
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో జరిగిన ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిర్యానీ విక్రయిస్తున్న దళితుడు లోకేష్ (43)ను కులం పేరుతో దూషిస్తూ కొందరు భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. శుక్రవారం ఈ ఘటన జరగ్గా వీడియో మాత్రం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పలుసార్లు తాము హెచ్చరించినా అతను బిర్యానీ విక్రయిస్తున్నాడనే ఆగ్రహంతో వారు దళితుడిపై దాడికి తెగబడినట్టు స్ధానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనను ఖండిస్తూ నటి ఊర్మిళా మటోండ్కర్ ట్వీట్ చేశారు. భారతీయులుగా మనం అంటరానితనం పాటించడం మన సంస్కృతి కాదని, ఇది నాగరికం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. దళితునిపై దాడి ఘటన సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ ఉద్దేశానికి విరుద్ధమని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment