
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్ ఏపీ సిట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అశోక్ 2, 3 రోజుల్లో బయటకు వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడమే ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు అచ్చం ఓటుకు కోట్లు కేసునే ఫాలో అవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మత్తయ్య ఏపీకి పరారవడం, తరువాత విజయవాడకు వెళ్లి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.
అప్పుడు మత్తయ్యను ఏపీ పోలీసులు వెనకేసుకురాగా ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే జరుగుతోంది. ప్రస్తుతానికి ఏపీ పోలీసుల సంరక్షణలోనే అశోక్ ఉన్నట్లు సమాచారం. అశోక్ కూడా అచ్చం మత్తయ్య తరహాలోనే ఈ కేసులో తన పేరును అన్యాయంగా ఇరికించారంటూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే అశోక్ బయటకు రాగానే తన డేటాను తెలంగాణ పోలీసులు తస్కరించారంటూ ఏపీ ప్రభుత్వం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఫిర్యాదు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
సిట్‌కు కీలక ఆధారాలు లభ్యం...
డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న అశోక్ కదలికలను పసిగట్టింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. డేటా చౌర్యం వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు సెల్ టవర్ లొకేషన్ చూపించినట్లు సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా కీలక అధికారులకు, రాజకీయ ప్రముఖలకు ఈ నంబర్ నుంచి కాల్స్ వెళ్లినట్టు తెలిసింది. ఇదే నంబర్లతో గత ఆరు నెలలుగా విస్తృతంగా అశోక్ మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో అశోక్ పలువురు ప్రముఖులతో జరిపిన ఫోన్ సంభాషణలను బట్టి ఈ కేసుకు, వాళ్లకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment