ఆ ఒప్పందంతో 2 వేల ఉద్యోగాలు ఢమాల్
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా వెలిగిన యాహూను సొంతం చేసుకున్న వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్ ఉద్యోగులపై భారీ వేటు వేయనుంది. యాహూ కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో రెండు కంపెనీలకు చెందిన దాదాపు 2 వేల మందిని ఇంటికి పంపించనుందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం 2 వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఇంక్ తొలగించనుంది. మొత్తం 4.48 బిలియన్ డాలర్లు ఒప్పందం పూర్తయిన అనంతరం ఈ తొలగింపులను చేపట్టనుంది. రెండు యూనిట్లకు చెందిన 15శాతం ఉద్యోగులను తగ్గించనుంది వీటిలోముఖ్యంగా కాలిఫోర్నియా సహా, అమెరికా వెలుపల ఉద్యోగులు ఇందులో ఉన్నారు.
మరోవైపు యాహూ- వెరిజోన్ విలీనానికి వాటాదారుల సాధారణ సమావేశం గురువారం ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం కంపెనీ విక్రయ ప్ర్రకియ మంగళవారం పూర్తి కానుంది. వెరిజోన్ , యాహూ విలీనంతో కొత్త వెంచర్ ఓథ్ ఉనికి లోనికి రానుంది. వెరిజోన్‌కు చెందిన అమెరికన్ మల్టీనేషనల్ మాస్ మీడియా కార్పొరేషన్ ఏఓఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ ఆర్ స్ట్రాంగ్ నేతృత్వంలోని ఓథ్ అనే నూతన సంస్థగా రీబ్రాండ్ అయింది.
కాగా 2012లో యాహూ సీఈవోగాఎంపికైన మెరిస్సా మేయర్ పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోవడంతో వివాదం రగిలింది. ఈ క్రమంలోనే 2015లో యాహూ, తన వ్యాపారంలోని ముఖ్య విభాగాలైన డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఈ-మెయిల్, మీడియా విభాగాలను వేరిజోన్ కు విక్రయించిన సంగతి తెలిసిందే.