షావోమి నుంచి 6.44 అంగుళాల స్మార్ట్ ఫోన్
♦ రెండు వేరియంట్లలో ‘మి మ్యాక్స్’..
♦ ప్రారంభ ధర రూ.14,999
♦ ‘మియి 8’ ఓఎస్‌ను ఆవిష్కరించిన కంపెనీ
♦ దీనిద్వారా ఒకే స్మార్ట్‌ఫోన్‌లో 2 వాట్స్‌యాప్ అకౌంట్లు
న్యూఢిల్లీ: చైనా దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘మి మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. కంపెనీ నుంచి వస్తోన్న అతి పెద్ద స్క్రీన్ (6.44 అంగుళాలు) ఉన్న మొబైల్ ఇదే. దీనితోపాటు అప్‌డేటెడ్ ‘మియి 8’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను, ‘మి మాగ్జిమస్’ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఆవిష్కరించింది.
మి మ్యాక్స్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 650, 652 అనే రెండు ప్రాసెసర్ ఆప్షన్లలో లభిస్తుంది. 650 ప్రాసెసర్‌తో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలను కలిగిన వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. ఇక 652 ప్రాసెసర్‌తో 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ కలిగిన వేరియంట్ ధర రూ.19,999. ఈ ఫోన్‌లో అద్భుతమైన గేమింగ్, మల్టీమీడియా అనుభూతిని కలిగించే అడ్రెనో 510 గ్రాఫిక్స్ చిప్, 4,850 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయని కంపెనీ తెలిపింది. రెండు వేరియంట్లలో లభ్యమయ్యే ‘మి మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్స్ జూలై 6 నుంచి ‘మి.కామ్’ వెబ్‌సైట్‌లో, ఇతర భాగస్వామ్య వెబ్‌పోర్టల్స్‌లో జూలై 13 నుంచి అందుబాటులోకి వస్తాయి. కంపెనీ వీటి బుకింగ్స్‌ను తన వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రారంభించింది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్లు బంగారం, సిల్వర్, బూడిద రంగుల్లో లభ్యమవుతాయి.
మియి 8 ఓఎస్: కంపెనీ ‘మి మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్‌తో పాటు పలు కొత్త, అప్‌డేటింగ్ ఫీచర్లతో ‘మియి 8’ ఓఎస్‌ను కూడా ఆవిష్కరించింది. ఇందులో డ్యూయెల్ యాప్స్ (ఒకే స్మార్ట్‌ఫోన్‌తో రెండు వాట్స్‌యాప్, ఫేస్‌బుక్ అకౌంట్లను ఉపయోగించవచ్చు), సెకండ్ స్పేస్ (కంప్యూటర్‌లో పలు యూజర్ అకౌంట్లను ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు హోమ్‌స్క్రీన్‌లను సెట్ చేసుకోవచ్చు), స్క్రోలింగ్ స్క్రీన్ షాట్స్, క్విక్ బాల్, టీ9 డయలర్ వంటి ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది. మియి 8 బీటా టెస్టింగ్ జూలై 11న ప్రారంభమవుతుంది. స్టేబుల్ వెర్షన్‌ను ఆగస్ట్ 16 నుంచి అందుబాటులోకి తెస్తారు. సి.మి.కామ్/ఈఎన్.మియి.కామ్ నుంచి మియి 8 బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంపెనీ ‘మి మాగ్జిమస్’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఆవిష్కరించింది. ఇది వచ్చే ఏడాది మార్కెట్లోకి వస్తుంది.
మినహాయింపు అక్కర్లేదు..
సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్స్‌కు సంబంధించి విడిభాగాల సమీకరణ నిబంధన నుంచి మినహాయింపు అవసరం లేదని షావోమి పేర్కొంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలంటే భారత్ నుంచి 30 శాతం వరకూ విడిభాగాలను సమీకరించాలనే నిబంధనను గతంలో ప్రభుత్వం విధించింది. తాము భారత్‌లో విక్రయిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో 75 శాతం వరకూ భారత్‌లోనే తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్ ఏర్పాటు కోసం తాము చేసిన దరఖాస్తు ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉందన్నారు.