నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును కోర్టుకు తీసుకొస్తున్న పోలీసులు
విశాఖ లీగల్/ విశాఖ క్రైం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు జ్యూడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజులపాటు పొడిగిస్తూ విశాఖ మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతపై గత నెల 25న జరిగిన హత్యాయత్నం కేసులో అరెస్టయిన శ్రీనివాసరావు రిమాండ్ గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో అతడిని శుక్రవారం మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా, డిసెంబర్ 7 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని తిరిగి సెంట్రల్ జైలుకు తరలించారు.
విచారణ పూర్తయ్యే వరకు చొక్కాను అప్పగించొద్దు
హత్యాయత్నం జరిగిన సమయంలో వైఎస్ జగన్ ధరించిన చొక్కాను కోర్టు ఆదేశాల మేరకు జగన్ తరఫు న్యాయవాది షీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. చొక్కాకు సంబంధించిన వివరాలతో మెమో కూడా ఫైల్ చేశారు. అనంతరం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసు ఇవ్వాలని జడ్జి ఆదేశించగా.. ఏపీపీ అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారి బీవీఎస్ నాగేశ్వరరావుకు కోర్టు సమక్షంలోనే నోటీసులందజేశారు.
మరోవైపు హత్యాయత్న ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఈ నెల 27న విచారణకు రానున్నందున అప్పటివరకు ఆ షర్ట్‌ను విచారణ అధికారికి గానీ, సిట్ పోలీసులకు గానీ అప్పగించొద్దని జగన్ తరఫు న్యాయవాది మెజిస్ట్రేట్‌ను కోరారు. అప్పటి వరకు కోర్టు కస్టడీలోనే ఉంచాలని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన మేజిస్ట్రేట్ రూల్ పొజిషన్ పరిశీలించి ఆర్డర్ పాస్ చేస్తామన్నారు. కోర్టులపై తమకు ప్రగాఢ విశ్వాసం ఉందని వైఎస్సార్‌సీపీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment