సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో, చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి జట్టు కట్టనున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో లీడర్‌గా ఉన్న షావోమి టీవీ మార్కెట్‌లో కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే ఇండియాలోకి తీసుకురానున్న షావోమి టీవీలను జియో రీటైల్ దుకాణాల్లో లాంచ్ చేసేందుకు యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య భాగస్వామ్య చర్చలు నడుస్తున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా తన ఉత్పత్తులను విక్రయిస్తున్న షావోమి ఆఫ్‌లైన్ విక్రయాలపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ‍్యంలో భాగస్వాముల కోసం చూస్తోంది. అలాగే వినియోగదారుల ఉత్పత్తులు మాత్రమే కాకుండా, బీ టూ బీ ఉత్పత్తులను కూడా ఇండియాకు తీసుకురావాలని ఆశ పడుతోంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో, షావోమి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల మధ్య ఈ మేరకు పలుమార్లు చర్చలు జరిపాయి. చర్చలు ఒక కొలిక్కి వచ్చి..ఈ ఒప్పందం అమల్లోకి వస్తే.. ఈ ఏడాది నుంచే రిలయన్స్ జియో డిజిటల్ స్టోర్స్ ద్వారా ఎంఐ, రెడ్ మీ బ్రాండ్లను విక్రయించనుంది. అలాగే షావోమీ టీవీలను కూడా విక్రయించనుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్‌పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్, ఎల్‌జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస‍్థల ధరలతో పోలిస్తే సరసమైన ధరలకు ఫీచర్, రిచ్, హై ఎండ్ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది.
కాగా పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ ప్రకారం భారతదేశంలో నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అవతరించిన షావోమి 2018 లో తన ఆన్‌లైన్ వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment