న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా మూడు కొత్త స్మార్ట్‌ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేసింది. వీటితోపాటు తమిళనాడులో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ) అసెంబుల్ కోసం తొలి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్‌ఎంటీ) ప్లాంటును కూడా ప్రారంభించింది. తాజా విస్తరణతో కంపెనీ సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా స్థానిక డిమాండ్‌ను అందుకోగలమని షావోమి ధీమా వ్యక్తంచేసింది.
‘ఇప్పటికే స్మార్ట్‌ఫోన్స్ తయారీకి మాకు రెండు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి. ఇప్పుడు శ్రీసిటీ (ఆంధ్రప్రదేశ్), శ్రీపెరంబుదూర్ (తమిళనాడు)లో కొత్త యూనిట్లను ఏర్పాటు చేశాం. వీటి కోసం ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం’ అని షావోమి వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఎండీ మను జైన్ తెలిపారు. యూనిట్ల ఏర్పాటుకు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడించలేదు.
ఇక్కడ జరుగుతున్న ‘సప్లయర్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో 50కిపైగా గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ కాంపొనెంట్ సప్లయర్స్ పాల్గొంటున్నారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, డీఐపీపీ సెక్రటరీ రమేశ్ అభిషేక్, ఇన్వెస్ట్ ఇండియా సీఈవో దీపక్ బగ్లా సంయుక్తంగా ఈ సదస్సును ప్రారంభించారు.
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలని గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ కాంపొనెంట్ సప్లయర్స్‌కి మను జైన్ పిలుపునిచ్చారు. ‘ఒకవేళ కాంపొనెంట్ సప్లయర్స్ అంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులు రావొచ్చు. 50వేల మందికిపైగా ఉపాధికి లభించొచ్చు’ అన్నారాయన.
ఇండియాలోని పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు కాంపొనెంట్ సప్లయర్స్ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, ఎఫ్‌డీఐ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ వంటి పలు అంశాలను పరిశీలిస్తారు. భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి సప్లయర్స్‌కి తెలియజేసి, వారిని ఇక్కడ ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని జైన్ తెలిపారు.
సెకన్‌కు రెండు ఫోన్ల తయారీ!!
భారత్‌లో తాజా విస్తరణతో కంపెనీ తయారీ సామర్థ్యం రెట్టింపవుతుందని, సెకన్‌కు రెండు ఫోన్లను తయారు చేయగలుగుతామని జైన్ తెలిపారు. ‘‘మేం భారత్‌లో తయారు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ఫోన్ విలువలో పీసీబీదే సగభాగం. వచ్చే క్యూ3 నాటికి భారత్‌లో తయారయ్యే అన్ని షావోమి ఫోన్లలో ఇక్కడ తయారు చేసిన పీసీబీలనే వాడతాం’’ అన్నారాయన.
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్మార్ట్‌పోన్ల విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించిన నేపథ్యంలో కంపెనీ తయారీ యూనిట్ల ప్రకటన చేయడం ఆసక్తికరం. శామ్‌సంగ్‌కు మాత్రమే ప్రస్తుతం ఇండియాలో పీసీబీ కేంద్రం ఉంది. వివో, ఒప్పొ కూడా ఇక్కడే పీసీబీ ఫెసిలిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. భారత్‌లో షావోమికి ఫాక్స్‌కాన్, హిపాడ్ భాగస్వామ్యంతో ఆరు స్మార్ట్‌ఫోన్స్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment