రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం మరో రెండు ఏనుగులు మరణించగా అందులో ఒకటి గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. వారం నుంచి వరుసగా ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఏనుగు మరణాల సంఖ్య ఐదుకి చేరింది. ధంతారి, రాయ్‌గఢ్ జిల్లాల్లో తాజాగా రెండు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదుచేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. చనిపోయిన ఏనుగుల్లో ఒకటి మూడేళ్ల వయసుందని, విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. వ్యవసాయ భూమిలో అమర్చిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయిందని తెలిపారు. మరో ఘటనలో రాయ్‌పూర్‌కు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధంతారి జిల్లాలో నీళ్లు తాగేందుకు వెళ్లి చిత్తడి నేలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ చెప్పారు.
ఇంతకుముందు సూరజ్‌పూర్ జిల్లాలోని అటవీ ప్రాంత పరిధిలో రెండు ఏనుగుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజులుగా మరణించిన వాటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉండటం గమనార్హం. ఇక ఇటీవల మరణించిన మూడు ఏనుగుల మరణాలు ఒకే మాదిరిగా ఉండటం, వీటి మరణాలు సాధారణం కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. (‘కరోనాను దీటుగా ఎదుర్కొంటున్నాం’)
ఏనుగుల మరణాలపై దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. అధికారుల నిర్లక్ష్యంగానే వరుస ఘటనలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు చెందిన నలుగురు అధికారులను ఇటీవల సస్పెండ్ చేసింది. వారం రోజులుగా ఛత్తీస్‌గడ్‌లో వరుస ఉదంతాలు, కేరళలో ఏనుగు మృతిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని మంగళవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ (ఫియాపో), మరో ఎనిమిది ప్రముఖ జంతు హక్కుల సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి లేఖ సమర్పించాయి. (కోవిడ్-19 ఆస్పత్రిగా ఫైవ్‌స్టార్ హోటల్)
Comments
Please login to add a commentAdd a comment