సతీశ్ పాండే(పాత ఫొటో), అరెస్టు వివరాలను మీడియాకు చెబుతున్న ఛాత్రా ఎస్పీ
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. సిట్ ఆధికారుల బృందం చేపట్టిన దర్యాప్తులో అనేకానేక విషయాలు బయటపడుతున్నాయి. లీకేజీలో కీలక సూత్రధారులుగా భావిస్తోన్న వ్యక్తులంతా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో కీలక నేతలు కావడం విమర్శలకు దారితీసింది.
పదో తరగతి మ్యాథ్స్ పేపర్ లీకేజీలో ప్రధాన ముద్దాయిగా అనుమానిస్తున్న సతీశ్ పాండేను ఇప్పటికే జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జత్రాహిబాగ్(జార్ఖండ్)లో‘స్టడీ విజన్’ పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తోన్న పాండే.. ఛాత్రా జిల్లా ఏబీవీపీ అధ్యక్షుడు కూడా. ఇటు ప్రభుత్వానికి, సీబీఎస్‌ఈ బోర్డుకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో ఏబీవీపీ పాలుపంచుకోవడంపైనా మిగతా విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు షైలా రషీద్ శనివారం ఈ మేరకు చేసిన వరుస ట్వీట్లు వైరల్ అయ్యాయి. ‘‘మీరే లీకేజీలు చేస్తూ, తప్పును కప్పిపుచ్చుకోవడానికి మీరే ఆందోళనలకు నాయకత్వం వహించడం ఎంత దారుణం..’ అని షైలా మండిపడ్డారు. అటు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు కూడా సతీశ్ పాండే ఫొటోలను సర్క్యులేట్‌చేస్తూ ఏబీవీపీ, దాని మాతృసంస్థ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది.
12వ తరగతి ఎకనామిక్స్‌కు 25న రీ ఎగ్జామ్: పేపర్ లీకేజీ నేపథ్యంలో 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని చెప్పిన సీబీఎస్‌ఈ బోర్డు.. ఆ తేదిని ఏప్రిల్ 25గా పేర్కొంది. అయితే 10వ తరగతి మ్యాథ్స్ రీ ఎగ్జామ్ తీదీలపై ఇంకా స్పష్టత రాలేదు. కేవలం ఢిల్లీ, హరియాణాలో మాత్రమే టెన్త్ మ్యాథ్స్ రీ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉండొచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అనిల్ స్వరూప్ శనివారం మీడియాతో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment