‘యస్‌’ బాస్‌.. రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌! | Yes Bank gets RBI approval for Ravneet Singh Gill to be CEO | Sakshi
Sakshi News home page

‘యస్‌’ బాస్‌.. రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌!

Published Fri, Jan 25 2019 5:24 AM | Last Updated on Fri, Jan 25 2019 5:24 AM

Yes Bank gets RBI approval for Ravneet Singh Gill to be CEO - Sakshi

ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన యస్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఈ నెల 31తో పదవీ కాలం పూర్తవుతున్న రాణా కపూర్‌ స్థానంలో రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ రానున్నారు. ప్రస్తుతం ఆయన డాయిష్‌ బ్యాంక్‌ ఇండియా అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ నియామాకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని, మార్చి 1వ తేదీకి ముందే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని యస్‌ బ్యాంక్‌ తెలిపింది. 29న బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం జరుగుతుందని పేర్కొంది.  

28 ఏళ్ల బ్యాంకింగ్‌ అనుభవం...
2012, ఆగస్టు నుంచి రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ డాయిష్‌ బ్యాంక్‌ ఇండియా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆయనకు దాదాపు 28 ఏళ్ల అపారమైన అనుభం ఉంది. యస్‌ బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌ను సీఈఓ, ఎమ్‌డీ పదవి నుంచి వైదొలగాలని గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఆర్‌బీఐ ఆదేశించింది. కపూర్‌ పదవీ కాలాన్ని మరో మూడేళ్లపాటు పొడిగించాలన్న బోర్డ్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనికి గల కారణాలను ఆర్‌బీఐ వెల్లడించకపోయినప్పటికీ, కపూర్‌ హయాంలో మొండి బకాయిల విషయంలో అవకతవకలు జరిగాయని అందుకే ఆర్‌బీఐ ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్‌ ధర మూడింట రెండొంతులకు పైగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంక్‌ సీఈఓ విషయమై అనిశ్చితి తొలగిపోవడంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ జోరుగా పెరిగింది. బీఎస్‌ఈలో 8% లాభంతో రూ.214 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 19% ఎగసి రూ.235ను తాకింది. షేర్‌ జోరు కారణంగా యస్‌ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ ఒకేరోజు రూ.3,839 కోట్లు పెరిగి రూ.49,460 కోట్లకు చేరింది.

నికర వడ్డీ ఆదాయం 41 శాతం అప్‌...
యస్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 7 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,077 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,002 కోట్లకు తగ్గిందని యస్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం 7 శాతం ఎగసి రూ.3,557 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ ప్రస్తుత సీఈఓ రాణా కపూర్‌ పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 41 శాతం పెరిగి రూ.2,666 కోట్లకు చేరింది. 42 శాతం వృద్ధితో రుణాలు రూ.2,43,885 కోట్లకు, డిపాజిట్లు 30 శాతం వృద్ధి చెంది రూ.2.22,758 కోట్లకు చేరాయి. గత క్యూ3లో 3.5 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ3లో 3.3 శాతానికి తగ్గిందని వెల్లడించారు.  

తగ్గిన రుణ నాణ్యత..
యస్‌ బ్యాంక్‌  రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత క్యూ3లో 1.72%గా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ క్యూ3లో 2.1 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 0.93% నుంచి 1.18%కి చేరాయి.  

తప్పని ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సెగ !
ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఒక మౌలిక రంగ దిగ్గజ గ్రూప్‌ కంపెనీలకు(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌గా అంచనా) రూ.571 కోట్ల మేర రుణాలిచ్చామని, అందుకని నికర కేటాయింపులు రూ.550 కోట్లకు పెరిగాయని రాణా కపూర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement