చీరాల రూరల్: భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్‌చార్జిగా పనిచేస్తున్న కొప్పోలు సత్యనారాయణ (58) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం ఉదయం వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ సంపత్ నగర్‌లో జరిగింది. మృతుడి సోదరుడు శివరామ కృష్ణయ్య పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు కావడంతో ఒకరు హైదరాబాద్, మరొకరు బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే పెద్ద కొడుకు ఉషాకిరణ్ భార్యకు అనారోగ్యంగా ఉండటంతో పరామర్శించేందుకు సత్యనారాయణ భార్య పద్మావతి ఆదివారం హైదరాబాద్ వెళ్లింది. ఈ క్రమంలో ఇంటి వద్ద ఒక్కడే ఉంటున్న సత్యనారాయణ ఇంటి పంచలో ఇనుప రాడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ రామారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు.
మధ్యవర్తిగా ఉండటమే కారణమా?
సాంబశివరావు అనే వ్యక్తికి గురునాథం అనే వ్యక్తి రూ.14 లక్షలు అప్పు ఇచ్చాడు. ఇందుకు సత్యనారాయణ మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అప్పు తీర్పించాలని ఆయనపై ఒత్తిడి పెరిగింది. బుధవారం తన సత్యనారాయణ తన తమ్ముడు శివరామ కృష్ణయ్య ఇంటికి వెళ్లాడు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడ్డాడు. తన ద్వారా డబ్బులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తున్నారని బాధపడ్డాడు. మధ్యవర్తిగా ఉండటం తనకు ఇబ్బందిగా ఉందని తమ్ముడి వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. సత్యనారాయణ తన ఇంటి వద్దే చీపుర్లు తయారు చేసే స్మాల్ స్కేల్ ఇండస్త్రీతో పాటు డ్రైక్లీనింగ్ షాపు కూడా నడుపుతుంటాడు. భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచామని, వారు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. బీజేపీ నాయకులు నివాళులర్పించారు.
ఉరేసుకుని బీజేపీ నేత ఆత్మహత్య
Published Sat, Sep 23 2017 3:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM
Advertisement