షియోమి ఫోన్లు విక్రయించుకోవచ్చు
ఒక్కో ఫోన్‌కు రూ.100 రాయల్టీగా డిపాజిట్ చేయాలి
ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన షియోమి కంపెనీ ఫోన్‌లు దిగుమతి చేసుకొని, విక్రయించుకోవడానికి ఢిల్లీ హైకోర్ట్ మంగళవారం అనుమతిచ్చింది. క్వాల్‌కామ్ ప్రాసెసర్‌పై నడిచే చిప్‌సెట్‌లతో తయారైన ఫోన్లకు మాత్రమే వచ్చే నెల 8 వరకూ ఈ అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. భారత్‌లో వచ్చే నెల 5 వరకూ విక్రయించే ప్రతి ఫోన్‌కు రూ.100 చొప్పున రాయల్టీగా డిపాజిట్ చేయాలని జస్టిస్‌ప్రదీప్ నంద్రజోగ్, జస్టిస్ ఆర్.కె గౌబలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అనుమతచ్చింది. జనవరి 8న తదుపరి విచారణ జరగనున్నది.
షియోమి సంస్థ పేటెంట్ల ఉల్లంఘనకు పాల్పడిందంటూ స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్ సంస్థ కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిని విచారించిన ఏక సభ్య ధర్మాసనం భారత్‌లో షియోమి ఫోన్ల విక్రయాలపై నిషేధం విధిస్తూ ఈనెల 8న ఆదేశాలు జారీ చేసింది. తాము ఎలాంటి పేటెంట్ల ఉల్లంఘనకు పాల్పడలేదంటూ షియోమి కంపెనీ మంగళవారం ఈ తీర్పును సవాలు చేస్తూ పిటిషన్‌ను దాఖలు చేసింది. క్వాల్‌కామ్ సంస్థ తన పేటెంట్ టెక్నాలజీకి ఎరిక్సన్ నుంచి లెసైన్స్ పొందిందని షియోమి పేర్కొంది.