సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో భారతదేశ జీడీపీ అంచనాలపై ప్రపంచ బ్యాంక్ కీలక అంచనాలను విడుదల చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఊహించిన దానికంటేఎక్కువ కాలం కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా వార్, సరఫరా గొలుసు అంతరాయాలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత రీత్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2022-మార్చి 2023 వరకు) భారత ఆర్థికవృద్ధి అంచనాను 7.5 శాతానికి తగ్గించింది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ తాజా సంచికలో ఈ అంచనాలను మంగళవారం వెల్లడించింది. అంతేకాదు 2023-24లో వృద్ధి మరింత మందగించి 7.1 శాతానికి చేరుకుంటుందని కూడా పేర్కొంది.
ఇండియా జీడీపీ వృద్ధి అంచనాను సవరించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో 8.7 శాతం నుండి 8 శాతానికి తగ్గించింది. ఇపుడు 7.5 శాతానికి అంచనా వేసింది. ఇది మునుపటి (2021-22) ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతంగా ఉంచింది. అలాగే వ్యాపార వాతావరణాన్ని మెరుగు పర్చేందుకు ప్రోత్సాహకాలు, సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రైవేట్ రంగ స్థిర పెట్టుబడుల ద్వారా కూడా వృద్ధికి తోడ్పడాలని పేర్కొంది.
కాగా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించిన సంగతి తెలిసిందే. గత నెలలో, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అధిక ద్రవ్యోల్బణాన్ని పేర్కొంటూ 2022 క్యాలెండర్ సంవత్సరానికి జీడీపీ ప్రొజెక్షన్‌ను 9.1 శాతం నుండి 8.8 శాతానికి తగ్గించింది. ఇంధనం మొదలు కూరగాయలు, వంట నూనె తదితర అన్ని వస్తువుల ధరల పెరుగుదల ఏప్రిల్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు గరిష్ట స్థాయి 15.08 శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది.
మరోవైపు గత నెలలో బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 4.40 శాతానికి పెంచిన ఆర్‌బీఐ రానున్న మానిటరీ పాలసీ రివ్యూలో మరోసారి వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment