కిడ్నాప్‌నకు గురైన జసిత్
సాక్షి, మండపేట(తూర్పుగోదావరి): మండపేట పట్టణంలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. అప్పటివరకూ నాన్నమ్మతో కలిసి ఆడుకుని ఇంట్లోకి చేరుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఓ అపరిచిత వ్యక్తి నాన్నమ్మపై దాడి చేసి ఆ బాలుడిని ఎత్తుకెళ్లిపోయాడు. అప్పుడే విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు విషయం తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఘటన జరిగిన తీరును బట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ కిడ్నాప్ జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నూకా వెంకటరమణ, నాగావళి భార్యాభర్తలు. ఏడాది క్రితం బదిలీపై వీరు మండపేట వచ్చారు. వెంకటరమణ పట్టణంలోని యూనియన్ బ్యాంకులోను, నాగావళి కెనరా బ్యాంకులోను పీవోలుగా పని చేస్తున్నారు. స్థానిక విజయలక్ష్మి నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. వారి నాలుగేళ్ల కుమారుడు జసిత్‌ను అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూలులో యూకేజీలో చేర్పించారు. బాలుడి సంరక్షణను వెంకటరమణ తల్లి పార్వతి చూస్తోంది. జసిత్ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాన్నమ్మ పక్కనే ఉన్న స్కూల్ ఆవరణలోకి తీసుకువెళ్లి ఆడించి తీసుకువస్తూంటుంది. రోజూ మాదిరి సోమవారం సాయంత్రం జసిత్‌ను గ్రౌండ్‌కు తీసుకువెళ్లి ఆడించింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో అతడిని తీసుకుని అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుంది. అప్పటికే విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆ ప్రాంతమంతటా అంధకారం అలముకొంది. మెట్లు ఎక్కుతున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు.
నాన్నమ్మ పార్వతి.. రోదిస్తున్న తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళి
కరెంటు లేదా? అని పార్వతిని ప్రశ్నించాడు. లేదని ఆమె బదులిస్తున్న సమయంలో ఒక్కసారిగా బలంగా ఆమె దవడపై కొట్టి బాలుడిని లాక్కొని మోటారు సైకిల్‌పై ఎక్కించుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆమె ముఖంపై రక్తపు గాయాలయ్యాయి. పార్వతి వెంటనే తేరుకుని మోటారు సైకిల్‌ను వెంబడించినప్పటికీ చుట్టూ చీకటిగా ఉండటంతో ఆగంతకుడు ఎవరో గుర్తు పట్టలేకపోయింది. విధులు ముగించుకుని అదే సమయానికి ఇంటికి చేరుకున్న కుమారుడు, కోడలికి విషయం చెప్పడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. నాగావళి ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భిణి. వెంకటరమణ ఫిర్యాదు మేరకు మండపేట రూరల్ సీఐ కె.మంగాదేవి ఆధ్వర్యంలో మండపేట అర్బన్, రూరల్ ఎస్సైలు రాజేష్‌కుమార్, దొరరాజులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రామచంద్రపురం డీఎస్పీ జీవీ సంతోష్‌కుమార్ సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. బాలుడి నాన్నమ్మ పార్వతిని, తల్లిదండ్రులను విచారించారు. సంఘటన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడానికి కారణాలను ఆరా తీస్తున్నారు.
తెలిసినవారి పనేనా?
ఈ కిడ్నాప్ ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల అపార్ట్‌మెంట్‌లో ఉంచిన వెంకటరమణ ద్విచక్ర వాహనం చోరీ అవడం, తాజాగా ఆయన కుమారుడిని కిడ్నాప్ చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బాలుడి ఆచూకీ కోసం డీఎస్పీ జీవీ సంతోష్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలింపు చేపట్టారు. చుట్టుపక్కల పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. వెంకటరమణకు కుటుంబ పరంగా, వృత్తిపరంగా ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా? ఎవరినుంచైనా బెదిరింపులు వచ్చాయా అనే విషయమై పోలీసులు విచారిస్తున్నారు. ఆగంతకుడిని గుర్తించడం కోసం సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, అపరిచిత వ్యక్తుల సంచారంపై స్థానికులను ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment