సాక్షి, యాదాద్రి/బొమ్మలరామారం : యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో శుక్రవారం వెలుగుచూసిన శ్రావణి హత్య ఉదంతం మరవక ముందే సోమవారం మనీషా అనే యువతి హత్యకుగురైన విషయం వెలుగులోకి వచ్చింది. హర్రర్ సినిమాను తలపించే రీతిలో ఒకే తరహాలో వెలుగుచూస్తున్న వరుస హత్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. పేద బాలికలను టార్గెట్ చేసి పథకం ప్రకారం వారిపై అత్యాచారం, హత్య చేసి పూడ్చిపెడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణి మృతదేహం లభించిన వ్యవసాయ బావిలోనే మనీషా (19) మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు భారీ పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాన్ని బావిలోంచి తీసి పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఒంటరి మహిళలే టార్గెట్: హాజీపూర్ వద్ద జరిగిన బాలిక, యువతి హత్యలు ఒకేతీరును పోలి ఉండటంతో నిందితుడు ఒక్కడే అన్న అనుమానం బలపడుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి ఈహత్యలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో పలు విషయాలు వెల్లడైనట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి లిప్టు మెకానిక్‌గా పని చేస్తుంటాడు. ఇతనిపై గతంలో ఏపీలోని కర్నూల్, వరంగల్ జిల్లాల్లో మహిళలపై అత్యాచారం, హత్య కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అలవాటు ఉన్న శ్రీనివాస్‌రెడ్డి మత్తులో నేరాలకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది. గంజాయి, కొకైన్, వైట్‌నర్ వంటి వాటిని సేవించి ఆ మత్తులో అత్యాచారాలు, హత్యలు చేసే అలవాటు ఉందని సమాచారం. ఒంటరిగా ఉన్న మహిళలు, బాలికలను టార్గెట్ చేసే శ్రీనివాస్‌రెడ్డి, హాజీపూర్ వెళ్లడానికి ఎదురుచూస్తున్న శ్రావణి, మనీషాలను తన వాహనంపై ఎక్కించుకుని తీసుకువస్తూ ఈ ఘాతుకాలకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాలికలను తన వాహనంపై తీసుకువస్తూ మధ్యలో బావిలోకి నెట్టేసి.. వారు గాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా అత్యాచారం చేసి అందులోనే పూడ్చిపెట్టడం శ్రీనివాస్‌రెడ్డి వికృత చర్యలుగా తెలుస్తోంది. అతను సైకోలా వ్యవహరించేవాడని సమాచారం. 2013లో కర్నూల్‌లో, 2014లో వరంగల్‌లో మహిళలపై అత్యాచారం, హత్య కేసులు నమోదయ్యాయి. ఇటీవల బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లిలో నిర్మానుష్యప్రాంతంలో వ్యవసాయ బావి వద్ద ఉన్న మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తే అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదినట్లు తెలుస్తోంది. ఇతని నేరప్రవృత్తిని చూసి తోటి పనివారుసైతం దూరమయ్యారని సమాచారం. మూడేళ్ల క్రితం గ్రామంనుంచి వెళ్లిపోయిన శ్రీనివాస్‌రెడ్డి ఏడాదిగా మళ్లీ గ్రామంలో ఉంటున్నాడు. శ్రావణిని వ్యవసాయ బావిలోంచి తీసిన సమయంలో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి తన తండ్రితో కలసి ప్రజల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఇదే మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన అనే బాలిక అదృశ్యం వెనుక కూడా శ్రీనివాస్‌రెడ్డి హస్తం ఉన్నదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ వ్యవసాయ బావిలో మరికొంతమంది మృతదేహాలు ఉండొచ్చని గ్రామస్థులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
విచారణలో విషయం వెల్లడి
çహాజీపూర్‌కు చెందిన బాలిక పాముల శ్రావణి హత్యకేసులో ఎస్‌ఓటీ పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో మనీషా హత్యోదంతం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన వివరాల ఆధారంగానే బావిలో పుస్తకాల బ్యాగును గుర్తించి దాని కిందనే శవాన్ని వెలికితీశారు. రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి సోమవారం ఉదయం శ్రావణి శవాన్ని తీసిన బావిలోకి దిగి మనీషాకు చెందిన పుస్తకాల బ్యాగును గుర్తించి అందులో గుర్తింపు కార్డు, బస్‌పాస్, సెల్‌ఫోన్ పౌచ్, స్కార్ప్, పెన్నులు, చెవి కమ్మలు, చెప్పులు, నోట్ పుస్తకాలపై పేరుతో మృతురాలు మనీషా అని నిర్ధారణకు వచ్చారు. అనంతరం మనీషా కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి మీ కూతురు ఇటీవల కనిపించకుండా పోయిందా అని ప్రశ్నించడంతో వారు శివరాత్రి పండుగ తర్వాత కళాశాలకు వెళ్లిన తమ కూతురు ఇంటికి తిరిగి రాలేదని చెప్పారు. ఆమె కోసం వెతుకుతున్నామని చెప్పారు. పరువు పోతుందన్న కారణంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వారు వివరించారు. పోలీసులు మృతురాలు మనీషా తండ్రి నుంచి మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఫిర్యాదు తీసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పర్యవేక్షణలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. మనీషా కనిపించకుండా పోయి 45 రోజులవడంతో ఎముకలగూడే మిగిలింది.
కళాశాలకు వెళ్తున్నా అని..
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపురానికి చెందిన తిప్రబోయిన మల్లేశ్, భారతమ్మ కుటుంబం బతుకుదెరువు కోసం హాజీపూర్‌కు 20 ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడింది. కూలీ పనులు చేసుకుంటూ జీవించే మల్లేశ్‌కు నలుగురు కుమార్తెలు. ముగ్గురి వివాహం చేశాడు. చిన్నకూతురు మనీషా మేడ్చల్ జిల్లా కీసరలో గల కేఎల్‌ఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతుంది. మార్చి 6వ తేదీన కళాశాలకు వెళ్తానని చెప్పిన ఆమె తిరిగి రాలేదు. ఆనాటి నుంచి తన కూతురు కోసం మల్లేశ్ వెతుకుతూనే ఉన్నాడు. ఈలోపు పోలీసులు వచ్చి తప్పిపోయినట్లుగా ఫిర్యాదు తీసుకోవడం.. బావిలో శవమై ఉన్నదన్న సమాచారం తెలియడంతో మల్లేశ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కుప్పకూలిపోయాడు.
నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పన
బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన నందు, భాగ్యమ్మ దంపతుల మూడో కుమార్తె కల్పన స్థానికంగా 6వ తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో 2015 ఏప్రిల్‌లో హాజీపూర్‌లో నివాసం ఉంటున్న తన మేనత్త జయమ్మ ఇంటికి వచ్చింది. అదే నెల 22వ తేదీన మధ్యాహ్న సమయంలో మేనత్త ఇంటి వద్ద నుంచి కాలినడకన స్వగ్రామానికి బయలుదేరింది. కానీ ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు బంధువుల ఇళ్లలో వెతికి మరుసటి రోజే ఫిర్యాదు చేశారు. ఇంతవరకు కల్పన ఆచూకీ కనిపెట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment