద్ధి అంతకంతకూ పెరుగుతుండడం ఇందులో ఒకటి. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు ఆర్బీఐ రిజర్వ్స్‌పై త్వరలో జలాన్ నివేదిక రిజర్వ్ బ్యాంక్ వద్ద నిల్వలు ఏ స్థాయిలో ఉండాలన్న అంశంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ త్వరలో తన నివేదికను సమర్పిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కమిటీ ప్రస్తుతం ముమ్మర చర్చల్లో ఉందన్నారు. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. భారీ ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ఆర్బీఐ నిధుల్లో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. -
జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.2 శాతం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) అంచనా వేసింది. అంతకుముందు ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. వ్యవసాయం, ఉత్పాదక రంగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరచడంతో వృద్ధి రేటు మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి తొలి ముందస్తు అంచనాలు వెల్లడిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్టు సీఎస్ఓ వెల్లడించింది. వ్యవసాయం, అటవీ సంబంధిత, మత్స్య కార్యకలాపాలు గత ఏడాది 3.4 శాతం ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతానికి పెరగనున్నాయని పేర్కొంది. ఇక 2017-18లో 5.7 శాతంగా నమోదైన తయారీ రంగం 8.3 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కాగా 2015-16లో దేశ జీడీపీ 8.2 శాతం వృద్ధి సాధిస్తే,2016-17లో 7.1 శాతం వృద్ధి సాధించింది. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావంతో 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతానికి తగ్గింది. -
వృద్ధి అంచనాలకు కోత: ఎన్సీఏఈఆర్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) వృద్ధి రేటు అంచనాలను అప్లైడ్ ఎకనమిక్ రిసెర్చ్ నేషనల్ కౌన్సిల్(ఎన్సీఏఈఆర్) తగ్గిం చింది. వృద్ధి రేటును ఇంతక్రితం 5.7 శాతం అంచనావేయగా, తాజాగా 5 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం తగ్గడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం సానుకూల అంశాలైనప్పటికీ- దేశంలో తక్కువ వర్షపాతం, పంట దిగుబడులు తగ్గే అవకాశం, ఇతర అంతర్జాతీయ అనిశ్చితి అంశాలు వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థ అభిప్రాయపడింది. విదేశాల్లో ఆర్థిక రికవరీ ధోరణి పటిష్టంగా లేదని, దేశీయంగా బ్యాంకుల్లో రుణ రేట్లు పెరగడం లేదని పేర్కొంది. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 శాతం వృద్ధిని, 2015-16లో 5.6 శాతం వృద్ధిని సాధించవచ్చని మూడీస్ ఇటీవలి నివేదిక పేర్కొంది. 2014-15లో భారత్ జీడీపీ వృద్ధి రేటును ప్రపంచబ్యాంక్ సైతం 5.6 శాతంగా అంచనావేసింది.