
చండీగఢ్: మోడల్, నటి ఆర్షి ఖాన్ మరోసారి చిక్కుల్లో పడింది. హిందీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్ 11’లో పోటీ పడుతున్న ఆమెకు పంజాబ్‌లోని జలంధర్ జ్యుడీషియల్ కోర్టు నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఆమెను అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. గత మూడు నెలలుగా తమ ఎదుట న్యాయ విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. భారత్-పాకిస్తాన్ దేశాల జెండాలను తన దేహంపై పెయింటింగ్ వేయించుకుని అర్ధనగ్నంగా ఫోజులివ్వడంతో ఆమెపై కేసు నమోదైంది. ఆర్షి ఖాన్ చట్టాన్ని ఉల్లంఘించారని, తమ మనోభావాలను దెబ్బతీశారని జలంధర్‌కు చెందిన న్యాయవాది ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమెకు పలుమార్లు వారెంట్ జారీచేసినా కోర్టుకు హాజరుకాలేదు.
అక్టోబర్ 1 నుంచి బిగ్‌బాస్‌లో ఉండటం వల్ల ఆర్షి ఖాన్ రాలేకపోయారని ఆమె తరపు న్యాయవాది తెలిపడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్‌హౌస్ బద్దలుకొట్టి ఆర్షి ఖాన్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే కోర్టు జారీ చేసిన వారెంట్‌పై జనవరి 15 వరకు స్టే తెచ్చుకున్నామని ఆర్షి ఖాన్ తరపు ప్రతినిధి వెల్లడించారు. జనవరి 11న బిగ్‌బాస్ ఫైనల్ జరగనుంది. ఈ వ్యవహారంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని జలంధర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment