
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పిస్తూ రైతులు, వలసకూలీలు, చిరువ్యాపారులు సహా పలువురిని ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌పై కాంగ్రెస్ పెదవివిరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 లక్షల కోట్లు కాకుండా కేవలం రూ 3.22 లక్షల కోట్ల ప్యాకేజ్‌నే ప్రభుత్వం ప్రకటించిందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రూ. 3.22 లక్షల కోట్ల ప్యాకేజ్ జీడీపీలో కేవలం 1.6 శాతమేనని, ప్రధాని ప్రకటించిన తరహాలో 10 శాతం కాదని అన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపించాలని తాను ఆర్థిక మంత్రి, ప్రధానికి సవాల్ విసురుతున్నానని చెప్పారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
ఆర్థిక ప్యాకేజ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను తప్పుదారిమళ్లించిందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మాట్లాడాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. వలస కూలీల ప్రాథమిక హక్కులను కాలరాసినందుకు ప్రభుత్వం వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్ అమలు చేయడంతో వలస కూలీలు రోడ్లపై దయనీయస్ధితిలో నడిచివెళ్లేలా చేశారని, వారి దుస్థితిపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. ఢిల్లీలో వలస కూలీలతో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ మాట్లాడటాన్ని నిర్మలా సీతారామన్ డ్రామాగా కొట్టిపారవేయడంపై ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment