తిరుపతి ఎయిర్‌పోర్టులో మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ బలగాలు
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రమం.. మంగళవారం ఉదయం 9గంటలు.. భద్రతాదళాలు ఆందోళనగా అటూ ఇటూ పరుగెడుతున్నాయి..ఏం జరుగుతుందో తెలియడం లేదు. నిశితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులంతా ఊపిరి బిగపట్టి కూర్చున్నారు. ఏదో విపత్తు జరిగిందని అక్కడ ఉత్కంఠ వాతావరణాన్ని చూస్తున్న వారంతా భావిస్తున్నారు. చివరకు మాక్‌డ్రిల్ అని తెలిశాక ఊపిరిపీల్చుకున్నారు.
రేణిగుంట: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రమంలో పెనుముప్పు సంభవించిన యుద్ధ వాతావరణం మంగళవారం కనిపించింది. కేంద్ర భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు ప్రాంగణా న్నంతా చుట్టుముట్టి విమానాశ్రయంలోకి వెళ్లే ప్రయాణికులను, సిబ్బందిని బయటకు పంపేశారు. దీంతో ప్రయాణికులు ఒకింత భయాందోళనకు లోనయ్యారు. విమానాశ్రయంలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎయిర్‌పోర్టులో ఏదో విపత్తు నెలకొం దని సగటు ప్రయాణికులు భావించారు.
అదంతా ఎయిర్‌పోర్టులో అప్పుడప్పుడూ జరిగే మాక్ డ్రిల్‌లో భాగమని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నా రు. వివరాల్లోకి వెళితే.. ఎయిర్‌పోర్టు సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మనీష్‌కుమార్ నేతృత్వంలో మంగళవారం ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులను ఉగ్రవాదుల చెర నుంచి, విపత్తుల నుంచి రక్షించే విధానాన్ని సిబ్బందికి అవగాహన నిమిత్తం ముందస్తుగా పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందితో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. విమానాశ్రయ ఉన్నతాధికారులకు అసలు విషయం తెలిసినా కిందిస్థాయి సిబ్బందికి గానీ, ప్రయాణికులకు గానీ తెలియకుండా గోప్యత పాటించారు. దీంతో సుమారు గంటకు పైగా ఎయిర్‌పోర్టులో హై అలెర్ట్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment