కోల్‌కతా : టెలివిజన్ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపేయడానికి షావోమి సిద్ధమైంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన సత్తా చాటుతున్న షావోమి, భారత్‌లో టెలివిజన్ సెట్లు తయారుచేయడానికి రంగం సిద్ధం చేసింది. దీని కోసం తైవనీస్ కాంట్రాక్ట్ మానుఫ్రాక్ట్ర్చర్ ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. వచ్చే పండుగ సీజన్ కల్లా ఆన్‌లైన్ అమ్మకాల్లో తాను ఆధిపత్య స్థానంలో ఉండాలని షావోమి ప్లాన్ చేస్తోందని ముగ్గురు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. భారత్‌లోనే టీవీ సెట్లను రూపొందిస్తుండటంతో, కంపెనీ పన్ను ప్రయోజనాలను కూడా పొందనుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. అయితే టీవీల ధరలను మాత్రం షావోమి తగ్గించకపోవచ్చని, ఇప్పటికే ఎలాంటి మార్జిన్లు లేకుండా వీటిని తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తుందని తెలిపారు. భారత్‌లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయదారిగా ఇప్పటికే షావోమికి పేరుంది.
ప్రస్తుతం భారత్‌లో టెలివిజన్లను తయారు చేయడానికి ఫాక్స్‌కాన్‌తో జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. జూన్-ఆగస్టు నుంచి వీటి అమ్మకాలు ప్రారంభమవుతాయని, పండుగ సీజన్-దివాళి విక్రయాల్లో ఎక్కువగా మేడిన్ ఇండియా మోడల్సే ఉండనున్నాయని పేర్కొన్నాయి. అయితే షావోమి తొలుత అతిపెద్ద ఆన్‌లైన్ టెలివిజన్ బ్రాండ్‌గా నిలువాలని టార్గెట్ పెట్టుకుంది. అనంతరం మల్టి బ్రాండ్ స్టోర్లలోకి విస్తరించాలని చూస్తోంది. స్థానికంగా టెలివిజన్ సెట్లు తయారు చేస్తుండటంతో, కంపెనీకి పన్ను ప్రయోజనాలు లభించడమే కాకుండా... మార్జిన్లు కూడా పెరగనున్నాయి. ఇది సప్లై చెయిన్‌ను నియంత్రించడానికి సహకరిస్తుంది.
భారత్‌లో టెలివిజన్లను తయారుచేయడం షావోమి ప్రారంభిస్తుందని, ఈ ఏడాదిలో ఈ ప్రక్రియ ప్రారంభం కావొచ్చని షావోమి ఇండియా అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఫాక్స్‌కాన్ మాత్రం దీనిపై స్పందించలేదు. దిగుమతి పన్నుల్లో మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో షావోమి గత నెలలో తన 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను పెంచిన సంగతి తెలిసిందే. పన్నులు పెరుగుతుండటంతో ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్, ఫోకస్డ్ టెలివిజన్ బ్రాండ్‌లు స్థానిక ఉత్పత్తిని పెంచడంపై ఎక్కువగా దృష్టిసారించాయి. షావోమి స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో తయారు చేయడంలో ఫాక్స్‌కాన్ అతిపెద్ద తయారీదారి. స్మార్ట్‌ఫోన్లను అసెంబుల్ చేయడానికి షావోమి ఇప్పటికీ ఆరు థర్డ్ పార్టీ ప్లాంట్లను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment