వెరిజాన్ చేతికి యాహూ! | Yahoo sold to US telecoms giant Verizon | Sakshi
Sakshi News home page

వెరిజాన్ చేతికి యాహూ!

Published Tue, Jul 26 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

వెరిజాన్ చేతికి యాహూ!

వెరిజాన్ చేతికి యాహూ!

ఇంటర్నెట్ అసెట్స్ కొనుగోలుకు ఒప్పందం
డీల్ విలువ రూ.32,500 కోట్లు...
యాహూను ఏఓఎల్‌తో అనుసంధానించనున్న వెరిజాన్

న్యూయార్క్: సెర్చ్, మెయిల్, చాట్, న్యూస్... ఇలా ఏదన్నా మొదట గుర్తుకొచ్చే పేరు యాహూనే. కాకపోతే ఇదంతా గూగుల్ రాకముందు. ఒకప్పుడు మొత్తం ఇంటర్నెట్ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న యాహూ... చివరకు గూగుల్‌తో పోటీపడలేక చతికిలబడిపోయింది. వరస నష్టాలతో... తెచ్చిన కొత్త ఉత్పత్తులన్నీ ఫ్లాప్ కావటంతో దిక్కుతోచక కొట్టుకుంటున్న ఈ సంస్థ... ఎట్టకేలకు చేతులు మారుతోంది. ఈ అమెరికన్ కంపెనీని కొనుగోలు చేసేందుకు వెరిజాన్ కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా ప్రస్తుతం నిర్వహణలో ఉన్న యాహూ వ్యాపారాన్ని (ఇంటర్నెట్ అసెట్స్) మాత్రమే వెరిజాన్ దక్కించుకోనుంది.

ఇందుకోసం దాదాపు 4.83 బిలియన్ డాలర్లు (సుమారు రూ.32,500 కోట్లు) చెల్లించనున్నట్లు సోమవారం ప్రకటించింది. కొనుగోలు తర్వాత యాహూ సేవలన్నింటినీ తన అనుబంధ సంస్థ ఏఓఎల్‌తో (అమెరికా ఆన్‌లైన్) అనుసంధానించనున్నట్లు వెరిజాన్ వెల్లడించింది. కాగా, యాహూ దగ్గరున్న నగదు నిల్వలు, అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్‌లో దానికున్న వాటా, యాహూ జపాన్‌లో షేర్లు, కొన్ని మైనారిటీ పెట్టుబడులు, కొన్ని నాన్-కోర్ పేటెంట్లు ఈ కొనుగోలు ఒప్పందం పరిధిలోకి రావని ఆ ప్రకటనలో వివరించింది.

 ఇక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగానే...
యాహూ కొనుగోలు ఒప్పందం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశం ఉది. ముఖ్యంగా యాహూ వాటాదారుల ఆమోదం, నియంత్రణ సంస్థలు ఇతరత్రా అనుమతులకు లోబడి డీల్ పూర్తవుతుందని వెరిజాన్ తెలిపింది. కాగా, డీల్ పూర్తయిన తర్వాత యాహూ తన పేరును మార్చుకుంటుంది. రిజిస్టర్డ్ పబ్లిక్ లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా మారుతుంది. డీల్ పూర్తయ్యేవరకూ యాహూ ప్రస్తుత నిర్వహణ మొత్తం స్వతంత్రంగానే కొనసాగుతుందని.. యూజర్లు, అడ్వర్టయిజర్లు, డెవలపర్లు, పార్ట్‌నర్లు అందరికీ సేవలు, ఉత్పత్తులను యథావిధిగా అందిస్తుందని వెరిజాన్ తెలియజేసింది.

 1994లో ఆవిర్భావం...
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ విద్యార్ధులైన జెర్రీ యాంగ్, డేవిడ్ ఫిలో కలిసి యాహూను 1994లో నెలకొల్పారు. ఇంటర్నెట్ రంగంలో తొలితరం సెర్చింజన్‌గా, ఈ-మెయిల్ సేవల్లో కూడా తనదైన మార్కును ప్రపంచవ్యాప్తంగా యాహూ చూపించింది. వెబ్ బ్రౌజర్ నెట్‌స్కేప్ ఇతరత్రా కొన్ని సంస్థల మాదిరిగా కాకుండా డాట్‌కామ్ బూమ్ బద్దలైన తర్వాత కూడా యాహూ నిలదొక్కుకోవడంతో పాటు షాపింగ్, న్యూస్ వంటి ఇతర సేవల్లో కూడా విస్తరించి ముందుకెళ్లింది. అయితే, గూగుల్ బరిలోకి దిగాక పరిస్థితి మారింది.

పోటీలో వెనుకబడటంతోపాటు ఈ విధమైన సేవల్లో విపరీతమైన పోటీ కారణంగా నెమ్మదిగా యాహూ ప్రాభవం మసకబారింది. కాగా, ప్రస్తుతం యాహూకు 100 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లున్నట్లు అంచనా. ఇందులో 60 కోట్ల మేర యాక్టివ్ మొబైల్ యూజర్లు. నాలుగేళ్ల కిందట కంపెనీ పగ్గాలు చేపట్టిన మరిస్సా మేయర్.. గూగుల్ ఇతర పోటీ కంపెనీలను తట్టుకొని యాహూకూ పూర్వ వైభవం తీసుకురావడంలో విఫలమయ్యారు. మేయర్ అంతక్రితం గూగుల్‌లోనే పనిచేయడం విశేషం.

యాహూ! మరికొన్ని విశేషాలు..
2000 సంవత్సరంలో డాట్‌కామ్ బూమ్ బద్దలయ్యే ముందు వరకూ యాహూ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకుపైనే ఉంది. 2008లో కూడా యాహూను కొనుగోలు చేయడం కోసం మైక్రోసాఫ్ట్ 44 బిలియన్ డాలర్లకు బిడ్ వేయడం గమనార్హం.

యాహూ సోషల్ మీడియాపై పట్టు సంపాదించేందుకు ఆన్‌లైన్ బ్లాగింగ్ సంస్థ టంబ్లర్‌ను 2013లో బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా యాహూలో 2014 వరకూ 11,000 మంది ఉద్యోగులుండగా కోతల కారణంగా ఈ మార్చి నాటికి 9,400 మంది మిగిలారు.

2015లో 4.9 బిలియన్ డాలర్ల ఆదాయంపై 4.4 బిలియన్ డాలర్ల నష్టం రావటం గమనార్హం.

ప్రస్తుతం యాహూ మార్కెట్ విలువ 38 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.2.5 లక్షల కోట్లు)గా ఉంది. అయితే, ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలో యాహూకు ఉన్న 15 శాతం వాటా ఆధారంగానే ఇంతటి విలువ ఉంది. అలీబాబాలో ఉన్న యాహూ వాటా విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లు.

ఇంకా నాన్-కోర్ పేటెంట్లను యాహూ విడిగా విక్రయించనుంది. ఈ డీల్ బిలియన్ డాలర్లకుపైగానే (సుమారు రూ.6,700 కోట్లు) ఉండొచ్చని అంచనా.

దాదాపు 228 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న అమెరికా టెలికం అగ్రగామి వెరిజాన్... గతేడాది ఏఓఎల్‌ను 4.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తద్వారా హఫింగ్టన్ పోస్ట్, టెక్‌క్రంచ్, ఎన్‌గ్యాడ్జెట్ తదితర న్యూస్ వెబ్‌సైట్లను తన యాజమాన్యంలోకి తీసుకొచ్చింది.

యాహూను ఏఓఎల్‌తో అనుసంధానించడం ద్వారా గూగుల్, ఫేస్‌బుక్ తరహాలోనే డిజిటల్ అడ్వర్టయిజింగ్‌లో దూసుకెళ్లాలనేది వెరిజాన్ వ్యూహం.

‘డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఇంటర్నెట్ సేవలపై దృష్టిపెట్టిన నేపథ్యంలో ఏడాది క్రితం మేం ఏఓఎల్‌ను చేజిక్కించుకున్నాం. ఇప్పుడు యాహూను కూడా దక్కించుకోవడంతో ఇకపై ప్రపంచంలోని దిగ్గజ మొబైల్ మీడియా కంపెనీల్లో ఒకటిగా అవతరించేందుకు వీలవుతుంది. డిజి టల్ అడ్వర్టయిజింగ్‌లో ఆదాయం కూడా భారీగా పుంజుకోనుంది’.  - లావెల్ మెక్‌ఆడమ్, వెరిజాన్ చైర్మన్, సీఈఓ

‘వెబ్ బ్రౌజింగ్, ఇంటర్నెట్ సేవల్లో ప్రపంచాన్ని మార్చిన గొప్ప ఘనత యాహూ సొంతం, వెరిజాన్-ఏఓఎల్‌ల నేతృత్వంలో ఇకపై కూడా యాహూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ప్రధానంగా ప్రస్తుత నిర్వహణ వ్యాపారాన్ని అమ్మడం ద్వారా ఆసియాలో ఉన్న అసెట్ ఈక్విటీ వాటాలను విడగొట్టేందుకు వీలవుతుంది. వాటాదారులకు మరింత ప్రయోజనం చేకూర్చే ప్రణాళికల్లో ఇది కీలకం. ఈ రోజుకు యాహూకు చాలా గొప్ప రోజు. వ్యక్తిగతంగా నాకు కూడా. నేను కంపెనీతోనే కొనసాగుతాను. అంతేకాదు కంపెనీ కొత్త అధ్యాయంలో నేను భాగస్వామ్యం కావాలనుకుంటున్నా. మీ అందరిపై(ఉద్యోగులు) నాకు పూర్తి విశ్వాసం ఉంది.  ఐ లవ్ యాహూ’.
- ఉద్యోగులకు లేఖలో మరిస్సా మేయర్, యాహూ సీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement