ఇవి తింటే.. రోగాలు వెంటే.. | Beware: Vendors using dangerous chemicals to ripen fruits | Sakshi
Sakshi News home page

ఇవి తింటే.. రోగాలు వెంటే..

Published Wed, May 23 2018 12:48 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Beware: Vendors using dangerous chemicals to ripen fruits - Sakshi

మార్కెట్‌లో విక్రయానికి సిద్ధంగా ఉన్న మామిడి పండ్లు 

ఆసిఫాబాద్‌క్రైం : ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్‌ మొదలైం ది. చూడగానే నీళ్లూరించే మామిడి పండ్లను ఎం త ధర ఉన్నా కొనేందుకు జనం మొగ్గుచూపుతా రు. కాని వీటి వెనుక దాగి ఉన్న పచ్చి మోసాన్ని మాత్రం పసిగట్టలేక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. సంపాదనే ధ్యేయంగా వ్యాపారులు మార్కెట్‌లోకి వచ్చే పచ్చి కాయలను కృత్రి మంగా మాగబెడుతున్నారు.

కాల్షియం కార్బైడ్‌ వంటి నిషేధిత రసాయనాలను వినియోగించి ఒక్కరోజులోనే కాయల రంగు, రుచి మార్చేస్తున్నారు. జిల్లాలో 750 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ సారి ఈదురుగాలులు అధికంగా రావడంతో కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో జిల్లాలో మామిడి కాయలు దొరకక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

జిల్లాలో సుమారు 15 వరకు మామిడి పండ్ల గోదాములు ఉండగా వివిధ రకాల కాయలను అందులో నిల్వ చేస్తూ నిషేధిత రసాయనాలతో మాగపెట్టి పండ్లుగా మారుస్తున్నారు. ప్రధానంగా మామిడి సీజన్‌లో ఈ దందా జోరుగా నడుస్తున్నా అధికార యం త్రాంగం చోద్యం చూస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 

రాత్రికి రాత్రే పండుతున్నాయి

మార్కెట్‌లో సీజనల్‌ పండ్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. కాయలను సహజసిద్ధమైన పద్ధతుల్లో మాగబెట్టి పండ్లుగా మార్చే వరకు వినియోగదారులు, వ్యాపారులు ఓపిక పట్టే పరిస్థితి లేదు. దీంతో నిషేధితమైనా విషపూరిత కార్బైడ్, ఇథిలిన్‌ వంటి రసాయనాలను వినియెగించి రాత్రికి రాత్రే పండ్లుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇలాంటి రసాయనాలను ఉపయోగించి పండించిన పండ్లు తినడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండు సహజ సిద్ధంగా పక్వానికి వచ్చినపుడు తింటే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రమాదకర రసాయనాలు వినియోగించిన పండ్లు తినడం ద్వారా అజీర్తి, కడుపు నొప్పి, దురద, జీర్ణాశయం దెబ్బతింటుదని వైద్యులు చెబుతున్నారు.

కొత్త పంథాను ఎంచుకున్న వ్యాపారులు

జిల్లాలోని కొన్ని గోదాముల్లో కాయలను పండించేందుకు వ్యాపారులు సరికొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. కొత్తగా స్ప్రే ద్వారా మామిడి పండ్లపై రసాయనాలు చల్లుతున్నారు. గోదాముల్లో కాకుండా ఇళ్లలో మగ్గించి అవి పండిన తర్వాత గోదాములకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా సహజ సిద్ధమైన పండ్లు లేవనేది జగమెగిరిన సత్యమే అయినా అధికారుల మాత్రం తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

‘మామూళ్ల’ మత్తులో అధికారులు 

జిల్లాలో పెద్ద మొత్తంలో పండ్లను మగ్గించడం దందా నడుస్తున్నా అధికారులు మాత్రం ఇటువైపు చూడకుండా మూమూళ్ల మత్తులో మునిగిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనం జిల్లాలోని ఒక్క గోదాముల్లో కూడా ఇప్పటి వరకు తనిఖీలు చేయకపోవడమే. పదిహేను, నెల రోజులకు ఒకసారి అధికారులు వ్యాపారుల వద్దకు వచ్చి చేతులు తడుపుకుంటున్నట్లు సమాచారం.

కృత్రిమంగా పండించిన పండ్లు ఇలా ఉంటాయి..

æ    కృత్రిమంగా పండించిన పండ్లు చూడగానే ఆకట్టుకుంటాయి.
æ    సహజ పండ్లకు, కృత్రిమ పండ్లకు రుచిలో తేడా ఉంటుంది.
æ    మామిడి పండ్లు పండినా రుచి పుల్లగా ఉంటే రసాయనాలు వినియోగించినట్లుగా గుర్తించాలి.
æ    అరటి పండ్లు సైతం పైన పసుపు రంగులో ఉండి లోపల మగ్గకపోగా రుచిలో కూడా తేడా ఉంటుంది.
æ    ఈ పండ్లను పరిశీలిస్తే తెల్లటి మిశ్రమం ఉంటుంది.
æ    నీటిలో వేస్తే రంగు మారుతుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement