ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)కు ధరను నిర్ణయించే ముందురోజు అంటే ఈ నెల 9న యస్ బ్యాంక్ కౌంటర్లో భారీ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో షేరు 10 శాతం పతనమైంది. ఇదే రోజు కొంతమంది ఇన్వెస్టర్లు నెల రోజులకుగాను ఎస్‌ఎల్‌బీఎం(షేర్లను అరువు తెచ్చుకోవడం)ద్వారా దాదాపు 96 లక్షల యస్ బ్యాంక్ షేర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. షేరుకి రూ. 7 వడ్డీ రేటులో తీసుకున్న వీటి విలువ రూ. 5.9 కోట్లుకాగా.. ఆగస్ట్ 6న సెటిల్‌మెంట్ గడువు ముగియనుంది. మరుసటి రోజు బ్యాంక్ బోర్డు ఎఫ్‌పీవోకు రూ. 12 ధర(ఫ్లోర్ ప్రైస్)ను నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ కౌంటర్లో నమోదైన ఎస్‌ఎల్‌బీఎం లావాదేవీలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వెరసి శుక్రవారం(10న) సైతం నేలచూపులతో ముగిసిన యస్ బ్యాంక్ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యస్ బ్యాంక్ షేరు 11 శాతంపైగా కుప్పకూలి రూ. 22.7 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21 వరకూ జారింది. గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 15 శాతం పతనంకావడం గమనార్హం!
ఈడీ దర్యాప్తు
యస్ బ్యాంక్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండో ప్రాసెక్యూషన్ ఫిర్యాదును నేడు(13న) దాఖలు చేయవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధ్వాన్‌లతోపాటు.. 13 సంస్థలు, వ్యక్తులపై ఈడీ కంప్లయింట్ దాఖలు చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్ నియంత్రణలోని బిలీఫ్ రియల్టర్ ప్రయివేట్ లిమిటెడ్‌కు గతంలో యస్ బ్యాంక్ రూ. 750 కోట్ల రుణం మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. కాగా.. పలు ప్రతికూల వార్తలతో ఇటీవల కొంతకాలంగా యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో యస్ బ్యాంక్ షేరు 49 శాతం దిగజారింది.
Comments
Please login to add a commentAdd a comment