
చిరంజీవి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ ఖాతాదారులు 19.78 లక్షలు, ఏజెంట్లు 3.7 లక్షల మంది ఉన్నారు. మన జిల్లాలో 1.76 లక్షల మంది ఖాతా దారులు, 4వేల మంది ఏజెంట్లు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద దాదాపు రూ.3870 కోట్ల అగ్రిగోల్డ్ బకాయిలుండగా, మన జిల్లాకే సుమారు రూ.400 కోట్లు రావాల్సి ఉంది. వీటికోసం రకరకాలుగా పోరాడుతున్నా సర్కారు సరిగ్గా స్పందించక తమ డబ్బు వస్తుందో... రాదోనన్న అయోమయంలో బాధితులున్నారు.
గరివిడి మండలం గెడ్డపువలస గ్రామానికి చెందిన తుమ్మగంటి చిరంజీవి(33) ఎనిమిదేళ్లుగాఅగ్రిగోల్డ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన నేతృత్వంలో సుమారు 50 మంది ఏజెంట్లు ఉండేవారు. వీరంతా కలిసి రూ.10 కోట్ల మేర డిపాజిట్లను ఖాతాదారుల నుంచి వసూలు చేసి సంస్థకు చెల్లించారు. చిరంజీవి వ్యక్తిగతంగా రూ.కోటి కట్టించారని కుటుంబ సభ్యులు అంటున్నారు. అనూహ్యంగా సంస్థ బోర్డు తిప్పేసింది. ఖాతాదారుల నుంచి ఏజెంట్లపై ఒత్తిడి పెరిగింది.
దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వం కల్పించుకుని న్యాయం చేస్తామంటూ కాలం నెట్టుకొస్తోంది. ఇటీవలే ఖాతాదారుల వివరాలను పోలీస్ స్టేషన్లలో అధికారులు నమోదు చేయించారు. ఆ తర్వాత మళ్లీ ఈ అంశంపై ఒక్క అడుగైనా పడలేదు. ఈ క్రమంలో ఖాతాదారుల నుంచి చిరంజీవికి మళ్లీ ఒత్తిడి మొదలైంది. నెల రోజులుగా అది మరింత తీవ్రమైంది. దీంతో శుక్రవారం ఉదయం చిరంజీవికి గుండెపోటు వచ్చింది.
కుటుంబసభ్యులు నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. చిరంజీవికి భార్య శైలజతో పాటు ఎనిమిదేళ్ల కుమార్తె అమృత, నాలుగేళ్ల కుమారుడు ఆకాశ్, తల్లి అచ్చియమ్మ ఉన్నారు. చిరంజీవిలా రాష్ట్రంలో దాదాపు 180 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో 102 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. జిల్లాలో చిరంజీవితో కలిపి 19 మంది మరణించగా ఇప్పటి వరకూ 8 మందికి పరిహారం ఇచ్చారు. చిరంజీవి కుటుంబానికి కూడా ప్రభుత్వం రూ.5లక్షలు పరిహారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment