
ఇబ్రహీంపట్నం: టీఆర్‌ఎస్ నాయకుడి వాహనంలో తరలిస్తున్న రూ.27.35 లక్షల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్‌ఎస్‌టీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో సోమవారం వాహనాలు తనీఖీ చేస్తుండగా నగదు తరలిస్తున్న విషయం బయటపడింది. రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వివరాల మేరకు.. యాచారం నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్న ఫార్చునర్ (టీఎస్ 09 ఈటీ 1135) వాహనాన్ని తనిఖీ చేయగా అందులో డబ్బుల సంచి గుర్తించారు. సంచిలోని సొమ్మును లెక్కించగా రూ.27.35 లక్షలున్నట్లు తేలింది.
ఆ వాహనంలో ప్రయాణిస్తున్న టీఆర్‌ఎస్ నాయకుడు, ఆదిభట్ల మాజీ ఉప సర్పంచ్ పల్లె గోపాల్‌ను విచారించి వదిలేశారు. పట్టుబడిన డబ్బులను ట్రెజరీలో డిపాజిట్ చేసి, జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చినట్లు ఆర్డీవో చెప్పారు. ఈ డబ్బులు సక్రమమా లేక అక్రమమా అనేది ఐటీ అధికారులు తేల్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఐటీ అధికారులకు సమాచారం ఇస్తారని వెల్లడించారు.
భూ రిజిస్ట్రేషన్ కోసం తీసుకెళ్తున్నా
చింతపల్లి మండలం పోలేపల్లి వద్ద 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు తీసుకెళ్లగా.. భూ యజమాని అనారోగ్యానికి గురికావడంతో రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. దీంతో డబ్బులతో తిరిగి వస్తుండగా అధికారులు పట్టుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ నుంచి ఇటీవలే ఈ డబ్బులు డ్రా చేశాను. ఈ డబ్బులకు సంబంధించి ఐటీ రికార్డులు సక్రమంగానే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment