elephants kill
-
గజ విషాదం.. మూడు నెలల్లో పది ఏనుగులు మృతి
సాక్షి, బెంగళూరు: ఆహారం కోసం వచ్చిన ఏనుగులు కాఫీతోటల్లో ఏర్పాటు చేసిన కరెంట్ తీగ తగిలి మృతి చెందిన ఘటన కొడగు జిల్లా సిద్దాపుర సమీపంలో చోటుచేసుకుంది. తాలూకాలోని నెల్యహుదికేరి గ్రామానికి చెందిన కాఫీ రైతులు ప్రకాశ్ మందణ్ణ, మండపండ సుమంత్ చెంగప్పలు పంట రక్షణ కోసం తోటల చుట్టూ ఫెన్సింగ్ నిర్మించి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఆదివారం రాత్రి ఆహారం కోసం వచ్చిన ఏనుగులు తోటల్లోకి వెళ్లే ప్రయత్నంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే రెండు ఏనుగులు మృతి చెందాయి. మగ, ఆడ ఏనుగులుగా గుర్తించారు. ఇలా మూడు నెలల వ్యవధిలో పది ఏనుగులు బలయ్యాయి. -
దంతాలు కోసుకెళ్లి.. ఏనుగును చంపి దహనం చేశారు...
సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా వాల్పారై వరట్టు పారై అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఏనుగును హతమార్చారు. దంతాల్ని కోసి తీసుకెళ్లారు. ఎవరూ గుర్తు పట్టకుండా దహనం కూడా చేశారు. కోయంబత్తూరు జిల్లా వాల్పారై వరట్టు పారై ఎస్టేట్ కారి్మకులు అడవుల్లో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లారు. సేలయార్ డ్యాంపై భాగంలో సురక్షిత ప్రాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్లారు. కట్టెలు కొట్టుకుని తిరుగుపయనంలో ఉండగా దుర్వాసన రావడాన్ని గుర్తించారు. ఓ చోట ఏనుగు దహనం చేసిన స్థితిలో పడి ఉండడంతో అటవీశాఖ అధికారి జయచంద్రన్కు సమాచారం అందించారు. ఆయన నేతృత్వంలోని బృందం, వైద్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏనుగును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చి, ఆ దంతాలను కోసుకెళ్లి ఉండడం వెలుగు చూసింది. ఆధారాల్ని చెరిపేందుకు ఆ పరిసరాల్లో రసాయనం సైతం పోసి ఉండడం బయటపడింది. ఏనుగును దహనం చేసి ఉండడంతో, 90 శాతం మేరకు గుర్తు పట్టలేని పరిస్థితి. దీంతో అక్కడున్న రసాయనాలు, ఏనుగు మృతదేహంలోని కొంతభాగాన్ని పరిశోధనకు తరలించారు. ఈ కిరాతకానికి పాల్పడ్డ వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. చదవండి: జనారణ్యంలోకి ఏనుగులు రాకుండా నియంత్రణ -
ఆరేళ్లలో 471 ఏనుగులు మృతి
సాక్షి, బెంగళూరు: తమిళనాడులోని మదుమలైలో ఏనుగుకు నిప్పు పెట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా గజరాజులకు ప్రాణాపాయం పొంచి ఉందన్న చర్చ మొదలైంది. గజరాజులకు పుట్టినిల్లు వంటి కర్ణాటక వ్యాప్తంగా ఆరేళ్ల కాలంలో సుమారు 78 ఏనుగులు మానవుల అకృత్యాలకు బలి అయినట్లు తెలుస్తోంది. ఇందులో క్రిమిసంహార మందు పెట్టడం, కరెంటు షాక్‌లు, తుపాకులతో కాల్చడం వంటి ఘటనలు ఉన్నాయి. ఆరేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 471 ఏనుగులు మరణించగా, అందులో 393 సహజ మరణాలు, 78 అసహజ మరణాలుగా గుర్తించారు. పంటలపై ఏనుగులు దాడి చేస్తున్నాయని రైతులు వాటిని హతమార్చడానికి కూడా వెనుకాడడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో.. అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చిన ఏనుగులు, మంద నుంచి విడిపోయిన ఏనుగులు దారి తప్పి జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాల్లో ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. కొన్నిసార్లు రైలుపట్టాలపై రైళ్లు తగిలి చనిపోతున్నాయి. సహజ మరణాలకు ఏనుగుల మధ్య గొడవలు, సంగమ సమయంలో ఆడవాటిపై మగ ఏనుగుల దౌర్జన్యం, వృద్ధాప్యం వంటివి ప్రధాన కారణాలు. కర్ణాటకలో ఆరేళ్లలో ఏనుగుల మరణాలు 2014–15 మధ్య కాలంలో 77 ఏనుగులు సహజంగా మరణించగా.. మరో 18 మానవ తప్పిదాలకు బలి అయ్యాయి. 2015–16 కాలంలో 59 ఏనుగులు మరణించగా.. మరో 15 అసహజ మరణాలుగా నమోదు చేశారు. 2016–17 మధ్య కాలంలో 90 ఏనుగులు సహజంగా మరణించగా.. మరో 10 మానవ అకృత్యాలకు బలి అయ్యాయి. 2017–18 మధ్యలో 67 ఏనుగులు సాధారణంగా మరణించాయి. మరో 11 ఏనుగులు అసహజంగా చనిపోయాయి. 2018–19 మధ్య కాలంలో 59 ఏనుగులు సహజంగా.. 15 ఏనుగులు అసహజరంగా మరణించాయి. 2019–20 కాలంలో 41 ఏనుగులు మామూలుగా మరణించాయి. మరో 9 ఏనుగులు ఇతర కారణాలతో ప్రాణాలు వదిలాయి. విద్యుత్ కంచెలతో ముప్పు రైతులు పంటలను కాపాడుకోవాలని పొలాలు, తోటల్లో విద్యుత్ కంచెలు వేస్తున్నారు. అవి అవి తగిలి ఏనుగులు మరణిస్తున్నాయి. విద్యుత్ షాక్, తూటాల దెబ్బకు ప్రతి ఏటా సరాసరి 12 ఏనుగులు నేలకొరుగుతున్నాయి. కాల్పుల్లో చనిపోతేనే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇతర మరణాలను పట్టించుకోవడం లేదు. కాల్పుల కేసుల్లో కూడా దుండగులకు శిక్ష పడిన దాఖలాలు లేవు. -
ఛత్తీస్‌గడ్‌లో మరో రెండు ఏనుగులు మృతి
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం మరో రెండు ఏనుగులు మరణించగా అందులో ఒకటి గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. వారం నుంచి వరుసగా ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఏనుగు మరణాల సంఖ్య ఐదుకి చేరింది. ధంతారి, రాయ్‌గఢ్ జిల్లాల్లో తాజాగా రెండు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదుచేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. చనిపోయిన ఏనుగుల్లో ఒకటి మూడేళ్ల వయసుందని, విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. వ్యవసాయ భూమిలో అమర్చిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయిందని తెలిపారు. మరో ఘటనలో రాయ్‌పూర్‌కు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధంతారి జిల్లాలో నీళ్లు తాగేందుకు వెళ్లి చిత్తడి నేలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ చెప్పారు. ఇంతకుముందు సూరజ్‌పూర్ జిల్లాలోని అటవీ ప్రాంత పరిధిలో రెండు ఏనుగుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజులుగా మరణించిన వాటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉండటం గమనార్హం. ఇక ఇటీవల మరణించిన మూడు ఏనుగుల మరణాలు ఒకే మాదిరిగా ఉండటం, వీటి మరణాలు సాధారణం కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. (‘కరోనాను దీటుగా ఎదుర్కొంటున్నాం’) ఏనుగుల మరణాలపై దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. అధికారుల నిర్లక్ష్యంగానే వరుస ఘటనలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు చెందిన నలుగురు అధికారులను ఇటీవల సస్పెండ్ చేసింది. వారం రోజులుగా ఛత్తీస్‌గడ్‌లో వరుస ఉదంతాలు, కేరళలో ఏనుగు మృతిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని మంగళవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ (ఫియాపో), మరో ఎనిమిది ప్రముఖ జంతు హక్కుల సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి లేఖ సమర్పించాయి. (కోవిడ్-19 ఆస్పత్రిగా ఫైవ్‌స్టార్ హోటల్) -
మూడ్రోజుల్లో మూడు ఏనుగులు మృతి
బలరాంపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా డివిజన్ అడవిలో గురువారం మరో ఏనుగు విగత జీవిగా మారింది. మంగళ, బుధవారాల్లో రెండు ఏనుగులు మరణించాయి. వీటిలో ఒకటి గర్భంతో ఉంది. ఈ రెండూ సూరజ్ పూర్ జిల్లాలోని ప్రతాప్పూర్ ఫారెస్ట్ రేంజ్లో కనిపించాయి. మరణించిన మూడూ ఆడ ఏనుగులే కావడం గమనార్హం. అన్నింటి మరణం ఒకేలా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే అది సాధారణం కాదని, విషం వల్ల మరణించి ఉండవచ్చని చెబుతున్నారు. మహువా పూలను అధికంగా తినడంగానీ లేదా యూరియా మందును తిని ఉండవచ్చని భావిస్తున్నారు. ఏనుగుల మీద ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. విషప్రయోగం జరిగిందేమో తెలుసుకోవ డానికి అడవిలోని నీటిని పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గజరాజుకు పరీక్ష రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఏనుగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం -
ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబ్
కొచ్చీ: మనుషుల్లోని క్రూరత్వానికి అద్దం పట్టే సంఘటన కేరళలో జరిగింది. టపాకాయల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ను తినిపించడంతో గర్భంతో ఉన్న ఓ ఏనుగు మృతి చెందింది. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కులోని వెల్లియార్ నది వద్ద మే 27వ తేదీన జరిగిన ఈ దారుణం పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని దుండగుడు ఇచ్చిన పైనాపిల్ ఏనుగు గొంతులో పేలిపోయింది. అడవుల్లో ఏనుగులను వేటాడే ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని మోహన్ కృష్ణన్ అనే అటవీ అధికారి వెలుగులోకి తీసుకొచ్చారు. గర్భిణి ఏనుగు మరణించిన తీరును, ఫొటోలను ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఏనుగు తల నీటిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. మూగ జీవాన్ని రాక్షసంగా చంపేసిన దుండగుడిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. -
ప్రమాదవశాత్తు జలపాతంలో పడి..
బ్యాంకాక్: ప్రమాదవశాత్తు జలపాతంలో పడి నాలుగు అడవి గున్న ఏనుగులు మృతి చెందిన ఘటన థాయ్‌లాండ్‌లోని ఖావో యై జాతీయ పార్కులో చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా పార్క్‌లో ఉన్న జలపాతానికి వరద నీరు పెరిగింది. ఈ నీటిలో మొత్తం ఆరు ఏనుగులు చిక్కుకున్నాయి. అందులో నాలుగు ఏనుగులు ప్రవాహంలో కొట్టుకుపోతూ రాళ్లను ఢీకొని మృతి చెందాయి. మృతి చెందిన ఓ గున్న ఏనుగును చేరుకొనేందుకు మిగిలిన రెండు ఏనుగులు ప్రయత్నించసాగాయి. దీన్ని గుర్తించిన పార్క్ అధికారులు లోయలో నుంచి వాటిని రక్షించారు. నీటి ప్రవాహానికి ఎదురు వెళ్లిన గున్న ఏనుగులు తీవ్రంగా అలసిపోయాయని, ప్రస్తుతం అవి విశ్రాంతి తీసుకుంటున్నాయని పార్కు అధికారులు తెలిపారు. మరో వారం పాటు వాటి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తామని తెలిపారు. ఏనుగులను రక్షించే సమయంలో పర్యాటకులను జలపాతం వద్దకు అనుమతించలేదు. -
మనిషిని తొక్కి చంపిన ఏనుగుల గుంపు
త్రిపురలో ఒక ఏనుగుల గుంపు ఓ వ్యక్తిపై దాడిచేసి, తొక్కి చంపేసింది. భూపేంద్ర దేవ్ వర్మ (32) అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి వెదురు తెచ్చుకోడానికి అడవిలోకి వెళ్లాడు. ఉన్నట్టుండి అడవి ఏడుగుల గుంపు అక్కడికొచ్చి వారిద్దరిపై దాడి చేసిందని, వారిలో భూపేంద్ర అక్కడికక్కడే మరణించాడని ఖోవై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సమిత్ రాయ్ చౌధురి విలేకరులకు తెలిపారు. అతడితో పాటు ఉన్న స్నేహితుడు ఎలాగోలా తప్పించుకోగలిగాడు. పశ్చిమ త్రిపురలోని గోడైబరి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మృతుడి కుటుంబానికి జిల్లా యంత్రాంగం ఆర్థిక సాయం ప్రకటించింది.