Yes Bank Ltd
-
యస్‌బ్యాంకు భారీ ఊరట: రుణాల్లో 14 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: గతేడాది జూన్ ఆఖరుతో పోలిస్తే ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ రుణాల వ్యాపారం 14 శాతం వృద్ధి చెంది రూ. 1,63,654 కోట్ల నుంచి రూ. 1,86,598 కోట్లకు చేరింది. జూన్ క్వార్టర్లో స్థూల రిటైల్ రుణాలు రెట్టింపై రూ. 5,006 కోట్ల నుంచి రూ. 11,431 కోట్లకు పెరిగాయి. ఇక డిపాజిట్లు 18.3 శాతం వృద్ధితో రూ. 1,63,295 కోట్ల నుంచి రూ. 1,93,241 కోట్లకు చేరాయి. అయితే, మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తగ్గాయి. ఇవి ప్రొవిజనల్ గణాంకాలని, త్వరలోనే జూన్ త్రైమాసిక ఆర్తిక ఫలితాలను ప్రకటించ నున్నామని బ్యాంక్ తెలిపింది. అటు, ఆర్బీఎల్ బ్యాంక్ కూడా తమ వ్యాపార గణాంకాలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లు 6 శాతం పెరిగి రూ. 79,217 కోట్లకు చేరినట్లు పేర్కొంది. రిటైల్ రుణాలు వార్షికంగా 5 శాతం, సీక్వెన్షియల్‌గా 3 శాతం క్షీణించాయని వివరించింది. గత కొద్ది త్రైమాసికాలుగా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో వ్యాపారం కూడా పుంజుకుంటోందని ఆర్బీఎల్ బ్యాంకు పేర్కొంది. -
యస్ బ్యాంకునకు మరో షాక్
సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు మరోషాక్ తగిలింది. బాండ్లకు సంబంధించిన మోసపూరిత చర్యల పాల్పడిందంటూ యస్ బ్యాంకుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ .25 కోట్లు జరిమానా విధించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు వేసిన కస్టమర్లను బలవంతంగా, మోసపూరితంగా ఏటీ-1(అడిషనల్ టైర్ వన్ బాండ్లు) బాండ్ల వైపు మళ్లించారనేది ఆరోపణ. కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందుకున్న తర్వాత విచారణ జరపగా, ఏటి-1 బాండ్ల విషయంలో వారి ఫిర్యాదులు వాస్తవమే అని తేలింది. 2016 డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 29,2020 మధ్యకాలంలో వీటిని విక్రయించినట్టు సెబీ తెలిపింది. యస్ బ్యాంక్ యాజమాన్యం నేరుగా తమ బ్యాంక్‌లోని 1300 మంది కస్టమర్ల చేత వీటిని కొనుగోలు చేయించిందనీ, ఆయా పెట్టుబడులను సంబంధిత వ్యక్తుల ప్రమేయం లేకుండా రిస్కీ బాండ్లలోకి మార్చి విక్రయించిందని ఆరోపించింది. అధిక రాబడుల పేరుతో బ్యాంకు ఉద్యోగులు మోసంగించారని సెబీ నిర్ధారించింది. తద్వారా 70,80,90 ఏళ్ల వయసున్న చాలామంది వినియోగదారులు ప్రభావితమయ్యారని వాదించింది. ఫలితంగా యస్ బ్యాంక్ ప్రవేట్ వెల్త్ మేనేజ్మెంట్కి చెందిన వివేక్ కన్వర్‌పై కోటి రూపాయలు, ఆశిష్ నాసా, జస్జీచ్ సింగ్ బంగాపై తలా రూ.50లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సెబీ. -
ఐసీఐసీఐ -యస్ బ్యాంక్ షేర్ల పతనం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.5 శాతం పతనమై రూ. 361 దిగువన ట్రేడవుతోంది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఐసీఐసీఐ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 2599 కోట్లను అధిగమించింది. ప్రధానంగా జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థల పనితీరు ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 సంబంధ ప్రొవిజన్లు రూ. 5,550 కోట్లు అదనంగా నమోదుకావడం ప్రతికూల అంశమని తెలియజేశారు. క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9280 కోట్లను తాకింది. యస్ బ్యాంక్ ఈ నెల 15-17 మధ్య ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) చేపట్టిన ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో 10 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 12.30 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా ఎఫ్‌పీవో ధర రూ. 12 సమీపానికి చేరింది. కాగా.. ఎఫ్‌పీవో ద్వారా బ్యాంకు రూ. 14,272 కోట్లను సమీకరించింది. ఎఫ్‌పీవోలో భాగంగా బ్యాంక్ షేర్ల అలాట్మెంట్ను పూర్తిచేయడంతో ఇవి ట్రేడింగ్‌కు అందుబాటులోకి వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కౌంటర్లో సుమారు 4.2 కోట్ల షేర్ల సెల్ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ఎఫ్‌పీవోకు రూ. 12 ధరను ఖరారు చేశాక యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. వెరసి వారాంతానికల్లా యస్ బ్యాంక్ షేరు 55 శాతం దిగజారినట్లు వివరించారు. -
మళ్లీ కుప్పకూలిన యస్ బ్యాంక్ షేరు
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)కు ధరను నిర్ణయించే ముందురోజు అంటే ఈ నెల 9న యస్ బ్యాంక్ కౌంటర్లో భారీ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో షేరు 10 శాతం పతనమైంది. ఇదే రోజు కొంతమంది ఇన్వెస్టర్లు నెల రోజులకుగాను ఎస్ఎల్బీఎం(షేర్లను అరువు తెచ్చుకోవడం)ద్వారా దాదాపు 96 లక్షల యస్ బ్యాంక్ షేర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. షేరుకి రూ. 7 వడ్డీ రేటులో తీసుకున్న వీటి విలువ రూ. 5.9 కోట్లుకాగా.. ఆగస్ట్ 6న సెటిల్మెంట్ గడువు ముగియనుంది. మరుసటి రోజు బ్యాంక్ బోర్డు ఎఫ్‌పీవోకు రూ. 12 ధర(ఫ్లోర్ ప్రైస్)ను నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ కౌంటర్లో నమోదైన ఎస్ఎల్బీఎం లావాదేవీలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వెరసి శుక్రవారం(10న) సైతం నేలచూపులతో ముగిసిన యస్ బ్యాంక్ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 11 శాతంపైగా కుప్పకూలి రూ. 22.7 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21 వరకూ జారింది. గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 15 శాతం పతనంకావడం గమనార్హం! ఈడీ దర్యాప్తు యస్ బ్యాంక్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండో ప్రాసెక్యూషన్ ఫిర్యాదును నేడు(13న) దాఖలు చేయవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధ్వాన్‌లతోపాటు.. 13 సంస్థలు, వ్యక్తులపై ఈడీ కంప్లయింట్ దాఖలు చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ నియంత్రణలోని బిలీఫ్ రియల్టర్ ప్రయివేట్ లిమిటెడ్‌కు గతంలో యస్ బ్యాంక్ రూ. 750 కోట్ల రుణం మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. కాగా.. పలు ప్రతికూల వార్తలతో ఇటీవల కొంతకాలంగా యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో యస్ బ్యాంక్ షేరు 49 శాతం దిగజారింది. -
యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ధర రూ. 12
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)కు ఫ్లోర్ ధరను రూ. 12గా నిర్ణయించింది. ఇది గురువారం ముగింపు ధర రూ. 26.6తో పోలిస్తే 55 శాతం తక్కువ కావడం గమనార్హం! ఎఫ్‌పీవో ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. తద్వారా రూ. 15,000 కోట్లవరకూ సమీకరించాలని యస్ బ్యాంక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమై రూ. 25 వద్ద ట్రేడవుతోంది. రూ. 1 డిస్కౌంట్ అర్హతగల ఉద్యోగులకు యస్ బ్యాంక్ ఎఫ్‌పీవో ధరలో రూ.1 డిస్కౌంట్ ప్రకటించింది. ఎఫ్‌పీవోలో భాగంగా 1,000 షేర్లను ఒకలాట్‌గా కేటాయించనుంది. దీంతో ఇన్వెస్టర్లు కనీసం 1,000 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వెరసి రూ. 12,000 కనీస పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. యస్ బ్యాంకులో అతిపెద్ద వాటాదారు ఎస్బీఐ రూ. 1760 కోట్లవరకూ ఈ ఎఫ్‌పీవోలో ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకు ఎస్బీఐ బోర్డు గ్రీన్సిగ్నల్ఇచ్చిన విషయం విదితమే. ఈ బాటలో ఇతర సంస్థలు టిల్డెన్ పార్క్, ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితరాలు సైతం ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఇండస్ఇండ్- యస్ బ్యాంక్.. జోరు
ప్రపంచ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 36 పాయింట్లు క్షీణించి 36,638కు చేరగా.. నిఫ్టీ 7 పాయింట్లు తక్కువగా 10,793 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల ప్రభావంతో ప్రయివేట్ రంగ సంస్థలు ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో యూఎస్ హెడ్జ్ ఫండ్.. రూట్ వన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాటాను పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 5.25 శాతం జంప్‌చేసి రూ. 554 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 558 వరకూ ఎగసింది. గత 7 ట్రేడింగ్ సెషన్లలోనూ ఈ షేరు 15 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! బ్యాలన్స్‌షీట్‌ను పటిష్ట పరచుకోవడంతోపాటు నిధుల సమీకరణ ప్రణాళికల్లో భాగంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటీవల పలు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇండస్‌ఇండ్‌లో రూట్ వన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ప్రస్తుతం 5.41 శాతం వాటా ఉంది. ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా ఈ వాటాను 9.9 శాతానికి పెంచుకునే యోచనలో రూట్ వన్ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇందుకు బ్యాంక్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వవలసి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. మరోవైపు బ్యాంక్ ప్రమోటర్లు సైతం తమ వాటాను ప్రస్తుత 14.34 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. యస్ బ్యాంక్ నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలతో ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం బలపడి రూ. 26.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 27 వరకూ పెరిగింది. బ్యాంక్ బోర్డుకి చెందిన పెట్టుబడుల పెంపు కమిటీ(సీఆర్సీ) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా నిధుల సమీకరణకు అనుమతించినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఈ నెల 10న నిర్వహించనున్న సమావేశంలో సీఆర్సీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై నిర్ణయాలను తీసుకోనున్నట్లు తెలియజేసింది. -
ఈ 3 షేర్ల దూకుడుకు కారణమేంటట?
ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో పరుగు తీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 256 పాయింట్లు పెరిగి 34,543కు చేరగా.. నిఫ్టీ 64 పాయింట్లు పుంజుకుని 10,206 వద్ద ట్రేడవుతోంది. కాగా.. విభిన్న వార్తల కారణంగా టైటన్ కంపెనీ, యస్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టైటన్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ప్రస్తుతం టైటన్ కంపెనీ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో 3.5 శాతం పెరిగి రూ. 1025 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 7 శాతం జంప్‌చేసి రూ. 1,050 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. జ్యువెలరీ, ఐవేర్, వాచీలు తదితర లైఫ్‌స్టైల్ ప్రొడక్టుల ఈ కంపెనీ అమ్మకాలు ఇటీవల లాక్‌డవున్ నేపథ్యంలో నీరసించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పసిడి ధరలు పుంజుకోవడంతో మార్క్‌టు మార్కెట్ క్యాష్‌ఫ్లో పెరిగినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు స్టోర్లను తిరిగి తెరుస్తున్న కారణంగా అమ్మకాలు గాడిన పడగలవన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. యస్ బ్యాంక్ యస్ బ్యాంకుకు చెందిన రూ. 18,000 కోట్ల బాండ్లకు BBB రేటింగ్‌ను పునరుద్ఘాటిస్తున్నట్లు క్రిసిల్ తాజాగా పేర్కొంది. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ దన్ను కారణంగా యస్ బ్యాంక్ జారీ టైర్-2, ఇన్ఫ్రా బాండ్లకు స్టేబుల్ రేటింగ్‌ను ఇస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు తొలుత 10 శాతం జంప్‌చేసి రూ. 32ను తాకింది. ఇది 10 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 30.4 వద్ద ట్రేడవుతోంది. వొడాఫోన్ ఐడియా వరుసగా 10వ సెషన్లోనూ మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా కౌంటర్ జోరు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు తొలుత 20 శాతం దూసుకెళ్లి రూ. 12.6ను తాకింది. ప్రస్తుతం 11.5 శాతం ఎగసి రూ. 11.7 వద్ద ట్రేడవుతోంది. గత 10 రోజుల్లోనూ ఈ కౌంటర్ 129 శాతం ర్యాలీ చేయడం విశేషం! గత 26న ఈ షేరు రూ. 5.5 వద్ద ట్రేడైన సంగతి తెలిసిందే. కాగా.. టెక్ దిగ్గజం గూగుల్ వొడాఫొన్ ఐడియాలో 5 శాతం వాటా కొనుగోలు చేయవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వెరసి గతేడాది జులైలో చేపట్టిన రైట్స్ ఇష్యూ ధర రూ. 12.5ను తాజాగా అధిగమించినట్లు తెలియజేశారు. ఈ అంశాన్ని కంపెనీ తోసిపుచ్చినప్పటికీ.. ఇటీవల దేశీయంగా మొబైల్ టారిఫ్‌ల పెంపు.. వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం వంటి అంశాలు మొబైల్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు చెబుతున్నారు. -
ఆశ్చర్యపర్చిన యస్ బ్యాంకు ఫలితాలు
సాక్షి, ముంబై : వివాదాల సంక్షోభం, మూలధన సమస్యల్లో ఇరుక్కున్న ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలతో అటు ఇన్వెస్టర్లను, ఇటు ట్రేడర్లను ఆశ్చర్య పర్చింది. దీంతో గురువారం నాటి నష్టాల మార్కెట్లో బ్యాంకు షేరు లాభాలతో దూసుకపోతోంది. రూ .2,629 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడంతో యస్ బ్యాంకు షేర్లు నష్టాల మార్కెట్లో భారీగా లాభపడుతున్నాయి. రూ. 31.60 వద్ద షేర్ ధర ఈరోజు 20 శాతం పుంజుకుంది. ఎన్ఎస్ఇ, బీఎస్‌ఇలలో 39.39 మిలియన్ షేర్లు చేతులు మారాయి. (నష్టాల్లో మార్కెట్ : యస్ బ్యాంకు జంప్) ఎస్ బ్యాంకు పునరుద్ధరణలో ఆర్బీఐ గైడెడ్ బెయిలౌట్ సహాయంతో ఇప్పుడు కోలుకుంటున్ బ్యాంకు, ఈ పరిణామాల తరువాత తన మొదటి ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోరూ. 18,560 కోట్ల నష్టాన్ని, జనవరి-మార్చి త్రైమాసికంలో రూ .1,506 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం దాదాపు సగం తగ్గి రూ.1,274 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.16,418 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే తక్కువ జారడం వల్ల వరుసగా 19.6 శాతం వృద్ధి. రూ .32,878 కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులను (స్థూల ఎన్‌పిఎ), నికర నిరర్ధక ఆస్తులను (నెట్ ఎన్‌పిఎ) 862,37 కోట్ల రూపాయలుగా నివేదించింది. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం ప్రొవిజన్లు రూ .24,766 కోట్లతో పోలిస్తే రూ .4,872 కోట్లకు తగ్గాయి. చాలా మంది విశ్లేషకులు ఊ హించిన దాని కంటే ఆదాయాలు మెరుగ్గా ఉండం విశేషం. కోటక్ సెక్యూరిటీస్ రూ .4,404 కోట్ల నికర నష్టాన్ని అంచనా వేసింది, (యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు) యస్ బ్యాంకు వివాదంతో జోక్యం చేసుకున్న ఆర్బీఐ మారటోరియం, నగదు విత్‌డ్రాపై ఆంక్షలకు దిగింది. బోర్డును రద్దు చేసి, 30 రోజుల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఆ తరువాత బ్యాంకు బోర్డును పునరుద్ధరించిన అనంతరం 2020 మార్చి18 నుండి అన్ని బ్యాంకింగ్ సేవలను తిరిగి ప్రారంభించింది. అలాగే బ్యాంకు పునరుద్దరణ చర్యల్లో భాగంగా ఎస్ బీఐ, హెచ్డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ఏడు ప్రైవేట్ బ్యాంకుల నుండి 10,000 కోట్ల రూపాయల ఈక్విటీ మూలధనాన్ని సమీకరించిన సంగతి తెలిసిందే. (యస్పై మారటోరియం ఎత్తివేత) -
‘యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభంలో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన లేఖలను జాతీయ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. తన తండ్రి దివంగత మాజీప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్‌ను రూ. 2 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు ధృవీకరిస్తూ ప్రియాంక గాంధీ వాద్రా జూన్ 4, 2010 న యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌కు రాసిన లేఖ తాజాగా వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించి చెక్కు ద్వారా ప్రియాంక గాంధీకి చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చెక్కును స్వీకరించినట్లు ఆమె రాణాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. 1985లో కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన తన తండ్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్‌ను కొనుగోలుకు రాణా కపూర్ చెల్లింపులు, ధన్యవాదాలు తెలుపుతూ ఆమె లేఖ రాశారన్న ఆరోపణలు తాజగా సంచలనం రేపుతున్నాయి. ఇండియా టుడే అందించిన వివరాల ప్రకారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చిత్రాన్నిరాణాకపూర్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.2 కోట్లకు 2010 జూన్ 3వ తేదీన తన పేరిట 134343 నెంబరు చెక్కు స్వీకరించినట్టుగా ప్రియాంక గాంధీ వాద్రా తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ లావాదేవీకి సంబంధించి కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్రా, రాణా కపూర్ మధ్య కూడా మధ్య ఉత్తరాలు నడిచినట్టు పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ విమర్శలకు కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ, తాజా నివేదికలపై అధికారికంగా స్పందించాల్సి వుంది. (చదవండి : యస్ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట) మరోవైపు రాణా కపూర్, ప్రియాంక గాంధీ నుంచి కొనుగోలు చేసిన పెయింటింగ్‌కు సంబంధించిన అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద 40 ప్రఖ్యాత పెయింటింగ్‌లు ఉన్నాయని తెలిపారు. అలాగే పోర్ట్రెయిట్లను కొనుగోలు చేసేటప్పుడు, వాల్యుయేషన్ కోసం నిపుణుల నుండి ధృవీకరణ పత్రాలను పొందుతాడు. కానీ రాజీవ్‌గాంధీ పెయింటింగ్‌కు సంబంధించి అలాంటి సర్టిఫికేట్ ఏదీ పొందలేని వ్యాఖ్యానించారు. అలాగే పెయింటింగ్ కాంగ్రెస్ పార్టీకి ఆస్తి, ప్రియాంక గాంధీ వాద్రాది కాదని ఈడీ వర్గాలు పేర్కొడం గమనార్హం. -
వాటా కొనుగోలు : యస్ బ్యాంకుకు ఊరట
సాక్షి, ముంబై: సంక్షోభంలో పడిన ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు ఊరట లభించనుంది. యస్ బ్యాంకులో వాటాను కొనుగోలు చేసే కన్సార్షియంకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నాయకత్వం వహించనుందని బ్లూం బర్గ్ నివేదించింది. దీనికి భారత ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందని పేర్కొంది. దీంతో గురువారం నాటి మార్కెట్లో యస్ బ్యాంకు షేర్లు 29 శాతం ర్యాలీ అయ్యాయి. యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ఒక కన్సార్షియం ఏర్పాటుకు ఆమోదం లభించిందని కన్సార్షియంలో సభ్యులను ఎంపిక చేసేందుకు కూడా ఎస్బీఐ గ్రీన్ సిగ్నల్ లభించిందన్న వార్తలు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అటు యస్ బ్యాంకు కానీ, ఇటు ఎస్బీఐ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. మరోవైపు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కనీసం ఒక నెల ఆలస్యంగా ప్రకటించనున్నామని యస్ బ్యాంకు ఫిబ్రవరిలో రెగ్యులేటరీకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా బ్యాడ్ లోన్ల బెడదకు తోడు, బోర్డులో ఏర్పడ్డ విభేదాలతో యస్ బ్యాంకు ఇటీవల కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోమూలధనాన్ని సమకూర్చుకోవడానికి చాలా కష్టపడుతోంది. దీంతో గత కొన్ని నెలలుగా ఈ స్టాక్‌గా భారీ పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ఒక్క నెలలోనే యస్ బ్యాంకు రికార్డు లాభం
సాక్షి, ముంబై : వరుస వివాదాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంకు రికార్డు స్తాయి లాభాలతో దూసుకుపోతోంది. రుణాల సేకరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి రానుండటంతో పాటు, రాకేష్ ఝన్‌ఝన్ వాలా షేర్ల కొనుగోలు పరిణామాల నేపథ్యంలో యస్ బ్యాంక్ షేర్లు ఒక నెలలో 78 శాతానికిపైగా పుంజుకున్నాయి. దీంతో ఒక బిలియన్ డాలర్లకు పైగా ఎక్కువ విలువైన కంపెనీల వరుసలో చేరింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లాభంగా నిలవడం విశేషం. గత ఏడాదిలో 68 శాతం కోల్పోగా, ఈ సంవత్సరం ప్రారంభంనుంచి 61శాతం పడిపోయి, సెప్టెంబర్ 2019 చివరలో, వ్యవస్థాపకుడు రానా కపూర్, ఇతర ప్రమోటర్ల వాటాల విక్రయంతో 2019లో అతిచెత్త ప్రదర్శన కనబర్చిన కంపెనీగా దిగజారిపోయింది. అయితే ఇటీవల నిధుల సేకరణకు బ్యాంకు యాజమాన్యం ప్రయత్నాలుముమ్మరంలో చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు ప్రముఖ పెట్టుబడిదారుడు నవంబరు 5వ తేదీన రాకేష్ ఝన్ ఝన్‌వాలా రూ. 87కోట్ల విలువైన 1.3 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం మరింత సానుకూలంగా మారింది. దీంతో వరుస సెషన్లుగా లాభపడుతూ వచ్చిన యస్ బ్యాంకు షేరు సోమవారం నాటి ట్రేడింగ్‌లో మరో 5 శాతం ఎగిసి రూ.72.90వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 71.35 గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ 1 న, యస్ బ్యాంక్ షేర్ ధర 23 శాతానికి పైగా పడిపోయి రూ. 29 వద్ద 52 వారాల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. -
జాక్‌పాట్ కొట్టేసిన ఎస్ బ్యాంకు
సాక్షి, ముంబై : వివాదంలో చిక్కుకుని సంక్షోభంలో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు ఎస్‌బ్యాంకు జాక్ పాట్ కొట్టినట్టు తెలుస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్ ద్వారా భారీ పెట్టుబడులను సాధించనుంది. 1.2 బిలియన్ (సుమారు రూ.8400 కోట్లు) డాలర్ల పెట్టుబడి బైండింగ్ ఆఫర్ అందుకున్నట్లు ఎస్‌బ్యాంకు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈక్విటీ వాటాల ద్వారా ఈ పెట్టుబడులనుపొందనున్నట్టు తెలిపింది. అయితే ఇది రెగ్యులేటరీ ఆమోదాలు / షరతులతో పాటు బ్యాంక్ బోర్డు, వాటాదారుల ఆమోదాలకు లోబడి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఈ ప్రకటన తర్వాత ఎస్ బ్యాంకు షేర్లు 35 శాతం జంప్ చేశాయి. హాంకాంగ్‌కు చెందిన ఎస్పీజీపీ హోల్డింగ్స్ ఈ భారీ పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించింది. అలాగే ఇతర దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చలు పురోగతిలో ఉన్నాయని కూడా బ్యాంకు తెలిపింది. నవంరు 1న విడుదల చేయనున్న త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈ డీల్‌పై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా నిధుల సేకరణ కోసం ఇతర ప్రపంచ, దేశీయ పెట్టుబడిదారులతో చర్చలను ముమ్మరం చేసిన నేపథ్యంలో తాజా పెట్టుబడులను సాధించింది. అదనపు మూలధనాన్ని సమీకరించడానికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, వ్యూహాత్మక పెట్టుబడిదారులు చర్చలు జరుపుతున్నట్లు సీఈఓ రవ్నీత్ గిల్ సెప్టెంబర్ 25న ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారీగా పతనమైన యస్ బ్యాంక్ షేరు
సాక్షి,ముంబై : ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంక్‌కు ఫలితాల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో యస్ బ్యాంకు షేరు ఏకంగా 20శాతం కుప్పకూలింది. తద్వారా ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అంతేకాదు తాజా పతనంతో యస్ బ్యాంక్ మార్కెట్ కేపిటలైజేషన్(విలువ) రూ. 20,615 కోట్లకు క్షీణించింది. నిఫ్టీలో ఇదే అతి తక్కువ మార్కెట్ క్యాప్ అని గణాంకాలు ఆధారంగా తెలుస్తోంది. క్యూ1 ఫలితాలు బుధవారం ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాల్లో యస్ బ్యాంక్ నికర లాభం 91 శాతం క్షీణించి రూ. 114 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) మాత్రం 3 శాతం పుంజుకుని రూ. 2281 కోట్లను తాకింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.22 శాతం నుంచి 5.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 1.86 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగాయి. ఇక నికర వడ్డీ మార్జిన్లు 3.1 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడిన సంగతి తెలిసిందే. బుధవారం యస్ బ్యాంక్ షేరు ఆరంభంలో భారీగా పుంజుకున్నా.. ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. -
ఎస్ బ్యాంకు టాప్ టెన్ నుంచి ఔట్
సాక్షి, ముంబై : ప్రయివేటు రంగ బ్యాంకు ఎస్బ్యాంకును కష్టాలు వీడడం లేదు. ఇటీవల తీవ్ర నష్టాలతో కుదైలైన ఎస్‌బ్యాంక్‌నకు తాజాగా రేటింగ్‌షాక్ తగిలింది. బ్రోకింగ్ సంస్థ యూబీఎస్ ఇండియా ఎస్‌బ్యాంకు ర్యాంకింగ్ 47 శాతం డౌన్ గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన రూ. 170 ను రూ. 90కు కుదించి సెల్ రేటింగ్ ఇచ్చింది. దీంతో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. గురువారం దాదాపు 13శాతం నష్టాలతో కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పనితీరు మరింత నీరసించవచ్చని, బ్యాంకు ఆదాయాలు తగ్గిపోనున్నాయని యూబీఎస్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరులో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఎస్‌బ్యాంకు దేశంలోని 10 అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో స్థానం కోల్పోయింది. దాదాపు 20 బ్రోకరేజ్ సంస్థ ఎస్‌బ్యాంకు షేరుకు సెల్ రేటింగ్ ఇచ్చాయి. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ యస్ బ్యాంక్ విదేశీ కరెన్సీ జారీ రేటింగ్‌ను బీఏ1కు సవరించింది. ఫైనాన్స్ కంపెనీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ ఒత్తిళ్ల కారణంగా బ్యాంక్ క్రెడిట్ ప్రొఫైల్ బలహీనపడవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 6.61 ట్రిలియన్లతో టాప్ టెన్ జాబితాలో టాప్‌లో ఉండగా, ఎస్బీఐ 3.05 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో రెండవ స్థానంలో, కోటక్ మహీంద్రా 2.84 ట్రిలియన్లతో మూడవ స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంక్ 2.69 ట్రిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ (2.14 ట్రిలియన్లు) ఇండస్ఇండ్ బ్యాంక్ (రూ.87,540 కోట్లు) బంధన్ బ్యాంక్ (రూ. 64,808 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బ్యాంకు (రూ.40,420కోట్లు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 34093 కోట్ల) తరువాతి స్థానాల్లో నిలిచాయి. కాగా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు చేపడుతున్న నేపథ్యంలో ఇటీవల బ్యాంక్ బోర్డు నుంచి నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముకేష్ సబర్వాల్, నాన్‌ఎగ్జిక్యూటివ్, నాన్‌ఇండిపెండెంట్ డైరెక్టర్ అజయ్ కుమార్ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
యస్ బ్యాంక్ మాజీ బాస్ బోనస్ వెనక్కి
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు మాజీ ఎండీ రాణా కపూర్‌కు చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్‌లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. బోనస్ కింద 2014–15లో రూ. 62.17 లక్షలు, 2015–16లో చెల్లించిన రూ. 82.45 లక్షల మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు వెనక్కి తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు గాను కపూర్‌కు బోనస్‌లేమీ చెల్లించలేదని పేర్కొంది. 2004లో ప్రారంభమైన యస్ బ్యాంక్ వ్యవస్థాపకుల్లో కపూర్ కూడా ఒకరు. ఆయనకు ఇప్పటికీ బ్యాంకులో 4.32 శాతం వాటా కూడా ఉంది. నిబంధనల అమలుపరమైన వివాదాల కారణంగా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు ఆర్బీఐ నిరాకరించడంతో ఆయన వైదొలగాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రూ. 6 కోట్ల వార్షిక ప్యాకేజీతో రవ్నీత్ గిల్ నియమితులయ్యారు. ముందు జాగ్రత్త చర్య.. మరోవైపు, బ్యాంకు బోర్డులో రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీని అదనపు డైరెక్టరుగా ఆర్బీఐ నియమించడం ముందుజాగ్రత్త చర్యగా అనలిస్టులు అభిప్రాయపడ్డారు. గతంలో ధన్లక్ష్మి బ్యాŠంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)ల్లో కూడా ఆర్బీఐ అదనపు డైరెక్టర్లను నియమించిన సంగతి గుర్తు చేశారు. ఈ రెండింటి పరిస్థితి దారుణంగా ఉండేదని, వీటితో పోలిస్తే చాలా పెద్ద సంస్థ అయిన యస్ బ్యాంక్ విఫలమైన పక్షంలో మరిన్ని ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగానే ఆర్బీఐ వ్యవహరించి ఉంటుందని మెక్వారీ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. అటు గాంధీ నియామకం సానుకూల, నిర్మాణాత్మక చర్య గా యస్ బ్యాంక్ అభివర్ణించింది. పటిష్టమైన యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ పూర్తి స్థాయిలో తోడ్పాడు అందిస్తోందని పేర్కొంది. గాంధీ నియామకం వల్ల కార్యకలాపాలకేమీ ఆటంకాలు ఉండబోవని తెలిపింది. -
కొత్త సీఎండీ, యస్ బ్యాంకు షేరు దూకుడు
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు గాడిలో పడినట్టు కనిపిస్తోంది. అటు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు..ఇటు కొత్త సీఎండీ ప్రకటన...దీంతో యస్‌బ్యాంకు కౌంటర్లో ఉత్సాం నెలకొంది. తమ బ్యాంకు కొత్త ఎండీ, సీఈవోగా రవ్నీత్ గిల్‌ను ఎంపిక చేసినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. దీనికి ఆర్బీఐ ఆమోదం లభించిందనీ, మార్చి1 నుంచి గిల్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. గిల్ ప్రస్తుతం డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో యస్ బ్యాంకు రూ. 1001 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ. 2667 కోట్లుకాగా. రూ. 2297 కోట్లమేర స్లిప్పేజెస్ నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.6 నుంచి 2.1 శాతానికి, నికర ఎన్పీఏలు 0.86 శాతం నుంచి 1.18 శాతానికి పెరిగాయి. ఈ సందర్భంగా ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ ఎక్స్పోజర్ విలువ రూ. 2530 కోట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంకు షేరు దూసుకుపోయింది. యస్ బ్యాంకు షేరు ఇంట్రాడేలో 18 శాతంపైగా దూసుకెళ్లి రూ. 235 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 14.32 శాతం లాభంతో రూ. 225 వద్ద నిలిచింది. కాగా యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ససేమిరా అంగీకరించికపోవడంతో ఫిబ్రవరికల్లా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవలసి ఉన్న సంగతి తెలిసిందే -
ఎస్ బ్యాంకు సీఎండీ రాణా కపూర్‌కు షాక్
సాక్షి, ముంబై: ప్రముఖ ప్రయివేటు బ్యాంకు ఎస్‌బ్యాంకు సీఎండీ రాణా కపూర్‌కు ఆర్బీఐ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీవోఈ పునర్నిమాయకం చుట్టూ వివాదాలున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ఆదుశాలు జారీ చేసింది. ఎస్‌బ్యాంకు మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రాణా కపూర్ పదవీకాలం 2019 జనవరితో ముగుస్తుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అంతేకాదు ఈ లోపు కొత్త సీఎండీని ఎంపిక చేసుకోవాల్సిందిగా ఎస్‌బ్యాంకుకు సూచించింది. ఈ విషయంలో మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు యస్ బ్యాంక్ బోర్డు వచ్చే వారం సమావేశమవుతుంది. ఆగస్టు 31తో రాణా కపూర్ పదవీకాలం ముగిసింది. అయితే ఎస్ బ్యాంకు ప్రకటించినట్టుగా మూడేళ్లపాటుకాకుండా ఆర్బీఐ ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది జనవరి చివరి వరకు మాత్రమే బ్యాంకు సీఎండీగా కొనసాగుతారు. సెప్టెంబరు 17న ఆర్బీఐ రాసిన లేఖ ఈ రోజు తమకు చేరిందని ఎస్ బ్యాంకు ధృవీకరించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 25న బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశా నిర్వహించనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా రాణా కపూర్ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆర్బీఐ అనుమతి లభించినట్టు ఎస్ బ్యాంకు ఇటీవల(ఆగస్టు 30, 2018) ప్రకటించింది. తదుపరి నోటీస్ ఇచ్చేటంతవరకూ రాణా కపూర్‌ను సీఈవో, ఎండీగా కొనసాగుతారని స్టాక్‌ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు ఈ ఏడాది జూన్‌లో ఎస్ బ్యాంక్ వాటాదారులు మరో మూడేళ్లపాటు కపూర్ పదవిలో కొనసాగేందుకు అనుమతించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రేపటి (గురువారం)మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎలాంటి స్పందిస్తారో చూడాలి. -
బ్యాంకు సీఈవోకు ఎక్స్టెన్షన్ : షేరు ఢమాల్
సాక్షి, ముంబై: ప్రముఖ ప్రయివేటు బ్యాంకు ఎస్ బ్యాంకు షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది. శుక్రవారం 7శాతం వరకూ నష్టపోయి 8వారాల కనిష్టానికి చేరుకుంది. సీఈవో రాణా కపూర్ పదవిలో కొనసాగేందుకు ఆర్బీఐ ప్రస్తుతానికి అనుమతించినట్లు వార్తలు వెలువడినప్పటికీ ఎస్‌బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకోవడం గమనార్హం. ఆరంభంలోనే 5శాతం నష్టంతో టాప్ విన్నర్‌గా నిలిచింది. అమ్మకాలు మరింత పెరగడంతో ఎస్‌బ్యాంకు షేరు 7శాతం వరకూ రూ.338.00ల స్థాయికి పతనమైంది. అనంతరం కొద్దిగా కోలుకుని 6శాతం నష్టాలకు పరిమితమైంది. ముఖ్యంగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా రాణా కపూర్ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆర్బీఐ అనుమతి లభించినట్టు ఎస్ బ్యాంకు తెలిపింది. తదుపరి నోటీస్ ఇచ్చేటంతవరకూ రాణా కపూర్‌ను సీఈవో, ఎండీగా కొనసాగనున్నారని గురువారం మార్కెట్ ముగింపు అనంతరం స్టాక్‌ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అయితే విశ్లేషకులు మాత్రం సీవోఈ పునర్నిమాయకం చుట్టూ వివాదాలున్నట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎస్ బ్యాంకు వ్యవస్థాపక సీఈవోగా రాణా కపూర్ 2004 నుంచీ కొనసాగుతున్నారు. సీఈవోగా ఆయన పదవీ కాలం నేటితో(ఆగస్టు 31) ముగియనుంది. ఈ ఏడాది జూన్‌లో యస్ బ్యాంక్ వాటాదారులు మరో మూడేళ్లపాటు కపూర్ పదవిలో కొనసాగేందుకు అనుమతించారు. -
బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ
దేశీ బ్యాంకింగ్ రంగానికి ఊపునిస్తూ కొటక్ మహీంద్రా, ఐఎన్జీ వైశ్యా మధ్య జరిగిన విలీన ఒప్పందం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చింది. మరోవైపు చైనాసహా, యూరోపియన్ దేశాలు నామమాత్ర వడ్డీ రేట్లకే కట్టుబడటంతోపాటు సహాయక ప్యాకేజీలకు తెరలేపడం సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. దీంతో మరిన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశముంటుందన్న అంచనాలు దేశీ స్టాక్ మార్కెట్లను మళ్లీ కొత్త రికార్డులవైపు పరుగు పెట్టించాయి. వెరసి 75 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 8,477 వద్ద నిలవగా, సెన్సెక్స్ 267 పాయింట్లు జంప్‌చేసి 28,335 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ గరిష్టంగా 28,361కు చేరగా, నిఫ్టీ 8,490ను తాకింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ 8,500, సెన్సెక్స్ 28,500 పాయింట్ల మైలురాళ్ల సమీపానికి చేరాయి. బీఎస్ఈలో బ్యాంకింగ్ రంగం అత్యధికంగా 2.5% ఎగసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు తెరలేపుతుందన్న అంచనాలు కూడా కొనుగోళ్లకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరిన్ని విశేషాలివీ.... ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ను విలీనం చేసుకోనున్న కొటక్ మహీంద్రా షేరు మరోసారి 4% పుంజుకోవడం ద్వారా రూ. 1,200 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9% జంప్‌చేసి రూ. 1,261కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, యాక్సి స్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంక్ 1.5-4% మధ్య పురోగమించాయి. ఈ బాటలో సౌత్ ఇండియా బ్యాంక్, కర్టాటక బ్యాంక్, యస్ బ్యాంక్ సైతం 5.5-4% మధ్య ఎగశాయి. గతంలో నిలిపివేసిన కేటాయింపులను విడుదల చేసేందుకు రైల్వే బోర్డు నిర్ణయించడంతో రైలు షేర్లు లాభాల పరుగందుకున్నాయి. సిమ్కో 20%, టిటాగఢ్ వ్యాగన్స్ 11%, టెక్స్మాకో 5%, కాళిందీ రైల్ 4% చొప్పున దూసుకెళ్లాయి. మరిన్ని విలీనాలకు అవకాశముందన్న అంచనాలతో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ షేర్లు పుంజుకుంటే, అవసరమైనమేర పెట్టుబడులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించడంతో ప్రభుత్వ బ్యాంకింగ్ షేర్లు పురోగమించాయి. ఇక ఎఫ్ఐఐల తాజా పెట్టుబడులకు ఆర్బీఐ అనుమతించడంతో యస్ బ్యాంక్ షేరు ఊపందుకోగా, రూ. 10 ముఖవిలువగల షేరుని రూ. 2 ముఖ విలుగల 5 షేర్లుగా విభజించేందుకు డిసెంబర్ 5ను రికార్డు డేట్‌గా ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంక్ జంప్ చేసింది. యస్ బ్యాంక్‌లో పరిమితికంటే దిగువకు ఎఫ్ఐఐల పెట్టుబడులు చేరుకోవడంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. స్పైస్‌జెట్ షేరు జూమ్ స్పైస్‌జెట్‌లో ప్రమోటర్లకున్న వాటాను పూర్తిగా లేదా కొంతమేర విక్రయించనున్నట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కంపెనీలో సన్ గ్రూప్‌నకు 53.4% వాటా ఉంది. అయితే స్పైస్‌జెట్ ప్రమోటర్ కళానిధి మారన్ ఎంతమేర వాటా విక్రయించేదీ స్పష్టంకాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు 15% జంప్‌చేసింది.